మాజీ సీఎం కేసీఆర్ పై వినూత్న అభిమానాన్ని చాటిన రైతులు
చిత్రం న్యూస్, జైనథ్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై ఉన్న అభిమానాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్న రీతిలో చాటుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే ‘పొలాల అమావాస్య’ (పోలా) పండుగ వేడుకల్లో భాగంగా జైనథ్ మండలం కరంజి (కె) గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ ఎడ్లను గులాబీ రంగు బ్యానర్లతో ముస్తాబు చేశారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తుచేసుకుంటూ, తమ కాడెద్దులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్నల చిత్రాలతో కూడిన గులాబీ రంగు వస్త్రాలను కప్పి గ్రామంలో ఊరేగించారు. “మళ్లీ రావాలి కేసీఆర్.. రైతన్నకు భరోసా.. పేదలకు ఆశా..” అంటూ బ్యానర్లపై రాసి ఉన్న నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడిపై పండుగ వేళ రైతన్నలు ప్రదర్శించిన ఈ రాజకీయ అభిమానం ఇప్పుడు స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. గులాబీ శ్రేణులు, నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తూ రైతుల అభిమానానికి ఫిదా అవుతున్నారు.

