ఆహార వైవిధ్యం, పోషకాహార ప్రాధాన్యాలపై అవగాహన
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 9వ జాతీయ పోషణ్ మాహ్ వేడుకల్లో భాగంగా స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై పట్టణంలో ప్రత్యేక వర్క్‌షాపులు, పోషకాహార స్టాళ్ల ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక లభ్యతలో ఉండే పౌష్టికాహారం, ఆహార వైవిధ్యం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల ప్రాముఖ్యతను ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, అధ్యక్షత వహించి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్‌వాడీ సేవల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. స్థానికంగా పండే తృణధాన్యాలు, ఆకుకూరలు, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లను గుర్తించి ఘనంగా సత్కరించారు. వారి నిరంతర కృషిని అభినందిస్తూ ‘పోషణ్ ఛాంపియన్’ పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఆయుష్ నోడల్ అధికారి చంద్రశేఖర్, డీపీఓ ప్రీతల్, మెప్మా పీడీ రాజు, ఆయుర్వేద, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
