Home Blog Page 18

ఆదిలాబాద్‌లో భారీ జాబ్ మేళా

0

ఆదిలాబాద్‌లో భారీ జాబ్ మేళా

5000+ ఉద్యోగాలు, ఈ నెల 20న చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో!

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం మరో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న నిర్వహించిన జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన లభించిందని, అదే స్ఫూర్తితో ఈ నెల 20వ తేదీన మావలలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాబ్ మేళాలో ఐటీ, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ వంటి వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 5000కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితిని సరళీకరించి, 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉన్న వారికి అవకాశం కల్పించారు. అర్హతలను బట్టి అభ్యర్థులకు ఏడాదికి ₹1.5 లక్షల నుండి ₹4 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది.ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటా లేదా సివి(CV) లను సిద్ధం చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, సందేహాల నివృత్తి కోసం 9666612707, 7981255978 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి, జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

బేలలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

బేలలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,బేల: రైతులకు మద్దతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆధ్వర్యంలో బేలలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్‌లో జొన్నలకు ఆశించిన ధర లభించక రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా రైతుల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నానని స్పష్టం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను ఇప్పటికే పదిసార్లు మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.

గోదాముల కొరతపై మహారాష్ట్ర మంత్రులతోచర్చలు: గత ఏడాది వచ్చిన పంటలతో పాటు, ప్రస్తుతం ఉన్న మొక్కజొన్న, శనగ నిల్వల కారణంగా తెలంగాణతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదాములు పూర్తిగా నిండిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిల్వల సమస్యను అధిగమించడానికి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో గోదాముల లభ్యతను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై తాను స్వయంగా మహారాష్ట్ర మంత్రులతో మాట్లాడినట్లు వెల్లడించారు.

రైతులకు కీలక సూచన: కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి జొన్నలను తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి అక్రమాలకు స్థానిక రైతులు ఎవరూ సహకరించవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపి నాయకులు ఇంద్రశేఖర్,నందు,రాకేష్,రాజు, బీఆర్ఎస్ నాయకులు దేవన్న, ప్రమోద్ రెడ్డి, తేజరావ్, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

బేల మండలంలో పశు సంవర్ధక ప్రదర్శన: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

బేల మండలంలో పశు సంవర్ధక ప్రదర్శన: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, బేల:  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం బేల మండలం సిర్సన్న గ్రామంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు,  ‘మేలు జాతి దూడల ప్రదర్శన’ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.నిరుద్యోగ యువత పాడి పరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.రైతులకు అవసరమైన మేలు రకం గడ్డి విత్తనాలు, గడ్డి కటింగ్ మిషన్లను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.పాడి రైతుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఉత్తమంగా పెంచిన ముర్రా గేదె దూడలు, దేశీవాళీ ఆవు దూడల యజమానులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జె.డి రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్ స్వామి, బేల వ్యవసాయ అధికారి సాయి తేజ, బేల పశువైద్య అధికారి దీప్ రధన్, ఎంపీఓ మహేష్, సర్పంచ్ పోచక్క, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ గోడం నగేష్ 

0

 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ గోడం నగేష్ 

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న, జొన్న పంటలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్  పరామర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎంపీ, జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల గోసను ఆలకించిన ఎంపీ, వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. బోథ్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం (Fire Station) ఏర్పాటు చేయాలన్న రైతుల విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో అధికారులతో చర్చించి, త్వరలోనే ఇక్కడ అగ్నిమాపక కేంద్రాన్ని తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరే రవీందర్, మాజీ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జి.వి. రమణ, బోథ్, బజార్ హత్నూర్ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం: రైతుల కష్టాలపై మాజీ జడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం

0

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం: రైతుల కష్టాలపై మాజీ జడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్తమైన కొనుగోలు విధానాల వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలంటే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జొన్న పంట చేతికి వచ్చి నెల రోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం రెండు చోట్ల మాత్రమే ప్రారంభించి ప్రభుత్వం కాలయాపన చేస్తు, జూన్ మొదటి వారం వరకు గడువు ఇవ్వడం వల్ల రైతులు తదుపరి ఖరీఫ్ సీజన్‌కు ఎలా సిద్ధమవుతారని ఆమె ప్రశ్నించారు. సోయాబీన్, శనగ పంటల కొనుగోలులో నాణ్యత సాకులు చూపిస్తూ రైతులను ఇబ్బంది పెడుతు సోయా రైతులు క్వింటాల్‌కు రూ. 1000 నుండి 1500 వరకు నష్టపోయారని, ఇప్పుడు శనగ పంట విషయంలోనూ అదే ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీలను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని సుహాసిని రెడ్డి విమర్శించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం అన్యాయమన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఫసల్ బీమా పథకం విషయంలో రైతులను మోసం చేశారని ఆమె ఆరోపించారు. పంట నష్టపరిహారం చెల్లింపులోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు తమ కష్టాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకునేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తక్షణమే జొన్న, శనగ పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టర్ చొరవ: గిరిజన రైతు దశాబ్దాల భూ సమస్యకు మోక్షం

0

కలెక్టర్ చొరవ: గిరిజన రైతు దశాబ్దాల భూ సమస్యకు మోక్షం

చిత్రం న్యూస్, భీంపూర్, (ఆదిలాబాద్): నిరుపేద గిరిజన రైతుల సమస్యల పట్ల జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందిస్తే ఎంతటి ఫలితం ఉంటుందో భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామంలో నిరూపితమైంది. కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో మడవి గంగారాం అనే గిరిజన రైతుకు చెందిన 9 ఎకరాల భూ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది.

