గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత: ఎస్పీ జానకి షర్మిల
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా..
700 పోలీసులతో భారీ బందోబస్తు..
చిత్రం న్యూస్, బాసర : గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అడిషనల్ ఎస్పీలతో పాటు 14 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు మరియు ఎస్ఐలు, మొత్తం 700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు.
డ్రోన్ కెమెరాల నిఘా: ఊరేగింపు మార్గాలు, ప్రధాన చౌరస్తాలు మరియు నిమజ్జన ఘాట్ల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం కంట్రోల్ రూమ్ నుండి నిఘా ఉంచుతారు.
సీసీ టీవీ పర్యవేక్షణ: సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తారు.
ట్రాఫిక్ మళ్లింపు: నిమజ్జనం సజావుగా సాగేందుకు పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు, పుకార్లు నమ్మవద్దని ఎస్పీ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గడ్డన్న ప్రాజెక్టు వద్ద భారీ క్రేన్ల, గజ ఈతగాళ్ళతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
