Home Blog Page 7

ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ

0

ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉట్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులపై బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్రవేత్త డా. వేముగంటి వరప్రసాద్ రావు రచించిన _”Floristic Composition and Species Diversity of Utnoor Forest of Adilabad District, Telangana”_ అనే గ్రంథాన్ని రాష్ట్ర ఆదివాసీ నాయకులు పూసం సచిన్ కు మర్యాదపూర్వకంగా బహూకరించారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ.. డా. వరప్రసాద్ రావు చేస్తున్న వృక్ష శాస్త్ర పరిశోధనలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని గ్రంథాలు రాసి ఆదివాసీలతో పాటు సమాజానికి పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో అనికేత్, RTI మండల ఉపాధ్యక్షుడు ఉరాడే సాహిల్ తదితరులు పాల్గొన్నారు.

భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ 

0

భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి )గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించారు.  శ్రావణమాసం పురస్కరించుకొని పార్డి (బి )గ్రామానికి చెందిన 10 మంది కలిసి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సమీపంలోని కైలాస్ టేక్డి ఆలయానికి  ఒకే జీపులో దర్శనానికి వెళ్లారు.  మళ్ళీ అక్కడినుంచి మహారాష్ట్రలోని సాసర్ కుండ్ వద్ద ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తుండగా తోటుంబ సమీపంలో జీపు ముందు టైరు పేలి వాహనం బోల్తా పడి నలుగురు మృతిచెందారు.  క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పోస్టుమార్టం గదిలో మృతదేహాలను పరిశీలించి, జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని బాధితులను ఓదార్చారు. అనంతరం డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జీడీఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఓకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిందిగా డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్

0

దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్

చిత్రం న్యూస్, బేల:  రాం లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం, అక్కడ ‘శుద్ధీకరణ’ పేరిట యజ్ఞం నిర్వహించి దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో దళితులను కించపరిచేలా వ్యవహరించిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి కదరపు దేవిదాస్, బేల మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధ్యక్షుడు నడికుంట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదును అందజేశారు. దళితుల పట్ల వివక్ష చూపిన సదరు నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బేల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ రాందాస్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ఉప సర్పంచ్ సాగర్ అబ్దుల్ కరీం, ఘన్ శ్యామ్, యూత్ అధ్యక్షుడు రాజు, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి 

0

గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి 

చిత్రం న్యూస్, బాసర: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అధిక ప్రాధాన్యమిస్తోందని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బాసర మండలంలోని దొడాపూర్, కిర్గుల్-బి, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలో దోడాపూర్‌ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ చేశారు. అనంతరం కిర్గుల్-బి గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మహిళా సమైక్య సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.  బాసర మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాసరలో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్‌ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రోడ్డులేని ఆదివాసీ గూడాలకు దారి చూపిన యూత్ కాంగ్రెస్ నేత

0

రోడ్డులేని ఆదివాసీ గూడాలకు దారి చూపిన యూత్ కాంగ్రెస్ నేత

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాయ్‌పూర్-కె, రాయ్‌పూర్-టీ గ్రామాల ప్రజలు ఏళ్లుగా రోడ్డు లేక నరకం చూస్తున్నారు. అటవీ నిబంధనలతో అధికారులు రోడ్డు వేయకపోవడంతో గర్భిణులు, రోగులను 4 నుంచి 5 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ విషయం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి రాగా  ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు స్పందించకపోవడంతో సోమవారం తన సొంత నిధులతో జేసీబీని తీసుకువచ్చి రెండు గ్రామాలకు తాత్కాలికంగా రోడ్డు వేయించారు. దీంతో ఆదివాసీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రూపేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వత రోడ్డు కోసం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకం నాగారావు, మాజీ ఉపసర్పంచ్ కాటోడా, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, యువ నాయకుడు నాయన్ పాల్గొన్నారు.

