చిత్రం న్యూస్, నల్గొండ: నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విభాగాలతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాలలోనూ విద్యార్థులు ఉన్నత ర్యాంకులను సాధించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి. దీప్తి 994/1000, కె. మహతి 991/1000, బి. ప్రవీణ్ 989/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ బైపీసీలో కే. మేఘన 992/1000, ఎన్. సిరి 985/1000 మార్కులు సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో బి. సిరి 438/440, అయాన్ 436/440, డి. భార్గవి 432/440, జె. చందన 431/440, బి. సాయి నాగేంద్ర 429/440 మార్కులు సాధించగా, ఎంపీసీలో టి. హన్సిక రెడ్డి, జి. శ్రావణి, ఎన్. ఎన్. జాన్వి 466/470 మార్కులతో జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు.కే. హిమావర్షిని 464/470, ఆర్. శివమణి, అష్రాఫ్ అలీ 461/470 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి, స్వీట్లు తినిపించి ప్రోత్సహించింది.
చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని చప్రాల 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, అత్యవసర నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. సోమవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు చప్రాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ (Assistant Engineer) ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, వినియోగదారులు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
చిత్రం న్యూస్, బేల: మండలంలోని బాధి గ్రామపంచాయతీ పరిధిలోని హేటి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. గ్రామ పటేల్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంతేలా వినోద్, వార్డు సభ్యులు జోడే గణేష్, కనకే జ్ఞానేశ్వర్ మరియు గ్రామ పెద్దలు దాసరి గుణవంతరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంజయ్ గుండవార్, వాంఖడే వామన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయ విస్తృత పర్యటన
చిత్రం న్యూస్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటిస్తూ పలు ధార్మిక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దమ్మపేట మండలం సీతారామపురం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట (బొడ్రాయి), నాభిశిల, ద్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లి మండలం మంగళిగుట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. తిమ్మపేట గ్రామంలో ఇటీవల మరణించిన పాత్రికేయులు పోతుగంటి క్రాంతి దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వరరావుని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో పద్ధం వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శనగ కొనుగోళ్లు తాత్కాలికంగా నిలుపుదల: రైతుల్లో ఆందోళన
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని శనగ రైతులకు మార్క్ ఫెడ్ (Markfed) అధికారులు కీలక సూచన చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా జరుగుతున్న శనగల కొనుగోళ్లను 4 నుండి 5 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేటాయించిన కొనుగోలు కోటా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి తదుపరి కొనుగోలు కోటా మరియు అనుమతులు వచ్చే వరకు మార్కెట్ కు కొత్తగా శనగలను తీసుకురావద్దని సెక్రటరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల కూడా కొనుగోళ్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులకు శనగలను తీసుకువచ్చి ఇబ్బందులు పడకుండా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు కోరారు. మరోవైపు, అప్పటికే మార్కెట్ కు చేరుకున్న నిల్వలను కాపాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధరపై ఆశలు పెట్టుకున్న తమకు, కొనుగోళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు.
ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన పెద్దోళ్ల సాత్విక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పెద్దోళ్ల సాత్విక 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. సాత్విక ప్రతిభ కనబరచడంతో ఆమె తల్లిదండ్రులు పెద్దోళ్ల పుష్పలత రవి దంపతులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమార్తె కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం పట్ల గర్వంగా ఉందని వారు తెలిపారు. గ్రామంలోని పెద్దలు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కాలనీవాసులు కలిసి సాత్విక ను సన్మానించి ఆమెను ప్రశంసించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్ని అయినా అవలీలగా సాధించవచ్చని సాత్విక నిరూపించి చూపిందని వారు పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాలపై ఆందోళన వద్దు: మాజీ ఎంపీపీ జివి.రమణరావు
* ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు
* ఫలితాల పట్ల ఆందోళన చెందవద్దని విద్యార్థులకు సూచన
* ఓటమి గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని పిలుపు
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూనే, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా ఆందోళన చెందవద్దని కుంటాల మండల బీజేపీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ జివి.రమణరావు విద్యార్థులకు సూచించారు. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని, వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలని ఆయన అన్నారు. విడుదలైన ఇంటర్ ఫలితాలపై కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, జివి.రమణరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్ అయిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూనే, ఫెయిల్ అయిన వారికి ధైర్యం చెప్పారు. పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చని, కానీ జీవితం తిరిగి రాదని, కాబట్టి ఎవరూ ఆత్మహత్య వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల ఆశలను గుర్తుంచుకోవాలని, వారిని బాధపెట్టే పనులు చేయవద్దని రమణరావు విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షా ఫలితాలే సర్వస్వం కాదని, వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో అనేక అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఏదైనా విషయంలో విఫలమైనా, దానిని ఒక అనుభవంగా స్వీకరించి, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఓటమిని గెలుపునకు తొలిమెట్టుగా భావించి, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆయన కోరారు. మానసికంగా దృఢంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రకటన ద్వారా, విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని అందించడమే లక్ష్యంగా జివి.రమణరావు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సూచించారు.
ఇంటర్ ఫలితాల్లో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ
చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ (TGMS) విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. MPC మొదటి సంవత్సరం విభాగంలో ఆర్.అక్షిత్ వర్మ 425/470 మార్కులు, పి.స్పందన 412 మార్కులు సాధించారు. BPC విభాగంలో ఎం.డి. ఆసియా అంజుం 399/440, జి.మదన్ చంద్ర 352 మార్కులతో మంచి ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బి.రాజ్ కుమార్ 969/1000, జి. సౌజన్య 956 మార్కులు సాధించగా, బి. సహితి 980 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చూపింది. కె. వర్షిణి 890, వి.అపూర్వ శ్రీ 856, ఏ.హారిక 614 మార్కులు సాధించారు.
ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ప్రెస్ క్లబ్) విలేకరులు అందరూ సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జింద్లే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రాయిస్ ఖాస్ మి , కోశాధికారిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త కార్యదర్శిగా శరత్ గైక్వాడ్ లను ఎన్నుకున్నారు, సభ్యులు దుర్గాప్రసాద్, మురళిగౌడ్, తిరుపతి గౌడ్, విజయ్, పి.నాగేష్, నాగేష్, పవన్, బషీర్, అజీమ్, సుభాష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం మజ్జిగ, చల్లటి నీరు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు . భక్తులకు సుమారు రెండు గంటల సమయం దర్శనానికి పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయరామరావు, బాసర సీఐ కిరణ్, పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.










