హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం:మాజీ మంత్రి జోగు రామన్న
*భోరజ్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట
*భారీగా తరలివచ్చిన రైతులు
చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా భోరజ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న హాజరై రైతులతో మాట్లాడారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని అనేక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులు యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం పోలీసు పహారా మధ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సుమారు 33 నెలలు పూర్తయినా ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు మరింత పెరిగాయని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉందని జోగు రామన్న ఆరోపించారు. ఉపాధి హామీ పథకం విషయంలోనూ వ్యవసాయ కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని జోగు రామన్న పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, వ్యవసాయ పనిముట్లతో పాటు పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి అందే వరకు పోరాడాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. రైతు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతు సదస్సుల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న, అయ్యా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
