చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 23వా వార్డు మహాలక్ష్మి వాడకు చెందిన తోట సుభాష్ తోట గౌరమ్మ దంపతుల కుమారుడు తోట శంకర్ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా శంకర్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లారు. శంకర్, అతని తల్లిదండ్రులను జోగు రామన్న ఘనంగా సన్మానించారు.శంకర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేద కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఫులే జయంతి: పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు, గొప్ప సంఘసంస్కర్త, మహాత్మా జ్యోతిరావు ఫులే అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం కృషి చేసిన ఆ మహనీయుడు మనకు ఎప్పటికీ ఆదర్శమన్నారు. సమాజంలో సమానత్వం, అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జ్యోతిరావు ఫులే ఆశయాలు ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ.. నినాదాలు చేస్తూ వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బెజ్జంకి అనిల్ , గౌలి సంజయ్, మంగేష్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేద్కర్, బౌద్ధ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లోని అశోక బుద్ధ విహార్ లో మే 1న నిర్వహించే బౌద్ధ పూర్ణిమ ( వైశాఖ పూర్ణిమ ), డా.బీ. ఆర్ అంబేద్కర్ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో జయంతులకు సంబంధించిన గోడ ప్రతులను దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పలువురు తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతులకు వేలాది సంఖ్యలో బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్ వాదులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ కార్యక్రమం నిర్వాహకులకు రూ.10 వేల చెక్కును డా. బీ.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ బుద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞా కుమార్ , జిల్లా అధ్యక్షులు విట్టల్ బుట్టే , ప్రధాన కార్యదర్శి దయానంద్ పొటఫోడే , డా. బీ .ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీమ్ రావు వాగ్మారే , జిల్లా జనరల్ సెక్రటరీ దడసాహెబ్ జబడే తో పాటు దయానంద్ కామ్లే , కాంతారావు వాగ్మారే , రంగారావు వాటోరే , గోవింద్. రఘనాథ్ ఆడే. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు యువకులను కాపాడిన గంగపుత్రులు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గోదావరి నది పుణ్య స్నానాలకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను గంగపుత్రులు కాపాడారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడ ఉన్న గంగ పుత్రులు డప్పు నరేశ్ గమనించి ఇద్దరిని గోదారోడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు. వారిని కాపాడినందుకు నరేష్ కు పలవరు అభినందనలు తెలిపారు.
బాసర ఆర్జీయూకేటీలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డా. రెవెల్లి అజయ్ అధ్యక్షతన శనివారం మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, డీన్ డా.విట్టల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొని ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం ఫులే చేసిన విశేష కృషిని వీసీ, డీన్ కొనియాడారు. అందరికీ విద్య అందాలన్న ఫులే ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు.
ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు
ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు
డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన.!
చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం” అన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ, ఒక ఉన్నతాధికారి తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట కొలువు చేయలేనని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, తన పై అధికారి చేసిన ఘోర అవమానాన్ని భరించలేక, తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ సర్వీసును వదులుకుని శాఖ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన పడిన మానసిక సంఘర్షణ, ఆ గదిలో జరిగిన అవమానం గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు చదువుతుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు.
అసలేం జరిగింది..? సోమిరెడ్డి వివరణ ప్రకారం.. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పై అధికారి (కమిషనర్) ఆయనను ఉద్దేశించి “వెధవ, ఇడియట్” అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. చేయని తప్పుకు అకారణంగా నిందిస్తుంటే, సోమిరెడ్డి చాలా సున్నితంగా “అలాంటి మాటలు అనొద్దు సార్” అని ఎదురు చెప్పారు. బహుశా వ్యవస్థలో ఎవరూ ఇన్నేళ్లుగా కమిషనర్ ని ఎదురు ప్రశ్నించి ఉండకపోవచ్చు. ఆ చిన్న మాట ఆయన ‘ఈగో’ను బాగా దెబ్బతీసింది. ఫలితంగా పది నిమిషాల పాటు నలుగురు అధికారులు, సిబ్బంది ముందే సోమిరెడ్డిని “వెధవాతి వెధవవు” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. తనకు సంబంధం లేని పనులను అంటగడుతూ, బలవంతంగా తాను వెధవనని ఒప్పించే ప్రయత్నం చేశారని సోమిరెడ్డి వాపోయారు.
వ్యవస్థ మౌనంపై ఆవేదన: ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తిని అందరి ముందే అవమానిస్తుంటే, తోటి అధికారులు, మిత్రులు మౌనంగా ఉండటం సోమిరెడ్డి ని మరింత కలచివేసింది. “అన్యాయాన్ని ప్రశ్నిద్దాం రండి” అని ఆయన పిలిచినప్పుడు, తోటి అధికారుల మొఖాల్లో కనిపించిన భయం, వారి మౌనం చూసి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మిత్రులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. “అరేయ్, ఒరేయ్” అని పిలుస్తూ, కనీస గౌరవం ఇవ్వని చోట ఇన్నాళ్లు ఎలా పనిచేశామా అని ఆయన సిగ్గుతో తలదించుకుంటున్నారు.
