మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ధ్యేయం
‘ పెహచాన్’ సంస్థ ప్రతినిధులు, ప్రచారకర్త సెహర్ హష్మీ
అక్టోబర్ 3న కలెక్టరేట్లో ‘బియాండ్ ది హొరైజన్’ కార్యక్రమం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలు, విముఖతను తొలగించి, యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘బియాండ్ ది హొరైజన్: ఎ రైడ్ ఫర్ రెసిలియన్స్’ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ‘పెహచాన్’ సంస్థ ప్రతినిధులు, మానసిక ఆరోగ్య ప్రచారకర్త సెహర్ హష్మీ తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 3న మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ముఖాముఖి, విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మానసిక సమస్యల నుంచి తాను కోలుకున్న అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రజలకు, మానసిక ఆరోగ్య నిపుణులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సెహర్ హష్మీ తెలిపారు.
భావోద్వేగ ఆందోళనలు, స్వీయ కరుణ, మానసిక దృఢత్వం వంటి అంశాలపై ఎలాంటి భయం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా చర్చించే వాతావరణాన్ని కల్పించడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ప్రచార యాత్రను ఆగస్టు 20న న్యూఢిల్లీలో ప్రముఖ నటి, మానవతావాది షర్మిలా ఠాగూర్ ప్రారంభించారని తెలిపారు. న్యూఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, తిరిగి ఢిల్లీ వరకు 50కి పైగా ప్రధాన నగరాల మీదుగా 58 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
‘పెహచాన్’ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిపాలనా కేంద్రాల్లో 100కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువత, మానసిక సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని, మానసిక ఆరోగ్యంపై అవగాహన సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ‘పెహచాన్’ బృందం కోరింది.
