Home Blog Page 16

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సేవా దృక్పథంతో పనిచేస్తూ రోగుల ప్రాణాలు కాపాడే నర్సులు, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవ’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం నర్సులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, రోగుల కోలుకోవడంలో వారి సేవలు అత్యంత కీలకమని కొనియాడారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు నర్సులను కలెక్టర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకల్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరిండెంట్లు కల్పన, రమాదేవి, ఉమతో పాటు ఇతర వైద్య అధికారులు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసును తెరపైకి తెచ్చి బీజేపీని, బండి సంజయ్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

*మహిళల పక్షపాతి బీజేపీ: బీజేపీ ఎల్లప్పుడూ మహిళలను గౌరవించే పార్టీ అని, పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత తమదేనని పాయల్ శంకర్ గుర్తు చేశారు. ఆ బిల్లు వీగిపోవడానికి కారణమైన పార్టీలే నేడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.

*విచారణకు సిద్ధం: “తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేసింది. విచారణకు తాము సిద్ధమని బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. కానీ నిజానిజాలు తేలకముందే ఒక బీసీ బిడ్డను దోషిగా చిత్రీకరించడం సరికాదు” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి సూచించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగు రవి, రఘుపతి, కుంచెట్టి సంతోష్, దారట్ల జీవన్, దయాకర్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

0

బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

చిత్రం న్యూస్, బేల: ఈ నెల 13 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా వహీద్ ఖాన్, డిపార్ట్‌మెంటల్ అధికారిగా సంతోష్‌ను నియమించారు. ఫస్టియర్ జనరల్ 141 మంది, ఒకేషనల్ 10 మంది, సెకండియర్ జనరల్ 63 మంది, ఒకేషనల్ ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సీటింగ్ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

0

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులకు మంగళవారం పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాయల్ ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్గదర్శకత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్ శంకర్ ఫౌండేషన్ సభ్యులు, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, నాయకులు చిలుకూరి లింగారెడ్డి, అశోక్, సురేష్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా

0

యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘విద్యా వారోత్సవాల’ సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్, బడి బాట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా సమ్మర్ క్యాంపులో స్వయంగా తబలా, హార్మోనియం వాయించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినోద్ రెడ్డి, సర్పంచ్ నీరోష్, ఉప సర్పంచ్ దత్తు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మామిళ్ల పార్వతి, ఎంఈఓ రమేష్ రెడ్డి, ఏఏమో లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రఘు రమణ, సంతోష్, లింగు, ఇతర అధికారులు, విద్యార్థులు, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

ఉట్నూరులో ఈ నెల 15న మెగా జాబ్ డ్రైవ్: కలెక్టర్ రాజర్షి షా పోస్టర్ ఆవిష్కరణ

0

ఉట్నూరులో ఈ నెల 15న మెగా జాబ్ డ్రైవ్: కలెక్టర్ రాజర్షి షా పోస్టర్ ఆవిష్కరణ 

చిత్రం న్యూస్, ఉట్నూర్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మెగా జాబ్ డ్రైవ్-2026’ నిర్వహించనున్నారు. జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ ఉట్నూర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఉపాధి మేళా వాల్ పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ సహా 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్‌లో మేళా ప్రారంభమవుతుంది. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, రెజ్యూమ్ లతో హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  సంప్రదించాల్సిన నంబర్లు:* 9989717139, 9494559027, 9553141962.

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం

0

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం

చిత్రం న్యూస్, బేల: తెలంగాణ విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన డిజిటల్ స్క్రీన్‌ను ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భగవాండ్లు మాట్లాడుతూ విద్యార్థులకు కీలక మార్గదర్శకత్వం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలలో అంకితభావం, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉత్తమ అధ్యాపకులచే బోధన అందుతోందని గుర్తుచేశారు. విద్యార్థులకు అవసరమైన స్కాలర్‌షిప్‌లు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రక్షిత మంచినీటి సౌకర్యం, అత్యాధునిక ప్రయోగశాలలు వంటి అన్ని వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు.అకడమిక్ చదువులతో పాటు రాబోయే పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధునిక దృశ్య శ్రవణ పరికరాలను (డిజిటల్ స్క్రీన్లు) ఉపయోగించుకోవాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును అందుకోవడమే కాకుండా, సమాజంలో ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు నరేందర్, రూపేందర్ రెడ్డి, మొహమ్మద్ వైద్ ఖాన్, వినోద్, ఎబివిపి నాయకుడు హరీష్ మడావార్, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

0

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జనాభా గణన ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ‘సెన్సస్ వాక్/మారథాన్’ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా మారథాన్‌లో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, డీఆర్ఓ స్రవంతి, డీవైఎస్ఓ శ్రీనివాస్, ఈడీ మనోహర్, మెప్మా పీడీ రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ విజయవంతమైంది. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పర్వతగిరిలో సనాతన హిందూ సేవా సమితి ఉదారత

0

పర్వతగిరిలో సనాతన హిందూ సేవా సమితి ఉదారత

గోమాతలకు గ్రాసం, పేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ

చిత్రం న్యూస్ (పర్వతగిరి), వరంగల్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న సనాతన హిందూ సేవా సమితి పర్వతగిరిలో మరోసారి తన ఉదారతను చాటుకుంది. సంస్థ ఆధ్వర్యంలో ఒకే రోజు రెండు విభిన్న వినూత్న సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

గోమాతలకు రెండు నెలల గ్రాసం పంపిణీ: సమితి ఆధ్వర్యంలో 186వ సేవా కార్యక్రమాన్ని స్థానిక గోశాలలో చేపట్టారు. గోరక్షణలో భాగంగా గోశాలలోని గోమాతలకు రెండు నెలలకు సరిపడా ఎండుగడ్డి (గ్రాసం) అందజేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా: చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ఇద్దరు ఆడపిల్లల చదువులు, పోషణ భారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కట్టా రాధిక అనే మహిళను సమితి సభ్యులు ఆదుకున్నారు. 187వ కార్యక్రమంగా ఆమె కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, సలహాదారు అంచూరి వేణుగోపాల్, ప్రతాపగిరి గణేష్, గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్ తదితరులు పాల్గొన్నారు.

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్

0

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం ( ఎండీఎం ) వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ సీపీఐ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎండీఎం రాష్ట్ర కమిటీ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు నాయకత్వంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎండీఎం కార్మికులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుంటాల రాములు మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా బడి పిల్లలకు పోషకాహారం అందిస్తున్న ఎండీఎం కార్మికులను ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.10 వేల హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

యూనిఫాం, రూ.10 లక్షల ప్రమాద బీమా, వయసు పైబడిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ కల్పించాలని మహాసభలో తీర్మానించారు. జూన్ నెలలోగా వేతనాలు పెంచకుంటే స్కూళ్లు తెరిచేలోపు వంటలు బంద్ చేసి జిల్లా వ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కుంటాల రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి, గంగామణి, శశికళ, రాంబాయి, పుష్పలత, శకుంతల, రాజారామ్, యశ్వంత్, సుజాత, సునీత, బుజ్జక్క, కోశాధికారిగా ఉప్మా బాయిలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సీపీఐ జిల్లా నాయకులు మెమెంటోలు అందజేశారు.