ఆత్మాభిమానమే మిన్న: “నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితమని నమ్మాను. ఆత్మాభిమానం లేని చోట ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు” అని సోమిరెడ్డి తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చేతకాని, చైతన్యం చచ్చిపోయిన ఒక శాఖలో 30 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు విచారం వ్యక్తం చేస్తూ, ఇక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పని చేయలేనని స్పష్టం చేశారు.
ఉన్నతాధికారులకు ధన్యవాదాలు: తను ఈ శాఖలో ఇమడలేనని తెలిసినా, ఇన్నాళ్లు ప్రోత్సహించిన మేలుకోరే ఉన్నతాధికారులకు, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేర్చిన మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కానీ తన మనసు పడ్డ గాయం మాత్రం మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలు లోపించడం, పెత్తందారీ పోకడలు పెరిగిపోవడంపై ఈ ఘటన ఒక చర్చకు దారితీసింది. సోమిరెడ్డి నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ శిక్షణ పూర్తి
చిత్రం న్యూస్, దండేపల్లి :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని TGMS లింగాపూర్ విద్యార్థులకు, Media and entertainment విభాగం లో ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా ఆచరణాత్మక అనుభవం కల్పించేందుకు వృత్తి విద్య శిక్షకుడు రాజు రెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రణవి ఫోటో స్టూడియో మ్యాదరిపేట లో విద్యార్థులు ఆసక్తిగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రమెష్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో వివిధ రంగాలలో ఎదగడానికి ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా వృత్తి విద్య ద్వారా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సాయి ప్రణవి ఫోటో స్టూడియో నిర్వాహకులు మైదం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యుజీసీ నెట్ లో విద్యార్థిని ప్రతిభ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన సామ సంతోష్ రెడ్డి చిన్న కుమార్తె అంకిత యూజీసీ నెట్ లో ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా అందులో ఆమె ఈ ఘనత సాధించారు. డిగ్రీ అధ్యాపక పోస్టులకు అర్హత సాధించారు. పీ హెచ్ డీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడం ద్వారా ఆమెకు పరిశోధన రంగంలో మరింత ఉన్నత అవకాశాలు లభించనున్నాయి. గ్రామ ప్రజలు, కుటుంబీకులు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యోగా, మెడిటేషన్ పై అవగాహన
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యోగ డే, హోమియోపతి డే ఆరోగ్య దినోత్సవాల ను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగ మ మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఆయుష్ విభాగాధికారి డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మన ఇంట్లో వంట గదిలో దొరికే దినుసుల ద్వారా ఆరోగ్యం అన్నారు. అదేవిధంగా ఔషధ మొక్కలపై అవగాహన పెంచుకొని మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని వాటిని మనకు అవసరాన్ని కనుగొనంగా ఆయుర్వేద వైద్య నిపుణులచేత సూచనలు తీసుకుంటూ ఔషధాలుగా ఉపయోగించవచ్చన్నారు. ఆయుర్వేద యునాని, హోమియోపతి మందులు జిల్లా ప్రజలకు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ఎటువంటి సందేహం లేకుండా డాక్టర్ల సూచన మేరకు ఉపయోగించవచ్చు అన్నారు.మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతమైన మనసుతో ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించవచ్చన్నారు. ప్రతిరోజు మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయడం జీవనశైలిలో మార్పును తీసుకురావచ్చన్నారు. యోగ డాక్టర్ తిరుపతి, విజయభాస్కర్ తో కలిసి నర్సింగ్ కళాశాల విద్యార్థి నీలచైత యోగ ఆసనాలపై , మెడిటేషన్ పై సాధారణ వ్యాధులపై,అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషన్ డాక్టర్ శ్రీకాంత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపరిండెంట్ చంద్రకళ, విజయలక్ష్మి,మాక్లూర్ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, పురుషోత్తం, రమేష్,ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గల మున్సిపల్ కార్మికులందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి రాజశ్రీ తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. డీ ఎం హెచ్ ఓ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు శారీరక పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారం తీసు కోవాలని, ముఖ్యంగా గుండె జబ్బులు ,మధుమేహం, క్యాన్సర్ లాంటి జీవనశైలి వ్యాధులను ముందే గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా క్షయ వ్యాధికి గురికాకుండా చక్కని పోషకాహారంం తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరికీ ఎక్సరే ద్వారా క్షయ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి , లక్ష్మణ్, నరేష్, శ్యామల, క్షయ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.










