Home Blog Page 9

రైతులకు పరిహారం అందించాలి: సుహాసిని రెడ్డి

0

రైతులకు పరిహారం అందించాలి: సుహాసిని రెడ్డి

చిత్రం న్యూస్, భోరజ్:

గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పెనగంగా నది పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగి దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్వాడ, లేకర్వాడ, తరోడ గ్రామాల్లో శనివారంఆమె పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతుల వివరాలను రెవెన్యూ, వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించి డిసెంబర్‌లో జీవో జారీ చేసి నిధులు మంజూరు చేసినా, 6 నెలలు గడిచినా ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదని సుహాసిని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను చైతన్యం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పరిహారం అందేలా కార్యాచరణ రూపొందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లేకర్వాడ సర్పంచ్ ప్రభాకర్ తరోడ సర్పంచ్ అరవింద్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

0

*గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తాం

*రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

చిత్రం న్యూస్, ఉట్నూర్: పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

శనివారం ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కలు అందించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్‌ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేద, గిరిజన విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, షూస్, పుస్తకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, శారీరక దారుఢ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జూంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఉన్నత స్థానాలకు ఎదగాలి: ఎమ్మెల్సీ దండే విఠల్ 

ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, పేద, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఇంజనీర్లు, వైద్యులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, గిరిజన స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందిస్తూ అనేక మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

* పాఠశాలల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న డిజిటల్ బోర్డులు, సైన్స్ ల్యాబ్‌లు, ఇతర ఆధునిక సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు ఇటీవలి కాలంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా శిక్షణ, నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యార్థుల పోషకాహార స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఉమ్మడి జిల్లా ఐటీడీఏ పరిధిలోని 400కు పైగా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు రూ.20 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ సిబ్బంది కొరత, అత్యవసర ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ‘వికాసం స్కూల్’ ను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, ఆరోగ్యం, పోషకాహారం అందించి వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇతర అధికారులు విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, తదితరులు సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్, ఎస్‌ఈటిడబ్ల్యూ ఫణికుమారి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, ఆర్డీఓ మోహన్ సింగల్, డి. ప్రేమకళ, డీటీడీఓలు అంబాజీ, నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అనిత జాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షిషా

0

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హెచ్‌ఐవీ ఎయిడ్స్ నిర్మూలనకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్-2026’లో భాగంగా శనివారం స్థానిక స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

ముందుగా జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ల యొక్క క్యూఆర్ కోడ్ అవగాహన సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించి, ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బైక్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, మీదుగా అవగాహన కల్పిస్తూ తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు చేరుకుంది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ‘ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్’ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్క్రీనింగ్ పరీక్షలను కేవలం రిమ్స్, ఉట్నూర్, బోథ్ ప్రధాన ఆసుపత్రులకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణులు, క్షయ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూ, ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో ఉందని, రాబోయే రెండు నెలల కార్యాచరణ ద్వారా జిల్లాను పూర్తి ‘సురక్షిత స్థానం’లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, యువతలో అవగాహన పెంచడంతో పాటు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ చేపడతామని, ప్రజలు 1097 హెల్ప్‌లైన్ నంబర్, క్యూఆర్ కోడ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, డీవైఎస్ఓ దయానంద్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నాగరాజు, ఐసీటీసీ కౌన్లర్లు, పీహెచ్‌సీల వైద్యులు, వైద్య సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న

0

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని జోగు రామన్న సందర్శించారు. దీక్ష 12వ రోజుకు చేరుకోగా, సుభాష్‌నగర్‌కు చెందిన యువత పాల్గొన్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమైతే సుమారు 6,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంత కీలకమైన పరిశ్రమను రాజకీయ కోణంలో చూడటం సరికాదని అన్నారు.

సీసీఐ సాధన సమితి నాయకులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా “సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని” హామీ ఇచ్చారా? లేక అది అనుకోకుండా వచ్చిన మాటలా? అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పరిశ్రమ పునఃప్రారంభానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. “ఎక్కడ బీఆర్‌ఎస్ పార్టీకి పేరు వస్తుందోననే రాజకీయ ఆలోచనతో యువత భవిష్యత్తును పట్టించుకోకపోవడం సరికాదు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధను, ఉద్యోగాలు కల్పించే సీసీఐ వంటి పరిశ్రమలపై కూడా చూపాలి” అని జోగు రామన్న అన్నారు. సీసీఐ పునఃప్రారంభం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం టాస్క్ అధ్యయన కేంద్రంలో సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రకుమార్, జాన్ వెస్లీ, మాజీ ఎంపీ వినోద్, సీపీఎం నేతలు గోవర్ధన్, నంది రామయ్య, ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజారెడ్డి తదితరులు హాజరై సీసీఐ పునఃప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దీక్షాదారులు అన్నెలా వసంత్, ముక్కుల నరేష్, దికొండ అశోక్, శేఖర్, షేక్ సలీం, వంశీ, వీలీన్, రాహుల్, ఉషారెడ్డి, దస్తగిరి, సందీప్, కమిటీ సభ్యులు యూనిస్ అక్బని, ఇజ్జగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకట్ నారాయణ, ఈశ్వర్ దాస్, జై సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి

