గ్రామాల భద్రతకు సీసీటీవీలు కీలకం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
* చెప్రాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
చిత్రం న్యూస్, బేల: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మూడు గ్రామాల్లో 35 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అందులో భాగంగానే బేల మండలం చెప్రాల గ్రామంలో 15, సిర్సన్నలో 16, ఎకోరిలో 4 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా ఎంతో కీలకమని ఎస్పీ తెలిపారు. గ్రామాలు సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్థులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా చెప్రాల గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపను ఎస్పీ ప్రారంభించారు. ఈ క్యాంపులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిష్ణాతులైన ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, డెంటల్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ తదితర విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స అందించారు. దీర్ఘకాలికంగా కంటి సమస్యలున్న 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రజల భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. 500 పైగా పాల్గొన్న గ్రామ ప్రజలు యువత ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవడం ఆనందకరమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ శ్రావణ్ కుమార్, ఎస్ఐ మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
