చిత్రం న్యూస్, బేల :గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్ల ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధి హామీ నిధులు రూ.16 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహరీ గోడ, కిచెన్ షెడ్, బాయ్స్ టాయిలెట్స్ పనులకు సర్పంచ్ గేడాం గులాబ్, ఉపసర్పంచ్ రాజు, గ్రామస్తులతో కలసి ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాటన్ గ్రామానికి ఉపాధి హామీ నిధులు పాఠశాల ప్రహరీ గోడకు రూ.16 లక్షలు, సీ సీ రోడ్లకు రూ.7 లక్షలు, కల్వర్టు కొరకు రూ.20 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాబోయే రోజులలో మరెన్ని నిధులు తీసుకువచ్చి పాటన్ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామనాన్నారు. ఈ కార్యక్రమంలో పాటన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నారాయణ్ రెడ్డి, అనిల్, జమీర్, సతీష్, రెడ్డి, రవీందర్, ఆనంద్ రావు, సూర్యభాన్, ఉద్ధవ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ :జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి
చిత్రం న్యూస్, అదిలాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చిందని అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత భీమా పథకం రాష్ట్రానికి గర్వకారణమని దీనివల్ల ప్రతి పేద కుటుంబం లబ్ది పొందుతుందని ఆయన తెలిపారు
ఏటీసీ కేంద్రాల్లో చదువుకుని ఐటీఐ విద్యార్థులను ప్రోత్సహించేందుకు నెలకు రూ.2 వేలు స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు. ఏటీసీ సెంటర్లలో టాటా సంస్థ సహకారంతో ఆదిలాబాద్, ఉట్నూర్ ఐటీఐ కళాశాల విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమని పేర్కొన్నారు. సాత్నాల ప్రాజెక్ట్ రూ. కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్ కి 4.62 కోట్లు, ముఖ్యంగా సీఆర్‌ఆర్ చనాక-కోరట బ్యారేజ్ పనుల కోసం రూ.177.54 కోట్లు కేటాయించగా, అందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంక్షేమం, ప్రజా అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తూ ఆదిలాబాద్ జిల్లాకు అదనపు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండి దేవదాస్ చారి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గౌలి సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిరాజ్, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరామేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొయిన్, ఇర్షద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు భరోసా అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాకేష్ రెడ్డి
చిత్రం న్యూస్, జైనథ్: కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం పట్టా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్యను ఆయన “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించారు. అప్పుల బాధ తాళలేక తనువు చాలించిన గణపతి కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మృతి చెందిన తుడుం గణపతి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. రైతు బీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుండి 75 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిడం రాకేష్, సాయి ,ప్రవీణ్, నర్సింగ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆకుపచ్చ, గులాబీ రంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉందని, మహిళకు సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, మృత దేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే బాసర పోలీస్ స్టేషన్ లో (8712659540) సంప్రదించాలని తెలిపారు.
మనోరమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆర్.ఎం.పీ సంతోష్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం (Mega Health Camp) నిర్వహించారు. చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారు పరీక్షలు చేయించుకున్నారు. స్త్రీ వైద్య నిపుణురాలు డా. రమాదేవి, పిల్లల వైద్య నిపుణులు డా.చంద్రశేఖర రావు, నరాల శస్త్ర చికిత్స నిపుణులు డా. నరసింహ కట్ట, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డా. ఆదిత్య కన్నా, గుండె వైద్య నిపుణులు డా. శ్రీకాంత్, నరాల వైద్య నిపుణులు డా. సుదర్శన్ రెడ్డి, కిడ్నీ వైద్య నిపుణులు డా. శ్రీనివాస్, నెఫ్రాలజీస్ట్ డా.హరికృష్ణ రెడ్డి, జనరల్ మెడిసిన్ హనీష్, శశిధర్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చూయించుకున్నవారికి యాజమాన్యం ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీస్పీ మనోరం, గ్రామాల సర్పంచులు కౌట బాబురావు, ఓని సర్పంచ్ జగదీష్ పటేల్, కీర్గుల్ కె సర్పంచ్ మలేగం సురేష్, సవర్గం సర్పంచ్ ముత్తు బాయ్, వివిధ గ్రామాల సర్పంచులు, పాల్గొన్నారు. నూతన సర్పంచులను మనోరమ హాస్పిటల్ తరపున ఘనంగా సన్మానించారు.అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డా.సంతోష్ ను సన్మానించారు
.