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

0

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: అన్నాభావు సాఠే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేలా కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జోగు రామన్న మొదటగా అన్నాభావు సాఠే, లాహుజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జోగు రామన్నను స్థానికులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

గురుకులాలతోనే నాణ్యమైన విద్య: సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో బీసీ, మైనార్టీ తదితర గురుకుల విద్యాసంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ గురుకులాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి.. నేడు ఇంజినీర్లుగా, వైద్యులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే, ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పది ఎకరాల స్థలాన్ని కేటాయించి, విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

ఉన్నత స్థానాలకు చేరుకోవాలి:అన్నాభావు సాఠే గొప్ప సాహితీవేత్తగా, సామాజిక చైతన్యవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా తల్లిదండ్రులు, సమాజ పెద్దలు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, దమ్మపాల్, సచిన్, గైక్వాడ్ యాదవ్, సునీల్ వాగ్మారే, సూర్యవంశీ, శివాజీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

హల్ద్వానీ “శుద్ధీకరణ” ఘటనపై FIR నమోదు చేయాలి – బిక్కీ గంగన్న

0

హల్ద్వానీ “శుద్ధీకరణ” ఘటనపై FIR నమోదు చేయాలి – బిక్కీ గంగన్న

చిత్రం న్యూస్, జైనథ్: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం “శుద్ధీకరణ” కార్యక్రమం నిర్వహించిన వారిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద FIR నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యదర్శి బిక్కీ గంగన్న డిమాండ్ చేశారు. సోమవారం జైనథ్ పోలీస్ స్టేషన్ లో జైనథ్, సాత్నాల ఎస్సీ విభాగం అధ్యక్షులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిక్కీ గంగన్న మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించిందని, ఒక దళిత నాయకుడు పాల్గొన్న సభా ప్రదేశాన్ని శుద్ధీకరణ పేరుతో శుభ్రం చేయడం కుల వివక్షకు, మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. “బీజేపీకి దళితులంటే ఎందుకు ఇంత చిన్నచూపు? దళితులు కేవలం ఓట్లు వేయడానికేనా? జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎదగకూడదా?” అని ప్రశ్నించారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, కోట్లాది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. ఈ ఘటనను బహిరంగంగా సమర్థించిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్ పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోడిచెర్ల పొచ్చన్న, సాత్నాల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుమ్మడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ    

0

వీబీ జీరాంజీపై ప్రత్యేక గ్రామసభ    

చిత్రం న్యూస్, బాసర: బాసర మండలంలోని ఓని గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వీబీ జీరాంజీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టబోయే నూతన పనుల ప్రణాళిక రూపకల్పన కోసం ఈ సభను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్,ఉప సర్పంచ్. పురుషోత్తం,ఏపీవో సదానంద చారి, టెక్నికల్ అసిస్టెంట్ రాజు,పంచాయతీ కార్యదర్శి మధుకర్ రావు సంయుక్తంగా హాజరై,పథకం ద్వారా గ్రామానికి వచ్చే నిధులు, చేపట్టే పనుల గురించి గ్రామ ప్రజలకు సమగ్రమైన అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి కూలీలు,గ్రామస్తులు అందరూ సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, ఓని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేఆర్కే కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

0

కేఆర్కే కాలనీలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పట్టణంలోని కేఆర్కే కాలనీలో సోమవారం  ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గత కొంతకాలంగా విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అధికారులు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. పాత స్తంభాలు శిథిలావస్థకు చేరడం, వైర్లు కిందికి వేలాడుతుండటంతో స్థానికులు ప్రమాదాల భయంతో గడిపేవారు. ఈ సమస్యపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కేఆర్కే కాలనీ కౌన్సిలర్ దుమ్మని రజిత రాము, ప్రజాప్రతినిధుల సహకారంతో కొత్త స్తంభాలను మంజూరు చేశారు. సోమవారం ఉదయం కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటుచేసి, వాటికి కొత్త విద్యుత్ వైర్లను అమర్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రజిత రాము మాట్లాడుతూ.. కొత్త స్తంభాల ఏర్పాటుతో తమకు మా కాలనీవాసులకు లో-వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు, నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’

0

* డే కేర్‌ సెంటర్‌లో వృద్ధులతో కలసి అల్పాహారం చేసిన కలెక్టర్‌ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వృద్ధాప్యంలో ఒంటరితనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. వయోవృద్ధులకు సాంత్వన, మానసిక ఉల్లాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వృద్ధులంతా ‘ప్రణామ్‌’ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం ‘ప్రణామ్‌’ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. వృద్ధులకు అందుతున్న సేవలు, కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ స్వయంగా వృద్ధులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలసి అల్పాహారం చేశారు. తమతో కలసి కూర్చొని ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్‌కు సీనియర్‌ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మారుతున్న జీవన విధానంతో వయోవృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా పగటి సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలతోపాటు మానసిక ప్రశాంతత, సామాజిక భద్రత కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. కేంద్రంలో అందించే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ, వినోద కార్యక్రమాలు, పరస్పర ఆత్మీయత వృద్ధుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్‌ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.