ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు
చిత్రం న్యూస్,ఖానాపూర్: రాజకీయ కుట్రలను ఛేదించి ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా సోమవారం ఖానాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ గోడం నగేష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారంతో ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఖానాపూర్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని స్వర్గీయ రాథోడ్ రమేష్ గారికి అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడిందని, ఇదే ఉత్సాహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

