హంపోలి గ్రామంలో చెరువు మరమ్మత్తుల పనులకు శ్రీకారం
*రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో పనులను ప్రారంభించిన ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని హంపోలి గ్రామంలో రూ.39.50 లక్షల ఇరిగేషన్ నిధులతో చేపట్టనున్న చెరువు మరమ్మత్తుల పనులను ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో చెరువుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యంగా పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం చెరువులు గ్రామాలకు జీవనాధారమని పేర్కొన్నారు.చెరువులు నిండుగా ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటిమట్టాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై చెరువులను పరిరక్షించుకోవాలని, చెరువుల ఆక్రమణలు, కాలుష్యాన్ని నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న ఇటువంటి అభివృద్ధి పనులు రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. చెరువు మరమ్మత్తుల పనులు పూర్తయితే సాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

