బాసరలో మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు: ఎస్పీ జానకి షర్మిల అభినందనలు
చిత్రం న్యూస్, బాసర : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను బాసర పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.గోదావరి నది వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో బాసర పోలీసులు తక్షణమే స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా వ్యవహరించి ఆ మహిళను ఒడ్డుకు తీసి రక్షించారు. అనంతరం ఆమెను బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ సదరు మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విపత్తు సమయంలో ఆపద్బాంధవుడిలా స్పందించి, మహిళ ప్రాణాలను కాపాడిన బాసర పోలీసుల సమయస్ఫూర్తిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ప్రత్యేకంగా అభినందించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి పలువురు స్థానికులు కూడా ప్రశంసలు గుప్పించారు.
