పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా తీరుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్లో, డిపోల నుండి బంకులకు చేరుతున్న ఇంధన సరఫరా తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

