-Advertisement-

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని జోగు రామన్న సందర్శించారు. దీక్ష 12వ రోజుకు చేరుకోగా, సుభాష్‌నగర్‌కు చెందిన యువత పాల్గొన్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమైతే సుమారు 6,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంత కీలకమైన పరిశ్రమను రాజకీయ కోణంలో చూడటం సరికాదని అన్నారు.

సీసీఐ సాధన సమితి నాయకులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా “సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని” హామీ ఇచ్చారా? లేక అది అనుకోకుండా వచ్చిన మాటలా? అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పరిశ్రమ పునఃప్రారంభానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. “ఎక్కడ బీఆర్‌ఎస్ పార్టీకి పేరు వస్తుందోననే రాజకీయ ఆలోచనతో యువత భవిష్యత్తును పట్టించుకోకపోవడం సరికాదు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధను, ఉద్యోగాలు కల్పించే సీసీఐ వంటి పరిశ్రమలపై కూడా చూపాలి” అని జోగు రామన్న అన్నారు. సీసీఐ పునఃప్రారంభం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం టాస్క్ అధ్యయన కేంద్రంలో సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రకుమార్, జాన్ వెస్లీ, మాజీ ఎంపీ వినోద్, సీపీఎం నేతలు గోవర్ధన్, నంది రామయ్య, ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజారెడ్డి తదితరులు హాజరై సీసీఐ పునఃప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దీక్షాదారులు అన్నెలా వసంత్, ముక్కుల నరేష్, దికొండ అశోక్, శేఖర్, షేక్ సలీం, వంశీ, వీలీన్, రాహుల్, ఉషారెడ్డి, దస్తగిరి, సందీప్, కమిటీ సభ్యులు యూనిస్ అక్బని, ఇజ్జగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకట్ నారాయణ, ఈశ్వర్ దాస్, జై సింగ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments