అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ముథోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ భూమిపూజ నిర్వహించారు. ధార్ కుభీర్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవనం, గోదాం నిర్మాణంతో పాటు బెల్గావ్ గ్రామంలో వీవో భవనం , అంగన్‌వాడీ కేంద్రం, గోదాం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేను కలిసి తమ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ధార్ కుభీర్ నుంచి బెల్గావ్ వరకు రహదారి సౌకర్యం సరిగా లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఇరిగేషన్ పరిధిలో చెరువు నుంచి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రెండు కెనాల్స్ నిర్మించాలని బెల్గావ్ గ్రామస్థులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. గ్రామస్థుల విజ్ఞప్తులపై స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చెరువుల మరమ్మతులు, నీటి నిల్వ కోసం కెనాల్ నిర్మాణం, పంట పొలాలకు వెళ్లేందుకు రహదారుల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం చేసేందుకు బీటీ రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల సీనియర్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