మెండోర మండలంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
చిత్రం న్యూస్, పోచంపాడ్: నిర్మల్ జిల్లా మెండోర మండలంలోని పోచంపాడ్ , దూదిగాం, మెండోర గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ ప ం డుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా మైదానాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో భాగంగా, ఒకరినొకరు ‘ఈద్ ముబారక్’ అంటూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు, యువకులు, అధికారులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ వేడుకలలో పోచంపాడు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ అధికారులు, మాధురి రాజు, ఉప సర్పంచ్ సతీష్, మాజీ సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు. అలాగే, దూదిగాం గ్రామ సర్పంచ్ హరూన్ రషీద్ బాబా, నెహ్రూ నగర్‌కు చెందిన ధనరాజ్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.పండుగ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెండోర పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ జాదవ్ సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షణ చేపట్టి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈద్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముస్లింల పవిత్ర పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం మండల ప్రజల సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈద్గా మైదానాలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
భైంసాలో ప్రశాంతంగా రంజాన్ వేడుకలు
*తప్పిపోయిన చిన్నారులను గుర్తించిన పోలీసులు
చిత్రం న్యూస్, బైంసా: భైంసా పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ జనసందోహం మధ్య తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు చాకచక్యంగా గుర్తించి, వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించారు. రంజాన్ పండగ సందర్భంగా భైంసా పట్టణంలోని ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన భారీ జనసందోహంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి చిన్నారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల అప్రమత్తతతో కొద్ది సమయంలోనే చిన్నారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రార్థనల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈద్గా వద్ద ప్రత్యేక పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు.ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలతో పాటు ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు మల్లేష్, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, ఎస్ఐ అశోక్, ఆర్‌ఎస్‌ఐలు రవి, సాయి కృష్ణ తదితర పోలీసులు పాల్గొన్నారు.
చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
చిత్రం న్యూస్, బేల: మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 24 న నిర్వహించ తలపెట్టిన చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చాంద్పెల్లి రాయిసెంటర్ సార్మెడీ కోరేంగే సోనేరావు పోలుపునిచ్చారు. శనివారం గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో “చలో దిల్లీ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్మెడీ సోనేరావు పటేల్ మాట్లాడుతూ.. బేల మండలంలోని 9 తెగల ఆదివాసీ పెద్దలు,పటేల్, దేవరీ, మహాజన్, గ్రామ సర్పంచ్ లు అన్ని సంఘాల నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జిల్లా నుండి వేల సంఖ్యలో ఆదివాసీలు దిల్లీకి వెళ్ళి మన ఐక్యతను చాటాలన్నారు .ఈ కార్యక్రమంలో మెస్రం కిషన్, రితేష్ పూసం, నైతం హేమంత్, కిరణ్, మోహన్, పటేల్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు
చిత్రం న్యూస్, ముథోల్ : రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు బోధనలు చేశారు. పేద ముస్లిం కుటుంబాలకు దాన ధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండంలో ఈద్గాల వద్ద మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా బడ్జెట్లో సైతం పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నా రు.
రామ మందిరం నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ (కె) గ్రామానికి నూతన రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రోసిడింగ్ కాపీని అందజేశారు. రామ మందిరం నిర్మాణానికి 25 లక్షలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మలేగాం సురేష్, మాజీ సర్పంచ్ దే వేందర్, గ్రామ పెద్దలు సగుల్లా శ్రీనివాస్, బంటు రవి, సురేష్, సంతోష్, ఏ. పోతన్న, మహేందర్, గంగాధర్, రాములు, శంకర్, లక్ష్మణ్, సీనియర్ నాయకులు ఉన్నారు.









