చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని చిత్రపటాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖల్లో ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు ధోనీ జ్యోతి, ఏనుగు రాకేష్ రెడ్డి, సన్నీ, ఆత్రం సాయి, వేద వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని చిత్రపటం ఏర్పాటు ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో మరింత స్ఫూర్తి నింపవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
జైనథ్ లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
చిత్రం న్యూస్, జైనథ్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని, అవినీతి అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీకి ముట్టడికి వెళ్తున్న బీజేపీ జైనథ్, భోరజ్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గాజుల సన్నీ పలువురు బీజేపీ నాయకులను జైనథ్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ముందస్తు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం వేకువజమున సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు.
నీటి వనరులను సంరక్షించాలి
చిత్రం న్యూస్, బేల: సకల జీవరాసులకు ప్రాణధారమైన నీటిని వాడుతూ భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ క్యాతం పొచ్చక్క సురేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు..వారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఊరురా నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధ జలాలను అందించడం అభినందనీయమన్నారు శుద్ధ జలంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, వితంతువులకు సాయం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆ సంస్థ సేవలను కొనియాడారు కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు మమత, బాలవికాస సంస్థ ప్రతినిధి నరేందర్ బోయర్, గ్రామస్తులు గోదూరి భూమన్న కృష్ణారెడ్డి, భూమారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
బోరు మోటారు ఏర్పాటు చేసి.. నీటి సమస్య తీర్చి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం సవర్గం గ్రామంలో గత 3 రోజులుగా నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులకు సర్పంచ్ గాదెకర్ ముత్తు బాయ్,అండగా నిలిచారు. బోరు బావి మోటారు కాలిపోవడంతో సమస్యను గుర్తించిన సర్పంచ్ స్పందించి కొత్త బోరు మోటారును ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోనెలకొన్న ప్రతి సమస్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు.
భజన పోటీల విజేత రవీంద్రనగర్ బృందం
చిత్రం న్యూస్, భీంపూర్: శ్రీరామ నవమిని పురస్క రించుకుని కరంజి-టిలో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సాగిన భజన పోటీల్లో విజేతగా ఆదిలాబాద్ పట్టణం రవీంద్ర నగర్ భజన బృందం ప్రథమ బహుమతి సాధించి విజేతగా నిలిచింది. తలమడుగు మండలం బరంపూర్ ( ద్వితీయ), న్యూ హౌసింగ్ బోర్డు, ఆదిలాబాద్ ( తృతీయ), దిగ్రస్, మహారాష్ట్ర( నాల్గవ ), సాంగిడి, బేల ( ఐదవ), గుబిడి, భీంపూర్ (ఆరవ ),కరంజి -కే, జైనథ్ (ఏడవ) బహుమతి సాధించారు. విజేతలకు సర్పంచ్ కల్చాప్ యాదవ్, గ్రామ పెద్దలు నరేందర్ యాదవ్, రమేష్, దేవా రెడ్డి, ఉద్దవ్, తదితరులు నగదు బహుమతులు అందజేసి అభినందించారు. జైనథ్ మండలం కరంజి -కే భజన బృందం కళాకారుడు భగవాన్ రెడ్డి ఉత్తమ గాయకుడి బహుమతి గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలకు ఆదిలాబాద్, తలమడుగు, జైనథ్, తాంసి, బేల మండలాల భజన బృందాలతో పాటు సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల నుంచి 22 భజన బృందాలు పాల్గొన్నాయి. భజన కళాకారులు తమ గానంతో అలరించారు. న్యాయ నిర్ణేతలుగా ఉమేష్, ఆనంద్, రమేష్ యాదవ్ వ్యవహరించారు.
తంబర్లను పరామర్శించిన తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు.డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్
చిత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రతినిధి: జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న వెంగన్నపాలెం గ్రామంలో గత నెల 19న గురువారం ర తంబర్ల నరసింహారావు తల్లి తంబర్ల లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు.డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ వెంగన్నపాలెం గ్రామంలో ఉన్న తంబర్ల నరసింహారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆయనకు ఆయన కుటుంబానికి మనోధైర్యం తెలియజేశారు, నర్సింహారావు బహుజన ఉద్యమాల్లో కీలకపాత్ర వహిస్తూ ప్రజల కోసమే పాటుపడినటువంటి వ్యక్తి ఇప్పుడు జర్నలిస్టుగా తన సేవలు ప్రజలకు అందిస్తూ చురుగ్గా ఉంటున్న సమయాన తన ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో రవి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, ముథోల్ : ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ భైంసా డివిజన్ పరిధిలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. భైంసా డివిజన్ పరిధిలో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు, కుభీర్ మార్కెట్ యార్డు, తానూర్, ముథోల్ (విట్టోలి) లో శనగ కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, శనగ రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాలలో తమ పంటను విక్రయించాలని సూచించారు.ప్రభుత్వం శనగకు క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరను నిర్ణయించిందని, రైతులు తమ పంటలో తేమ శాతం 14 శాతానికి మించకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రైవేటు మార్కెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నందున, రైతులు ప్రభుత్వ కేంద్రాలలో అమ్మడం ద్వారా లాభపడతారని ఆయన పేర్కొన్నారు.త్వరలోనే మక్క, జొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
సారంగపూర్ లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వంపై అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) సొసైటీ ఆధ్వర్యంలో జామ్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.పి.ఓ)లో రైతులకు సభ్యత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంస్థ అసిస్టెంట్ రిజిస్టార్ నారాయణ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు సమూహంగా ఏర్పడితే వారి పంటల ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులు సమష్టిగా కృషి చేయడం వల్ల మార్కెట్లో మంచి ధర పొందవచ్చని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు ఈ సందర్భంగా, రైతు సమూహానికి ప్రభుత్వం అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తుందని, దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ అవగాహనతో అనేకమంది రైతులు ఎఫ్.పి.ఓలో సభ్యత్వం పొందడానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రవళి విలాస్, స్థానిక నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
రంజని తండా నుంచి రోడ్డు లేక ప్రజల అవస్థలు
చిత్రం న్యూస్, కుభీర్: కుభీర్ మండలంలోని రంజని తండా నుండి కుబీర్ వెళ్లే రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని గ్రామస్తులు విన్నవిస్తున్నారు.రంజని తండా నుండి కుభీర్ వెళ్లే ప్రధాన రహదారి గత రెండున్నర ఏళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉంది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ రోడ్డు పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని తండవాసులు పేర్కొంటున్నారు.అత్యవసర సమయంలో గర్భిణులని ఆసుపత్రికి తరలించాలంటే ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించడం ప్రాణసంకటంగా మారింది. సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు నడపడం అత్యంత ప్రమాదకరంగా మారింది. గతంలో పలుమార్లు విన్నవించినప్పటికీ, ఏ అధికారి కూడా ఈ రోడ్డు పనుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజా సేవ కోసం పనిచేస్తామన్న ఈ ప్రభుత్వం, మా తండా ప్రజల గోడును ఆలకించి, తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా, వెంటనే స్పందించి మాకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ సంతోష్ రావ్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహెగావ్ గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తరపున లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆత్మ చైర్మన్ సంతోష్ రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందింస్తుందన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గ్రామంలో 37 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్లను అదనంగా ఇస్తామని పేర్కొన్నారు.










