రిమ్స్ మెడికో హాస్టల్స్ లో డెంగ్యూ కలకలం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కాలేజీ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రెండు కేసులు నమోదైనట్లు రిపోర్ట్ రావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అంకోలి హెల్త్ సూపర్ వైజర్ ఆడే సురేష్ ఆధ్వర్యంలో మెడికల్ బృందం సోమవారం హాస్టల్ లోని ప్రతి గదిలో పొగమందు పిచికారి చేశారు. కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, కె. శ్రీవాణి, డి. మమత, పరశురామ్, బ్రీడింగ్ చెకర్లు పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూపర్ వైజర్ సూచించారు.
