రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు
* ఊరూరా అరైవ్ – అలైవ్ గ్రామ సభలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ ల అధ్యక్షతన అరైవ్ – అలైవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన తొమ్మిది మంది సభ్యులు గల రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మన దేశంలో, రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ – అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. హెల్మెట్ ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయాలలో ప్రాణాలను రక్షించే శిరస్త్రాణంను ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్టు ధరించాలని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. ఈ విషయాలపై వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ పెద్దలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రహ్-వీర్ కింద 25 వేల రూపాయల ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయపడితే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అపోహలను విడనాడి, విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చే నెల మే 1వ తేదీ నుండి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలని, గ్రామంలో ప్రతి ఒక్కరు తప్పక హెల్మెట్ ధరించాలని, రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే డీ.జేలను నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా, డిప్యూటీ రవాణా కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

