పీవీటీజీలకు శాపంగా మారిన జన్ మన్ పథకం
* డబ్బులు పడక లబ్దిదారుల ఎదురుచూపులు
చిత్రం న్యూస్, బేల: కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనులకు పీఎం జన్ మన్ పథకంలో ఇండ్లను మంజూరు చేస్తోంది. కానీ సాంకేతిక లోపల వల్ల జన్ మన్ ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఇళ్ళు వచ్చాయని సంతోష పడాలో..బాధ పడాలో లబ్ధిదారులకు అర్థం కావడం లేదు. బేల మండలంలో మొత్తం 1,354 ఇళ్ళు మంజురు కాగా అందులో 593 ఇందిరమ్మ ఇళ్ళు. మిగతావి జన్ మన్ పథకం కింద PVTG లకు స్పెషల్ గ్రాంట్ కింద కోలాం కులానికి చెందిన వివిధ గ్రామాలలో లబ్ధిదారులకు 761 ఇళ్ళు మంజురయ్యాయి. కాగా చప్రాల గ్రామంలో మొత్తం 85 ఇందిరమ్మ మంజూరు కాగా, అందులో పీవీటిజీ(PVTG )స్పెషల్ గ్రాంట్ లో 43 ఇళ్ళు మంజురయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక్కో పని పూర్తి చేసిన వెంటనే పంచాయతీ సెక్రటరీ ఫోటో అప్ లోడ్ చేసిన వారం లోగా డబ్బులు పడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.3 లక్షలు అందిన తరువాత కేంద్ర ప్రభుత్వం నుండి రూ.1.40 లక్షలు మిగతా ఉపాధి హామీ అకౌంట్ లో రూ.60వేలు చెల్లిస్తున్నారు. అయితే PVTG లబ్ధిదారులకు మాత్రం కేంద్రం నుండి నేరుగా మొదట చెల్లించిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వ వాట చెల్లింపు నిబంధన పెట్టింది. ఇదే లబ్ధిదారులకు కొర్రిగా మారింది. కేంద్రం నుండి చెల్లించాలంటే లబ్ధిదారుల ఆధార్ కార్డు, జాబ్ కార్డు, అకౌంట్ నెంబర్ లో లోపాలు ఉండడంతో దాదాపు 90%మంది లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. దీంతో బేస్ మెంట్ కట్టిన లబ్ధిదారుల పని ముందుకు సాగకుండా అవస్థలు పడుతున్నారు.
గుడిసెలో ఉంటున్నాం.. మాకు ఇళ్ళు వచ్చాయి కానీ ఇప్పటి వరకు డబ్బులు పడడం లేదని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదనిలబ్ధిదారులు పేర్కొన్నారు. మేము ఇళ్ళు కూలగొట్టి గుడిసెలో ఉంటున్నాము. వచ్చేది వర్షాకాలం ఎంతో ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికారులు అర్థం చేసుకోని సకాలంలో బిల్లులు మంజూరు అయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.
వెంటనే బిల్లులు మంజూరు చేయాలి.. లబ్దిదారులకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చప్రాల గ్రామ ఉప సర్పంచ్ సాగర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు PVTG కింద కోలాం తెగకు 43 ఇళ్ళు కేంద్రం నుండి జన్ మన్ పథకంలో మంజురు కాగా ఇప్పటి వరకు ఒక్కరికి డబ్బులు పడలేదన్నారు. ఉన్న ఇండ్లను గిరిజనులు కూలగొట్టి గుడిసెల్లో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు బిల్లులు మంజూరు కాకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళన చెప్పడతామన్నారు.
త్వరలో సమస్యకు పరిష్కారం: హౌసింగ్ ఏఈ లింగం మాట్లాడుతూ.. బేల మండలంలో మొత్తం 761వరకు PVTG లో ఇళ్ళు మంజురయ్యాయని ఇందులో లబ్ధిదారులకు రూ.2లక్షలు కేంద్రం, మిగిలిన రూ.3లక్షలు రాష్టం ఇస్తుందన్నారు.అయితే ఇప్పటి వరకు మొదటి బిల్లు 340మందికి రూ.20 వేలు లబ్ధిదారులకు చెల్లించామని, మిగిలిన వారి డేటా ఇంట్రిలో తప్పులు ఉండడంతో జాప్యం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లిందన్నారు. ప్రభుత్వాలు యాప్ ను సరిచేసి సమస్యలను తొలిగించే పనిలో ఉన్నారని త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.




