-Advertisement-

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా 

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కొలువులు సాధించడం సులువవుతుందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణలో భాగంగా ఆదివారం స్థానిక రాంనగర్ కాలనీలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సివిల్స్ ప్రిపరేషన్ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ పోటీ పరీక్షల తయారీపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష ఏదైనా ముందుగా సిలబస్‌పై సంపూర్ణ స్పష్టత ఉండాలని, పరిమిత ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. వార్తాపత్రికలు, మేగజైన్ల నుంచి ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్స్ రాసుకుంటే చివరి సమయంలో రివిజన్ సులభమవుతుందని తెలిపారు. తక్కువ మంది మిత్రులతో గ్రూప్‌ స్టడీ చేయడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సందేహాలు నివృత్తి అవుతాయని చెప్పారు. మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాస్తూ తప్పులను విశ్లేషించుకోవాలని, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో సరైన జవాబును గుర్తించేందుకు ఎలిమినేషన్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే పలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు రానున్నందున అభ్యర్థులు ఫోన్ వంటి ఆకర్షణలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదవాలని పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్ భవన శాశ్వత నిర్మాణంతో పాటు డిజిటల్ బోధనకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. కె.రమేష్, అధ్యాపకులు, ఉద్యోగార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments