Home Blog Page 31

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాదు టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనీ శాస్త్రి నగర్ గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు.

కొవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని మర్డర్ల తో 40 మంది చనిపోయారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని, కృషి అనేది ప్రతి గ్రామము నుండి మొదలవ్వాలని గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు శాస్త్రి నగర్ గ్రామం నుండి ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించినట్లు అయితే ఇట్టి గ్రామము నుండి ద్విచక్ర వాహనదారులను  ఐపీల్ మ్యాచ్ తిలకించడానికి ఉచితంగా పంపివ్వడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , నిజామాబాద్ సౌత్ రూరల్ సురేష్ కుమార్ , ట్రాఫిక్ సీఐ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్ , జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్ ఎస్సై డి శ్రీకాంత్ , గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా డా. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు

భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా డా. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో:   భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో B. R. అంబేద్కర్ ముందస్తు జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు . ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.

ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా.రఘునాథ్ మాట్లాడుతూ, అంబేడ్కర్ జీవితం నేటి యువతకు గొప్ప ప్రేరణ అని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి ప్రపంచ స్థాయికి ఎదిగి, భారతదేశానికి గౌరవం తెచ్చిన మహానుభావుడని కొనియాడారు.

అస్పృశ్యత నిర్మూలన, సమానత్వం, మహిళాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించి దేశ స్థిరత్వానికి బలమైన పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ క్యూ ఏసి సమన్వయకర్త డా.రవికుమార్, డా. జే.భీమారావు, డా. శంకర్, డా. కొసరి సంతోష్, డా. ఓం ప్రకాష్, రామ్ మోహన్ తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్, తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట స్థావరంపై సోమవారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఆరుగురు వ్యక్తులతో పాటు 3 కార్లు, 6 సెల్ ఫోన్లు, రూ.1,17,940 నగదు స్వాధీనం చేసుకొన్నట్లు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీసులకు అప్పగించామన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు దాడి చేశామన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 

డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు ఒక్కటి కూడా కేటాయింకాలేదన్నారు. అర్హులైన పేదలు ఎందరో ఉన్నారని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేయాలన్నారు. మొత్తం రూ.5.91 కోట్ల విలువ గల 591 కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నగర మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

* ఊరూరా అరైవ్ – అలైవ్ గ్రామ సభలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ ల అధ్యక్షతన అరైవ్ – అలైవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన తొమ్మిది మంది సభ్యులు గల రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మన దేశంలో, రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ – అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. హెల్మెట్ ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయాలలో ప్రాణాలను రక్షించే శిరస్త్రాణంను ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్టు ధరించాలని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. ఈ విషయాలపై వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ పెద్దలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రహ్-వీర్ కింద 25 వేల రూపాయల ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయపడితే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అపోహలను విడనాడి, విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చే నెల మే 1వ తేదీ నుండి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలని, గ్రామంలో ప్రతి ఒక్కరు తప్పక హెల్మెట్ ధరించాలని, రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే డీ.జేలను నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా, డిప్యూటీ రవాణా కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ నాయకుల వినతి

 

శనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ నాయకుల వినతి 

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన శనగ కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం  తహసీల్దార్ (MRO) కార్యాలయంలో RI ఉల్లాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు మాజీ మండల అధ్యక్షుడు సర్సన్ లింగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులుగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నిలిచిపోయిన శనగ సేకరణను వెంటనే ప్రారంభించలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక  ఎమ్మెల్యే , కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, నాయకులు సోమ రాంరెడ్డి, గణేష్ యాదవ్, పూండ్రు వెంకట్ రెడ్డి ఇతర నాయకులు మ పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్, వినాయక్ చౌక్‌లో ఏప్రిల్ ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాల నుండి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భవ్య శ్రీరామ నామ సంకీర్తనం కార్యక్రమం జరగనుంది. ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా డాక్టర్ వారె దస్తగిరి ( ఆర్ ఎస్ ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచార ప్రముఖ్), పిట్ల కృష్ణ మహారాజ్ (వింగేశ్వర ఆశ్రమము, మల్లారం, ఇందూరు),  సంత్ సురేష్ మహరాజ్ (దేవగిరి ప్రాంత ఉపాధ్యక్షులు) హాజరుకానున్నారు. కుల, వర్ణ, ప్రాంత భేదం లేకుండా హిందూ బంధువులందరు కుటుంబ సమేతంగా పాల్గొని హిందువుల ధార్మికతను, ఐక్యతను చాటుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, బాసర : ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ కిరణ్ కుమార్ అన్నారు.  ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాసర గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ధరించాలన్నారు. మన కోసం ఇంట్లో భార్యా, పిల్లలు ఎదురుచూస్తుంటారని, వాహనం జాగ్రతగా నడుపుతూ గమ్యం చేరుకోవాలని సూచించారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, మట్కా, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వాటికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, ఈవో ప్రసాద్ గౌడ్, కాంప్లెక్స్ హెచ్ ఎం నర్సయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశాయ్, ఆత్మ డైరెక్టర్ జలిల్, వార్డు మెంబర్ లు కృష్ణ, ఫసియొద్దిన్, ఫారుఖ్, నానం సాయిలు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.