Home Blog Page 28

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్ నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలలో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు మంగళవారం పలు సూచనలు చేశారు. ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లతో, ఇతర మండల స్థాయి అధికారులతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8.00 గంటల నుండి 10.30 గంటల లోపు సభలు ముగిసేలా ప్రణాళిక రూపొందించూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల వివరాలు చదివి వినిపించాలని, లబ్ధిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చూడాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అందరూ భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ కార్యక్రమం గురించి సభల్లో తెలియజేయాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సభల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు 

0

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) బాసర ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. క్యాంపస్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో, డా.రెవెల్లి అజయ్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, వివిధ విభాగాల డీన్స్ హాజరై, డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ.. డా.బీ.ఆర్. అంబేద్కర్ జాతికి చేసిన విశేష సేవలను, ఆదర్శాలను, సమాజ సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ జయంతి ఉత్సవాలలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అణగారిన వర్గాల చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని, ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన క్యాలెండర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్  రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అసిస్టెంట్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అనూష బండారి సతీష్, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి గురు రావిదాస్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. చర్మకార వృత్తిలో పుట్టినా, తన ఆధ్యాత్మిక కవితల ద్వారా మూఢనమ్మకాలపై పోరాడి, కుల విభేదాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఆయన మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్, గురు రావిదాస్ వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సామాజిక సమరసత వేదిక బాధ్యులు అప్పల ప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యుదయ భావాలను చాటడానికి చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కావల్ల రమేష్, బాలశంకర్ ప్రవీణ్,సామ రమేష్ రెడ్డి, మెస్రం రాజేశ్వర్, ఓటర్కర్ సంతోష్  వివిధ దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దళిత, యువజన సంఘాల సమితి ప్రతినిధులు ముఖ్య అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి గౌరవించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింలు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత మనోహర్ తదితరులు హాజరయ్యారు.

దళిత సంఘాల ప్రతినిధులు బాలశంకర్ కృష్ణ, దుర్గం శేఖర్, ఊరే గణేష్, భీంరాం వాగ్మారె, అల్లూరి భూమన్న, మాల్యాల మనోజ్, నక్కా రాందాస్, చందన రాజన్న, కౌన్సిలర్లు బోడిగం శ్రీకాంత్, కృష్ణ, సంజయ్, కడ్డారపు ప్రవీణ్, దర్శనాల నగేష్, మరెల్లి మల్లేష్, అశోక్, సోగల సుదర్శన్, నిమ్మల ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు.

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ ప్రవచించిన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాలన సాగిస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపి పార్టీ జైనథ్ గ్రామ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, స్థానిక నాయకులు అన్నెల అశోక్, సూర్య రెడ్డి, శరత్, పొచ్చన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, నగరంలో పులాంగ్ చౌరస్తాలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి టీఎన్జీవో పక్షాన పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్: బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు ముఖ్య సూత్రాలే మన దేశ సర్వతోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని,… అన్ని రంగాలలో సమానత్వాన్ని పాటించినప్పుడే ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అని, టీఎన్జీవో ఆధ్వర్యంలో కుల,మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతూ.. ఆ మహానుభావునికి ఆదర్శంగా ఉంటు బాబాసాహెబ్ వారసులుగా కొనసాగుతూ వారి ఆశయ సిద్ధికి పాటుపడతామన్నారు. టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు నిరంజన్ గౌడ్, స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

* ధర్నాకు మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ చేపట్టిన ధర్నాకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగులు కొత్త డిమాండ్లను ఏమి అడగడం లేదని పాత వాటిని అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా విద్యార్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండే విధంగా చూడాలన్నారు. పని దినాలను తగ్గించి న్యాయం చేయాలన్నారు. గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నా…ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు.

ఉద్యోగులకు మద్దతుగా తన వంతుగా లేఖను అందజేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖామంత్రి బట్టి విక్రమార్క కు వచ్చే మూడు రోజుల్లో లేఖను అందజేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు గంగాధర్,  రవి షాదుల్లా సతీష్, బీజేపీ కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, కల్పే అర్చనా చిరంజీవి, ఇప్పకాయల సుమిత్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సమానత్వానికి ప్రతీక అంబేద్కర్: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

సమానత్వానికి ప్రతీక అంబేద్కర్: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : సమానత్వానికి ప్రతీక, అణగారిన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, ఆయన గొప్ప ఆలోచనాపరుడు అని కొనియాడారు. సమాజంలో అన్యాయం ఎదురైతే పోరాడాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు అని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలవాలని ఉద్దేశంతో దేశంలో పంచ తీర్థాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, ట్రస్టు ప్రతినిధులు ధన్ పాల్ ఉదయ్, డాక్టర్ ధన్ పాల్ వినయ్, నాయకులు కృష్ణ మారావార్, పవన్ ముందడ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాలు నివారించాలి..ప్రాణాలను రక్షించాలి: డీజీపీ శివధర్ రెడ్డి 

 ప్రమాదాలు నివారించాలి..ప్రాణాలను రక్షించాలి: డీజీపీ శివధర్ రెడ్డి  

జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన  డీజీపీ శివధర్ రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప రిధిలోని ఇందల్వాయి మండలం 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు. వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అనంతరం “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు) సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి, ఏ ఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఇన్ ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి , డిచ్పల్లి సీఐ కె వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్ , ఇందల్ వాయి ఎస్ఐ. జి.సందీప్ , ఈ -డార్ మేనేజర్ వర్ష , ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ వంశీధర్ , టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు , గ్రామ సర్పంచ్ రఘు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు

0

రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు

*ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగాను*

*అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే భారతదేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాజ్యంగంలో ఆలిండియా సర్వీసెస్ గురించి పొందుపర్చిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐ.ఏ.ఎస్ కాగలిగానని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ 135 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు,ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యార్జన దిశగా ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని అన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ. లక్షా ఎనిమిది వేల చొప్పున నిధులను ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని మార్గ నిర్దేశం చేశారు. నిజామాబాద్ నగరంలో అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిస్తూ, అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నగర మేయర్ కే.ఉమారాణి మాట్లాడుతూ, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తున్నాయని, అంబేద్కర్ అందరి వాడు అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ లు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు. సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు. మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీటీసీ దుర్గా ప్రమీల, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ గంగారాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.