రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ – కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆదిలాబాద్ జిల్లా శాఖలో నూతనంగా జీవితకాల సభ్యత్వం పొందిన 30 మంది సభ్యులకు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ శ్రీ రాజర్షి షా మంగళవారం గుర్తింపు కార్డులు అందజేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో అండగా నిలిచి, సేవా కార్యక్రమాల ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సభ్యులు సంస్థ ఆశయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ బాల శంకర్ కృష్ణ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 24 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై, అక్టోబర్ 4న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ లో సభ్యత్వం తీసుకుని ప్రజా సేవలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భీంసేన్ రెడ్డి, ఉరే గణేష్, శ్రీ మసూద్, పాసుపుల రాజు, కొట్టవార్ రాజేశ్వర్, వోట్కర్ లక్ష్మీనారాయణ, జంగం సంతోష్, లింగంపల్లి నర్సింహులు, మేకల జితేందర్, లోకిరే మనోహర్, శ్రీనివాస్, నారాయణ, నిర్మల తదితరులు, నూతన జీవితకాల సభ్యులు పాల్గొన్నారు.