సమస్య నేపథ్యం: గొల్లఘాట్ గ్రామానికి చెందిన రైతు మడవి గంగారాంకు సర్వే నంబర్ 74/1/3లో 9.00 ఎకరాల సాగు భూమి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల గతంలో ఈ భూమి ‘నిషేధిత జాబితా’లో (Prohibited List) చేరిపోయింది. దీనివల్ల ఆయన దశాబ్దాలుగా ఆ భూమిపై హక్కులు ఉన్నప్పటికీ, పట్టా పొందలేక ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు.పరిష్కారం ఇలా..ఈ సమస్యపై రైతు గంగారాం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన వెంటనే స్పందించారు. ‘భూభారతి’ ద్వారా ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ బృందం క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, భూమి రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం గంగారాం పేరిట భూమిని నమోదు చేశారు.అనంతరం ఆయనకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. తన దశాబ్దాల సమస్య తీరడంతో సంతోషం వ్యక్తం చేసిన గంగారాం, కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షాను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. “నా భూమి నాకు దక్కింది, ఇప్పుడు నేను ధైర్యంగా సాగు చేసుకోవచ్చు” అని ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

* నేల తల్లికి నష్టం.. పర్యావరణానికి ముప్పు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణంతో పాటు భూసారం తీవ్రంగా దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులను హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులకు పలు సూచనలు చేశారు. వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే హానికర వాయువులు వాయు కాలుష్యాన్ని పెంచుతాయని , దీనివల్ల అటు ప్రజలు, ఇటు పశువుల శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మంటల వల్ల నేలలోని నత్రజని, భాస్వరం వంటి కీలక పోషకాలు ఆవిరైపోతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి, భూమి చవిటిగా మారుతుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గడమే కాకుండా, రసాయన ఎరువుల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అవశేషాలను తగలబెట్టడానికి బదులుగా ఆధునిక పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు. రోటవేటర్ ద్వారా వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల అవి సేంద్రీయ ఎరువుగా మారి నేలకు బలాన్నిస్తాయని, పంట వ్యర్థాలను కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్‌గా మార్చుకోవాలన్నారు. వరి గడ్డిని తగలబెట్టకుండా పశుగ్రాసంగా వినియోగించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజం

0

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిపోయిన జొన్న, మక్క పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అన్నదాతలకు భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేయడం వల్లే అకాల వర్షాలకు మార్కెట్‌లో నిల్వ ఉంచిన పంటలు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా, ఇప్పటికీ రబీ పంటల కొనుగోలుపై స్పష్టత లేకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు, వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు ప్రభుత్వంపై తనవంతుగా ఒత్తిడి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.”అకాల వర్షాల వల్ల తడిసిన పంటను ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాలి. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, మీకు అండగా మేముంటాం” అని పాయల్ శంకర్ పేర్కొన్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు – మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి

0

రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు – మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్శన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మార్చెట్టీ గోవర్ధన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించారు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన జొన్నలు అకాల వర్షం కారణంగా తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించిన నాయకులు రంగంలోకి దిగారు.వెంటనే మార్కెట్ అధికారులతో పాటు జిల్లా మార్కెటింగ్ అధికారి (DM) తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వర్షం వల్ల పంట నష్టం జరగకుండా ఉండేందుకు మార్కెట్ ప్రాంగణంలోని ఖాళీ గోదాముల్లో జొన్నలను నిల్వ చేసేందుకు అనుమతి కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే గోదాముల్లో పంటను భద్రపరిచేందుకు అనుమతినిచ్చారు. దీంతో తడిసిపోతున్న పంటను సురక్షితంగా గోదాములకు తరలించి నిల్వ చేశారు. ఆపద సమయంలో స్పందించి తమ పంటను కాపాడినందుకు రైతులు బీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. .బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట రోడ్డుపాలవుతోందని విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి కొనుగోళ్లు జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వారి వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డి పురుషోత్తం రెడ్డి, సుభాష్ యాదవ్, స్వామి యాదవ్, రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు

బెల్గాంలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

0

బెల్గాంలో గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు 

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బెల్గాం గ్రామంలో గురువారం ఉదయం కురిసిన భారీ అకాల గాలివానకు అతలాకుతలమైంది. ఎండల నుంచి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ఈ అకాల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలుల తీవ్రతకు గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి ఇండ్లపై, రోడ్లపై పడిపోగా, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలుల ఉధృతికి పేదల ఇళ్లపై కప్పుకున్న రేకులు గాలిలో ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న నిత్యావసర సరకులు తడిసి ముద్దయ్యాయి. రేకులు లేని ఇళ్లలో బాధితులు వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జరిగిన నష్టాన్ని చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.గ్రామంలో గాలివాన బీభత్సం వల్ల దెబ్బతిన్న ఇండ్లను గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.