ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు మంత్రుల అభినందనలు
చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు రాష్ట్ర మంత్రులు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కులం పేరుతో దూషణలు చేసిన ఘటనకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న దళిత నాయకులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో “శుద్ధి” చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ జైనథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పోలీస్ కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్ కాపీలను న్యూస్ పేపర్ ప్రతులను దుర్గం శేఖర్ మంత్రులకు అందజేశారు. ఈ ఘటనలో వేగంగా స్పందించి కేసు నమోదు చేసి న్యాయం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్‌ను రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశంసించారు. దళితుల గౌరవాన్ని కాపాడుతూ చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు.
