Home Blog Page 44
0

ఇంటర్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్థులు

* విద్యార్థులను సన్మానించిన యజమాన్యం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల ఎస్ ఆర్ కళాశాల యజమాన్యం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎస్. చందన, అస్మిత్ గౌడ్, సరియన్ స్పందన, అఖిలేష్ 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి జిల్లా టాపర్స్ గా నిలిచారు. కళాశాలకు చెందిన 205 మంది విద్యార్థులు 467 నుంచి 460 మార్కులకు సాధించారని కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బైపీసీలో ఆసియా అంజుమా, మను శ్రీ,, అనూష, స్నేహ 440 మార్కులకు 438 మార్కులు సాధించినట్టు గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 78 మంది విద్యార్థులు 437 నుండి 4:30 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. సి ఈ సి లో హనీ యాసిద్దిన్, 500 మార్కులకు 482 మార్కులు సాధించారని, అదేవిధంగా శ్రీ చందన 481 మార్కులు సాధించి సత్తా చాటాలని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ శ్రేణి ఎంపీసీ ఫలితాలలో దినేష్ 995/1000 అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్ గానిలిచారు. మరో 27 మంది విద్యార్థులు నుండి 990 వరకు మార్కులు. సాధించినట్లు తెలిపారు. బైపీసీ లో ఉపాజఫీన్, హన్మిత, తిరుమల అనే విద్యార్థులు 991/1000 మార్కులతో ప్రతిభ చాటారు. ఏడుగురు విద్యార్థులు 990/1000 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో జడల దీపికకు 995 /1000 మార్కులు రావడం జరిగిందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చాటిన కళాశాల విద్యార్థులను ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి లు అభినందించారు. అనంతరం కళాశాల ఆవరణలో బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు తినిపించుకున్నారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

0

హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

*జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జన గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇండ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ నుండి నిర్వహించే ఇండ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాక్ లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని, ఇండ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇండ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందని, మిగిలిపోయిన మండలాల్లోనూ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

0

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

*కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి

చిత్రంన్యూస్, నిజామాబాద్ బ్యూరో: పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టుచేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్ళే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో దాడి చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు 10 గ్రాముల గుండ్లను ఎత్తుకుని పారిపోయాడు.. కేసు నమోదు చేసుకుని భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన ఎస్పె ఆంజనేయులు కేవలం మూడు గంటలోనే కేసును ఛేదించి నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, అతడు ఉపయోగించిన రోకలి, మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మూడు గంటలోనే కేసు చేదించిన భిక్కనూర్ సీఐ, ఎస్ఐలను సిబ్బందిని ఆమె అభినందించారు.

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

0

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

* కాలనీవాసుల కష్టాలపై అదనపు కలెక్టర్ హామీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ (సర్వే నంబర్ 170) నివాసితులు గత 12 ఏళ్లుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పట్టాలు పొందిన సుమారు 200 కుటుంబాలకు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్ కు ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఎండకాలం వస్తున్నా పేద ప్రజల దాహం తీర్చలేని ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎందుకని ఆయన నిలదీశారు. గతంలో జిల్లా కలెక్టర్ రూ.5 లక్షలు మంజూరు చేయడంతో నీటి ట్యాంకులు, పైపులు, బోర్ వెల్ ఏర్పాటు చేశారని.. కేవలం రూ. 2.5 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన గుర్తు చేశారు.

మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు వివరించగా, ప్రజల ప్రాథమిక అవసరాల కంటే నిధులు ముఖ్యం కాదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్, త్వరలోనే రెండు లక్షల రూపాయలు చెల్లించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ధర్నా సద్దుమణిగింది.

ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామిలే రామదాస్, గిరిజన సంఘం జిల్లా నాయకులు కొడప సురేష్,  కాలనీవాసులు తారాబాయి, శాంతాబాయి, జంగు భాయ్, ముల్కల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్ 

0

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భరోసా ఇచ్చారు.గొల్లమాడ, తమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు తమ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొక్కజొన్నను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, అవసరమైన చోట్ల మరిన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో పాటు మంత్రికి కూడా సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఆలస్యం చేస్తే, రైతుల తరపున ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ రాజేందర్, గొల్లమాడ మాజీ సర్పంచ్ చిన్న మహేష్, నాయకులు వినోద్ రెడ్డి, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

0

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాదు టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనీ శాస్త్రి నగర్ గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు.

కొవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని మర్డర్ల తో 40 మంది చనిపోయారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని, కృషి అనేది ప్రతి గ్రామము నుండి మొదలవ్వాలని గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు శాస్త్రి నగర్ గ్రామం నుండి ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించినట్లు అయితే ఇట్టి గ్రామము నుండి ద్విచక్ర వాహనదారులను  ఐపీల్ మ్యాచ్ తిలకించడానికి ఉచితంగా పంపివ్వడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , నిజామాబాద్ సౌత్ రూరల్ సురేష్ కుమార్ , ట్రాఫిక్ సీఐ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్ , జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్ ఎస్సై డి శ్రీకాంత్ , గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా డా. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు

0

భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా డా. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో:   భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో B. R. అంబేద్కర్ ముందస్తు జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు . ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.

ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా.రఘునాథ్ మాట్లాడుతూ, అంబేడ్కర్ జీవితం నేటి యువతకు గొప్ప ప్రేరణ అని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి ప్రపంచ స్థాయికి ఎదిగి, భారతదేశానికి గౌరవం తెచ్చిన మహానుభావుడని కొనియాడారు.

అస్పృశ్యత నిర్మూలన, సమానత్వం, మహిళాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించి దేశ స్థిరత్వానికి బలమైన పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ క్యూ ఏసి సమన్వయకర్త డా.రవికుమార్, డా. జే.భీమారావు, డా. శంకర్, డా. కొసరి సంతోష్, డా. ఓం ప్రకాష్, రామ్ మోహన్ తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 

0

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్, తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట స్థావరంపై సోమవారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఆరుగురు వ్యక్తులతో పాటు 3 కార్లు, 6 సెల్ ఫోన్లు, రూ.1,17,940 నగదు స్వాధీనం చేసుకొన్నట్లు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీసులకు అప్పగించామన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు దాడి చేశామన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

0

 

డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటివరకు ఒక్కటి కూడా కేటాయింకాలేదన్నారు. అర్హులైన పేదలు ఎందరో ఉన్నారని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేయాలన్నారు. మొత్తం రూ.5.91 కోట్ల విలువ గల 591 కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నగర మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

0

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

* ఊరూరా అరైవ్ – అలైవ్ గ్రామ సభలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ ల అధ్యక్షతన అరైవ్ – అలైవ్ కార్యక్రమం అమలుపై గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన గ్రామ సభలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేసేలా కలెక్టర్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, ఇతర గ్రామ పెద్దలతో కూడిన తొమ్మిది మంది సభ్యులు గల రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మన దేశంలో, రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు నియంత్రించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అత్యున్నత అధికారులు ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తూ వారిని భాగస్వాములు చేసేందుకు అరైవ్ – అలైవ్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల ఔన్యత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. హెల్మెట్ ను భారంగా భావించకూడదని, ప్రమాద సమయాలలో ప్రాణాలను రక్షించే శిరస్త్రాణంను ద్విచక్ర వాహనదారులు తప్పక ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు విధిగా సీట్ బెల్టు ధరించాలని హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయకూడదని సూచించారు. ఈ విషయాలపై వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ పెద్దలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం రహ్-వీర్ కింద 25 వేల రూపాయల ఆర్ధిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయపడితే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అపోహలను విడనాడి, విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. వచ్చే నెల మే 1వ తేదీ నుండి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని, గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచాలని, గ్రామంలో ప్రతి ఒక్కరు తప్పక హెల్మెట్ ధరించాలని, రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని, శబ్ద కాలుష్యాన్ని కలిగించే డీ.జేలను నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఈ గ్రామ సభకు సర్పంచ్ కిరణ్ అధ్యక్షత వహించగా, డిప్యూటీ రవాణా కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.