Home Blog Page 24

వృద్ధురాలికి అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి

0

వృద్ధురాలికి అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి

చిత్రం న్యూస్, వరంగల్: అభాగ్యులకు అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ‘సనాతన హిందూ సేవా సమితి’ మరోసారి చాటుకుంది. సమితి ఆధ్వర్యంలో బుధవారం 181వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన వృద్ధురాలు అనుమాండ్ల సుజాత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆమె దీనస్థితిని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు స్పందించి, ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం,  నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకులు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సలహాదారు ప్రతాపగిరి గణేష్, సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, బండారి సంపత్, మరియు దిడ్డి మోహన్ తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందజేశారు. తమకు అండగా నిలిచిన సేవా సమితి సభ్యులకు ఈ సందర్భంగా సుజాత కృతజ్ఞతలు తెలిపారు.

బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

0

 బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కరంజి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు, యువతకు బాల్య వివాహాలు మరియు సైబర్ ఫ్రాడ్ (సైబర్ నేరాలు) పట్ల అవగాహన సదస్సును సర్పంచ్ శైలజ పొచ్చన్న, ఉప సర్పంచ్ ఏనుగు సూర్య ప్రకాష్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ సంగీత  నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

అనంతరం, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్శింగ్, ఆశ వర్కర్ బోజమ్మ, అంగన్వాడీ సిబ్బంది భూమక్క, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ

0

ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా “ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం (ZREAC) – 2026-27” సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు సూచనలు చేశారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, చీడపీడలపై అవగాహన కరదీపికను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, పరిశోధన సంచాలకులు డా.ఎం.బాల్ రాజ్, విస్తరణ సంచాలకులు డా.యాకాద్రి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.శ్రీధర్ చౌహాన్, వివిధ జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా తీరుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో, డిపోల నుండి బంకులకు చేరుతున్న ఇంధన సరఫరా తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్‌వాడీలో అవగాహన సదస్సు

0

బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్‌వాడీలో అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, జైనథ్: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జైనథ్ మండలం బెల్లూరిలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, అంగన్వాడీ టీచర్ భూమబాయి, ఆశ వర్కర్ వనజ,  మహిళలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించినా లేదా జరిపించినా కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి తీవ్ర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతారని వివరించారు. బాలికలు చదువు మధ్యలో మానేయకుండా, వారిని విద్యావంతులను చేయడం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, బాల్య వివాహాలను అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కిశోర బాలికలతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

0

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

ఫలితాలను ఇలా చూసుకోండి: విద్యార్థులు తమ ఫలితాలను కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు:

results.bsetelangana.org

results.bse.telangana.gov.in

bse.telangana.gov.in

school.edu.telangana.gov.in

వాట్సాప్ ద్వారా ఫలితాలు:

ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులు మీసేవ (MeeSeva) వాట్సాప్ నంబర్ 8096958096 కు “Hi” అని సందేశం పంపి, తమ హాల్ టికెట్ వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

0

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ 

చిత్రం న్యూస్, బాసర : గంజాయి వినియోగం, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని సీఐ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో విస్తృతంగా, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలపై బాసర ప్రజలకు, యువత, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్టాలు వినియోగించిన, విక్రయించిన సమాచారం తెలుపాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని బాసర సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

0

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

చిత్రం న్యూస్ సైదాపూర్:  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సైదాపూర్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలు, ప్లాంటేషన్, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు వేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల దత్తత ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఓట్ల తొలగింపుపై బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవాన్ని పెంచుతున్నానని మంత్రి స్పష్టం చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతి పత్రం అందజేత 

0

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతి పత్రం అందజేత 

చిత్రం న్యూస్, బాసర : అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బాసర  బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి సీ.హెచ్ సాయినాథ్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు గత ఎనిమిది నెలల నుండి ఇంటిని మొత్తం కూల్చివేసి అద్దె ఇంట్లో ఉంటున్నారన్నారు. అటువంటి వారికి వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ పెండింగ్ లో ఏమీ లేవన్నారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే మంజూరు చేస్తామన్నారు.

 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

0

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ..బాల్య వివాహం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ దురాచారాన్ని అరికట్టడం మనందరి బాధ్యతని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. “ఆడపిల్లల చదువు మధ్యలో ఆగకూడదు. చిన్న వయసులో పెళ్లి వద్దు – వారి పెద్ద కలలకు ఊపిరి పోద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ టీచర్ సునీత పాల్గొని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో ఇకపై ఎలాంటి బాల్య వివాహాలు జరగనివ్వమని ఈ సందర్భంగా గ్రామస్థులందరూ కలిసి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దినేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.