టీచర్ బదిలీ నిలిపివేయాలి: బేలలో తల్లిదండ్రుల ఆందోళన
చిత్రం న్యూస్, బేల: మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంధ్య బదిలీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. పాఠశాలలో సంధ్య టీచర్ నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమయంలో ఆమెను బదిలీ చేయడం వల్ల తమ పిల్లల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందని సోమవారం ఎంపీడీవో మహేశ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలపైనే నమ్మకంతో పిల్లలను చేర్పిస్తే, టీచర్ బదిలీ వల్ల ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా బదిలీ కొనసాగిస్తే పాఠశాలకు తాళం వేసి నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కట్కర్ల స్వామి, రేసు అనిల్, మాడ హరీష్, గుంజేవార్ నరేష్, అగార్కర్ ఆకాష్, నారాయణ్, కృష్ణ, భూమన్న, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