0

 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట పరికరాలు అందజేసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బేల మండలం వరుర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ఆట పరికరాలను ఆయన అందజేసి మాట్లాడారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన గ్రామాలలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారం అందించి క్రీడల్లో ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.క్రీడల్లో ఆసక్తి కనబరిచిన విద్యార్థుల మేధాశక్తి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుందని చదువుపై కూడా ఆ ఉత్సాహం ఉపయోగపడుతుందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనే విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు తాను ముందుంటానని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆత్రం సంతోష్, ఉప సర్పంచ్ భారత్, టీచర్ వినోద్, మాజీ సర్పంచ్ టేకం ఆయ్యూ,వార్డ్ మెంబర్ విజయ్, యువ నాయకులు విపిన్ టాక్రే,నాయన్ తదితరులు ఉన్నారు.

ఐటీ రంగాన్ని భారత్‌కు పరిచయం చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ: దుర్గం శేఖర్

0

ఐటీ రంగాన్ని భారత్‌కు పరిచయం చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ: దుర్గం శేఖర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ రంగాలను ప్రవేశపెట్టి “సాంకేతిక సమాచార విప్లవ పితామహుడు”గా నిలిచారని కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. రాజీవ్ ఆశయాల మేరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్, పట్టణ అధ్యక్షులు చంద్రాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది :  మాజీ మంత్రి జోగు రామన్న

0

బిరైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది :  మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేసి అనుకుంట గ్రామ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం శాంతినగర్‌లోని తన నివాసానికి వచ్చిన అనుకుంట గ్రామ రైతులు, గ్రామస్తులతో మాజీ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. గ్రామస్తులు తమ సమస్యలను వివరించి, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా అనుకుంట గ్రామస్తులను అయోమయం, ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు, గ్రామస్తులకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

గతంలో కలెక్టర్‌ హైమద్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే, ప్లానింగ్‌ ప్రకారమే ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ నిర్ణయాలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు. గతంలో రూపొందించిన ప్రణాళికను పక్కన పెట్టి కొత్తగా అనధికారిక డీపీఆర్‌ రూపొందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌ పట్టణానికి ఆనుకుని ఉన్న అనుకుంట గ్రామం సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూములపై ఆధారపడి ఉందని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భూములు 68 సర్వే నంబర్‌లో ఉన్నప్పటికీ, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. స్వలాభం కోసం డీపీఆర్‌ను మార్చి రైతుల భూములకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై పూర్తి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనుకుంట గ్రామ రైతులు, గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం లభించే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని జోగు రామన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రి, మంచాల మల్లయ్య, కడదరపు అశోక్‌, రావుల రమేష్‌, భూమయ్య, మోహిన్‌, రావుల సోమన్న, జక్కుల సత్యనారాయణ, బండి సాగర్, దూడ రాజేశ్వర్, ముఖ్యర శ్రీను, కమిటీ రమేష్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

చేతి పంపును ప్రారంభించిన సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి

0

చేతి పంపును ప్రారంభించిన సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేలమండలం సిర్సన్న గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో  బిగించిన చేతి పంపును గ్రామ సర్పంచ్ క్యాతం పోచక్క సురేష్ రెడ్డి, బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీపక్ గౌడ్, బాలవికాస కమిటీ సభ్యులు కాట్పెల్లి కిష్టారెడ్డి,కాడే రూపేష్, ఏముల భూమారెడ్డి, ఎల్టి కిష్టారెడ్డి, గ్రామ పెద్దలు కళ్ళెం మల్లారెడ్డి, బాలవికాస సంస్థ తరఫున ప్రశాంత్, ఏరియా కోఆర్డినేటర్ నరేందర్  మహిళలు  తదితరులు పాల్గొన్నారు.

 

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: సుహాసిని రెడ్డి

0

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: సుహాసిని రెడ్డి

చిత్రం న్యూస్, బేల: గత ఏడాది పెన్ గంగా నది వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. బుధవారం బేలలో రైతులతో సమావేశమైన ఆమె, “గత డిసెంబర్‌లో జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసినా ఆరు నెలలైనా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం” అని విమర్శించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే ధర్నాలు, ర్యాలీలు చేస్తామని హెచ్చరించారు. “రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతులు, నాయకులు సుఖ్ దేవ్, గోపాల్ కడ్సే, వెంకట్ రెడ్డి, ప్రకాశ్, ఆశిష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

అవాల్ పూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

0

అవాల్ పూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిత్రం న్యూస్, బేల: బేల మండలం అవాల్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్,  ఉప సర్పంచ్ దినేష్ వార్డు సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కొత్త స్మార్ట్ కార్డులతో రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్డులు అందుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుధాంరెడ్డి, నగేష్ రెడ్డి, నరేందర్, రాకేష్ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.