రాజీవ్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కో-ఆర్డినేటర్ కుసుమ్ ఆలం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యువతకు పెద్దపీట వేశారని, పంచాయతీరాజ్ చట్టం ద్వారా మహిళలకు అవకాశం కల్పించారని కొనియాడారు. దేశంలో ఐటీ రంగానికి పునాది వేసి భారత్ ఐటీ రంగంలో ముందుండడానికి కారణమయ్యారని తెలిపారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల కోసం తన జీవితాన్ని సమర్పించారని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులో అసాంఘిక శక్తుల చేతిలో స్వర్గస్తులవడం బాధాకరమని, ఆయన ఇంకొన్ని రోజులు బతికి ఉంటే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సెద్మకి ఆనంద్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవిదాస్ చారీ, గౌలి సంజయ్, సుమ, మందకిని, ఉయకే అనసూయ, మున్సిపల్ కౌన్సిలర్ స్వాతి మంగేష్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
