Home Blog Page 39

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

0

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు గ్రామంలో నీటి కష్టాలు మొదలవుతాయి. మిషన్ భగీరథ ఉన్న గ్రామానికి కావాల్సినంతగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలోని మంగ్రూడ్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో బోరు వేసి అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ ట్యాంక్ కి సరఫరా చేసి నీటిని వినియోగించుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని ధ్వంసం చేశారు.రెండు రోజుల నుండి నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఈ సందర్బంగా గ్రామ ఉప సర్పంచ్ కాడే సంజయ్ మాట్లాడుతూ…కొందరు వ్యక్తులు కావాలనే ఉద్దేశ్యంతో అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని పలుమార్లు ధ్వంసం చేశారన్నారు . మరోమారు ఇలానే ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

0

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC నాయకులు అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2వ పీఆర్సీ అమలు: రెండవ పిఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకుని, జూన్ 2వ తేదీలోపు 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లుల విడుదల: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు ₹13,000 కోట్ల బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేసి, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

ఆరోగ్య కార్డుల మంజూరు: ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం కొత్త EHS (Employee Health Scheme) విధానాన్ని రూపొందించి, మే 1వ తేదీ నుండి నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడాలని విన్నవించారు.

Cps రద్దు – OPS పునరుద్ధరణ: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్‌ను కోరారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని TGEJAC నాయకులు హెచ్చరించారు.  కార్యక్రమంలో  ఆయా సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల భాద్యులు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

0

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్ తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ  మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

0

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

*కంటతడి పెట్టుకున్న రైతు గోసుల రాజు 

చిత్రం న్యూస్, బాసర : ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట కళ్ళముందే దగ్ధం అయిన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన గోసుల రాజు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. చేనులో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి తిని వచ్చేలోపు పంటకు నిప్పంటుకొని కాలి బూడిదవడంతో  కన్నీరు మున్నీరయ్యాడు. గమనించిన తోటి రైతులు బకెట్లతో నీరు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట బూడిద కావడంతో బాధిత రైతు కంటతడి పెట్టుకున్నాడు. పంటకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

మొక్కజొన్న సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0

మార్క్ ఫెడ్ ఎండీ ని కలిసిన ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, బాసర: మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆయన హైదరాబాద్ లో మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని  కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట ఉందని, భారీ వర్షాలతో రైతుల నష్టపోయారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేపడితే కొంతైనా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మితే క్వింటాలుకు రూ.700 వరకు అధిక ధర వస్తుందని, వెంటనే కొనుగోలు చేపట్టి, పంట అమ్మినా డబ్బులను రైతుల ఖాతాల్లో సత్వరం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ప్రధాన కొనుగోలు కేంద్రాలతో పాటు సబ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవని, ఎక్కడెక్కడ సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఆయన రాతపూర్వకంగా ఎండీకి వివరించారు. నియోజకవర్గంలో 30కి పైగా సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అమ్మకానికి పంట తెచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొక్కజొన్న రైతులు ఆందోళన పడకుండా తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

బాసర ఆలయంలో భక్తుల సందడి  

0

బాసర ఆలయంలో భక్తుల సందడి  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో  శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోవడానికి వరుసలో బారులు తీరారు. బారులు తీరిన భక్తులకు ఆలయ ఈవో విజయరామారావు, మంచినీళ్లు, మజ్జిగ, వసతులు కల్పించారు. శుక్రవారం కావడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలను చేయించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఈవో విజయ రామారావు, ఏవో గంగ ప్రసాద్, బాసర సీఐ కిరణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

0

 వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సయ్యద్ నవీద్ అలీ (అలియాస్ బడా ముష్రఫ్) పై ఆదిలాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితుడిపై ఇప్పటివరకు మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 దొంగతనం కేసులు కాగా, 3 గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. గతంలో జైలు శిక్ష అనుభవించినప్పటికీ, నవీద్ అలీ తన ప్రవర్తన మార్చుకోలేదు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. నిందితుడు జైలు నుండి విడుదలైన ప్రతిసారీ మళ్ళీ నేరాలకు పాల్పడుతుండటంతో, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: అదనపు కలెక్టర్లు

0

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: అదనపు కలెక్టర్లు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రహదారి ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘రోడ్డు భద్రత అవగాహన’ సమీక్షా సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, విలువైన ప్రాణాలను బలిగొంటున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సహకారంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ, రవాణా, పోలీసు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, రోడ్లు-భవనాల శాఖ (R&B) ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాపాలన లక్ష్యం అర్హులకు సంక్షేమం అందడమే: ఎమ్మెల్యే పాయల్ శంకర్P

0

ప్రజాపాలన లక్ష్యం అర్హులకు సంక్షేమం అందడమే: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందడమే ప్రజాపాలన అసలు ఉద్దేశమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్యాంకుల నుండి రుణాలు పొందడమే కాకుండా, వాటిని సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ఎదగాలని కోరారు. అప్పుడే సంఘాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని హితబోధ చేశారు.

వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ సమస్య తలెత్తినా పారదర్శకమైన పరిష్కారం లభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను (Status) ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ రోహిత్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వేంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లో వైభవంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం

0

జైనథ్ లో వైభవంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్,జైనథ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా జైనథ్ మండల కేంద్రంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సమావేశం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు అధికారులు గర్భిణులకు పండ్లు, పూలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ఈ వేదికగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, తహసీల్దార్ నారాయణ, మండల ప్రత్యేక అధికారి, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.