* విదేశీ విద్యకు బాటలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య (మాస్టర్స్/డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి” పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఆగస్టు/సెప్టెంబర్ (ఫాల్ సెషన్)కు సంబంధించి ఈ ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ పథకం కింద మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలని, దరఖాస్తు చేసే సమయానికి వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదని పేర్కొన్నారు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో పాటు, జిఆర్‌ఇ (260 మార్కులు) లేదా జి-మ్యాట్ (500 మార్కులు), టోఫెల్ (60 మార్కులు) లేదా ఐఇఎల్‌టిఎస్ (6.0) లేదా పిటిఇ (50 మార్కులు) పరీక్షలలో ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలని అర్హతలను వివరించారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు http://www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
