అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం
చిత్రం న్యూస్, బేల: గత పది ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బేల మండలం అవల్పూర్ గ్రామ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ అనిల్ ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
గ్రామంలో పాతబడిన, సరిపడా సామర్థ్యం లేని ట్రాన్స్ఫార్మర్ల వల్ల లో-వోల్టేజ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్పంచ్, సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు.
స్వయంగా పనులను పర్యవేక్షించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నాటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ అనిల్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధిలో విద్యుత్ సమస్య పరిష్కారం ఒక కీలక మైలురాయి అని ఈ సందర్భంగా గ్రామస్తులు కొనియాడారు.

