Home Blog Page 25

ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు

0

ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన గిమ్మ సంతోష్ రావు, అడ్డి భోజా రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాజ్ గోండు సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు సోయం బాపూరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు అడ్డి భోజా రెడ్డి, నాయకులు డేరా కృష్ణారెడ్డి, నరేష్ రెడ్డి, ఎం.ఏ. ఖయ్యుమ్ తదితరులు సోయం బాపూరావ్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని బాపూరావ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

మూగజీవాల దాహార్తి కోసం నీటి తొట్టె ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి 

0

మూగజీవాల దాహార్తి కోసం నీటి తొట్టె ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి 

చిత్రం న్యూస్, మావల:  భానుడు భగ భగమంటూ ప్రతాపం చూపిస్తున్నాడు.  ఆ మండే ఎండలతో మూగజీవాలు సైతం నీటి కోసం వెంపర్లాడుతున్నాయి. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బట్టి సావర్గాం గ్రామ సర్పంచ్ నీటి తొట్టెను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ శివారులో పశువుల కోసం పంచాయతీ నిధులతో తొట్టెను నిర్మాణం చేయిస్తున్నాడు. ఉదయం పూట అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నాడు. తొందరగా నిర్మాణం పూర్తి చేయించి పశువులకు నీటి తొట్టెను అందుబాటులోకి తీసుకొస్తానని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

0

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

చిత్రం న్యూస్, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు.

ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, బేస్‌మెంట్, రూఫ్ లెవెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, నాణ్యతను జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని, జాప్యం చేస్తే చర్యలు ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీలు గోడం నగేష్‌, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌ సాగర్‌ రావు, గడ్డం వినోద్‌, రామారావు పటేల్‌, పాయల్ శంకర్‌, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్‌ బాబు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌, జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, హరిత, భవేశ్‌ మిశ్రా, కుమార్‌ దీపక్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

0

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘గ్రీవెన్స్ డే’ (ప్రజావాణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 36 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, బాధితులకు భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించాలనుకునే వారు 8712659973 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది.

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

0

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక రోగికి రక్తదానం చేసి ఒక యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. జైనూర్ మండలానికి చెందిన జ్యోతి లక్ష్మి అనే పేషెంట్ శరీరంలో రక్తం స్థాయి 6.6 కి పడిపోయింది. ఆమెకు అత్యవసరంగా ‘A పాజిటివ్’ (A+ve) రక్తం అవసరమైంది. రక్తం దొరక్క కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ విషయం శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ సభ్యుడు ‘సాయి సనాతని’ కి తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన, ఆదిలాబాద్‌లోని కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన సాయి సనాతనిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

0

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన అనిత అనే మహిళ హత్య కేసును వన్ టౌన్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఏప్రిల్ 24న హల్దీరాం ప్రాంతంలోని పంజాబ్ చౌక్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అనిత మృతదేహం లభ్యమైంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఇది దారుణ హత్యగా తేలింది.

మృతురాలి సోదరుడు జనగం వార్ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నర్సింగ సంతోబా గంపల్వాడ్ (25) అనే కూలీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏప్రిల్ 27న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడైంది. నిర్మానుష్య ప్రాంతంలో అనితపై దాడి చేయగా ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడవేసి పరారయ్యాడు.

అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులను ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

చెన్నూరి వర్షిణికి సనాతన హిందూ సేవా సమితి అండ

0

 చెన్నూరి వర్షిణికి సనాతన హిందూ సేవా సమితి అండ

చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సమితి ఆధ్వర్యంలో ఈరోజు 180వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

వరంగల్‌లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన చెన్నూరి వర్షిణి అనే యువతి తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు, ఎటువంటి ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సనాతన హిందూ సేవా సమితి సభ్యులు మానవత్వంతో స్పందించారు. ఆమెకు బాసటగా నిలుస్తూ, రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్ పాల్గొన్నారు. వీరితో పాటు గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, పేర్ణ భరత్, బండారి సంపత్, దిడ్డి మోహన్, గుండేటి రజిని కుమార్, నాగుల మోహన్, నోముల రాజేశ్వర్ తదితరులు పాల్గొని వర్షిణి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సేవా సమితి సభ్యులకు వర్షిణి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏప్రిల్ 27న ‘గోమాత గౌరవ దినోత్సవం’ జరపాలి: భీంపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

0

ఏప్రిల్ 27న ‘గోమాత గౌరవ దినోత్సవం’ జరపాలి: భీంపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

చిత్రం న్యూస్, భీంపూర్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీని ‘గోమాత గౌరవ దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించి, ఘనంగా నిర్వహించాలని కోరుతూ భీంపూర్ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. గో సంరక్షకులు, గోశాల నిర్వాహకుల పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ వేదిక ఉపాధ్యక్షులు ఏనుగు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గోమాతను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆవుకు ‘రాష్ట్ర మాత’ లేదా ‘రాజ్యాంగ మాత’ హోదా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గోశాలల్లో ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు నిర్వహించి, గోరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

హిందూ సంస్కృతిలో గోవును సకల దేవతా స్వరూపంగా భావిస్తామని, ఆవు ద్వారా లభించే పంచగవ్యాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయని వారు వివరించారు. గో రక్షణే ధర్మమని, దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు రవీందర్ జాదవ్, కాల్చప్ యాదవ్, లింబాద్రి, అర్లి (టి) గో సంరక్షణ కమిటీ సభ్యులు, గో సేవకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

0

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీపీఐ కార్యాలయంలో సోమవారం సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 1న జరగనున్న 141వ మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1886కు ముందు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడిన కార్మికులను అప్పటి అమెరికా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిందని, లక్షలాది మంది రక్తం చిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రక్తపు ధారల్లో తడిసిన కార్మికుడి చొక్కాయే నేడు ఎర్రజెండాగా మారి ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు.

బానిసత్వం నుండి విముక్తి పొందేందుకు, హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో కార్మికులు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలినీ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్. అరుణ్, షేక్ పాషా, బెజ్జంకి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

0

 విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

* మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈలు వినోద్, సదానందం, మున్సిపల్ డీఈ కార్తీక్, ఏఈలు నితిన్, కిరణ్‌లతో కలిసి ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గత పది రోజులుగా 49 వార్డుల్లో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన నివేదికలను విద్యుత్ అధికారులకు అందజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో స్ట్రీట్ లైట్ థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా విలీన గ్రామపంచాయతీల్లో థర్డ్ వైర్ నిర్వహణకు అవసరమైన నిధులను మున్సిపాలిటీ నుంచి చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలు, వంకరగా ఉన్న పోల్స్, దెబ్బతిన్న పోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు, లో-వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను (లూజ్ వైర్లు) వెంటనే సరిచేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.