మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగ కులస్తులు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ..జనాభా 11% ఉందని, ఎస్సీ వర్గీకరణలో కూడా అంతే వాటా కేటాయించాలని మంద కృష్ణ మాదిగ గతంలో లేవనెత్తిన ప్రశ్నలు సంపూర్ణ న్యాయమని కుల గణన రిపోర్ట్ తో స్పష్టం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదికలో మాదిగల జనాభా 10.3 % గా తేలిందని దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చే సమయంలోనే 9% రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అయినా రేవంత్ రెడ్డి ఆనాడు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చిన కుల గణన రిపోర్ట్ ద్వారా మాదిగల జనాభా శాతం గణంకాలతో సహా ఋజువైందని,ఇప్పుడైనా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు తెచ్చుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. సందర్భం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ సందర్భం ఇప్పుడు వచ్చిందని గుర్తించాలని అన్నారు.
మంద కృష్ణ మాదిగ జనాభా ప్రకారం మాదిగలకు 11% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంత జాతి ద్రోహులు మాదిగ మేధావుల ముసుగులో 9% రిజర్వేషన్లను స్వాగతించి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటి ద్రోహులకు కుల గణన రిపోర్ట్ చెంప పెట్టు లాంటిదని అన్నారు. మాదిగల జనాభా శాతానికి కన్న తక్కువ శాతం రిజర్వేషన్లు రావడాన్ని స్వాగతించిన ద్రోహులు ఇప్పుడు మాదిగ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కీలక ఘట్టంలో జాతికి వెన్నుపోటు పొడిచి తీరని ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించే మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ద్రోహం ఎప్పటికైనా ఓడిపోతుందని సత్యమే ఎప్పటికైనా గెలిచి తీరుతుందని అన్నారు. జాతికి ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించి మాట్లాడే అర్హత ఇకపై లేదని అన్నారు.ఇక ప్రభుత్వం బహిరంగపరిచిన కుల గణన రిపోర్ట్ లో జనాభాలో మాదిగలు ప్రథమ స్థానంలో ఉన్నట్లుగానే దినసరి కూలీ పని చేసుకునే వారిలో,అలాగే భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్న వారిలో కూడా మాదిగలే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇది మాదిగల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని సూచిస్తుందని అన్నారు.గత 80 ఏళ్ల కాలంలో మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పని చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టాలని,ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల ప్రభుత్వరంగ నియామకాల్లో 11% వాటా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలు శాసనమండలిలో , లోక్ సభ, రాజ్యసభలో, నామినేటెడ్ పోస్టులో ఒక్కరు కూడా లేరని, ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో బలమైన నిర్మాణాత్మక శక్తిగా ఎదగడానికి మరింత సంఘటితం కావాలని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు ఫులే ద్విశత జయంతి ఉత్సవాలను రెండు సంవత్సరాల పాటు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుందని, అందుకోసం ప్రధానమంత్రి చైర్మన్ గా 126 మందితో కమిటీ ఏర్పాటు చేసిందని,ఆ కమిటీలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను సభ్యుడిగా నియమించడం జరిగిందని,అందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి యావత్తు మాదిగ జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇది మాదిగలు ఇచ్చిన గుర్తింపు,గౌరవంగా భావిస్తామని అన్నారు.ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, దేశంలో మొదటిగా మహాత్ముడిగా నిలిచిన మహాత్మా ఫులే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, మందర్న మారుతి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చెవురి సంజీవయ్య మాదిగ, MRPS నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, టౌన్ నాయకులు రాహుల్ మాదిగ, ఎల్లన్న మాదిగ, సత్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.




