చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని రేణుకాపూర్ హనుమాన్ ఆలయ పునః నిర్మాణం,ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీని వీడీసీ గౌరవ అధ్యక్షులు తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు నూకం లింగారావు,గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేణుకాపూర్ ఆలయ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులుగా సంజీవరావు దేశ్ముఖ్, ఉపాధ్యక్షులుగా గురు స్వామి శ్రీనివాస్, పద్మారావు, క్యాషియర్ ప్యాట్ల సుకేష్ రావు, కొక్కుల గంగాధర్, సెక్రెటరీ పుట్నాల సాయినాథ్ పటేల్, రాజు పట్వారి, పీఆర్ఓ భీమ్ రావు ను అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ సహకారంతో పాటు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
రైతులకు అందుబాటులో ఎన్‌ఎస్‌సి కూరగాయల విత్తన కిట్‌లు
చిత్రం న్యూస్, జైనథ్: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSC) ద్వారా రైతుల కోసం 5 రకాల కూరగాయల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్‌లు అందుబాటులోకి వచ్చాయని జైనథ్ మండల వ్యవసాయ అధికారి పూజ తెలిపారు. ఈ కిట్‌లో టొమాటో, మిర్చి, బెండకాయ, తోటకూర, పాలకూర వంటి నాణ్యత విత్తనాలు ఉన్నాయన్నారు. కిట్‌లు ఇంటి తోటల పెంపకానికి కూడా అనుకూలంగా ఉంటాయని తెలిపారు. విత్తన కిట్ లు కావాలనుకునే ఆసక్తి గల రైతులు ఉద్యానవన శాఖ HEO సతీష్ (8106048139) ను సంప్రదించవచ్చన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితిపై మంత్రి జూపల్లి సమీక్ష
చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, తదనంతరం సెలవులు ప్రకటించడం, తదితర అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపస్‌లో ప్రస్తుత స్థితిగతులను, విద్యార్థుల ఆందోళనల వెనుక ఉన్న కారణాలను బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్ మంత్రికి వివరించారు. క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని వీసీ గోవర్ధన్ మంత్రికి తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు, సెలవుల ప్రకటనకు దారితీసిన పరిణామాలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. సమస్యలు ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. త్వరలోనే క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని వీసీని మంత్రి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ట్రిపుల్ ఐటీని సందర్శించి, విద్యార్థులతో చర్చిస్తానని తెలిపారు.
నిబంధనలను పట్టించుకోని బట్టీలను తక్షణమే సీజ్ చేయాలి
*జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు సామాజిక సేవకులు కర్నె బాబురావు వినతి
చిత్రం న్యూస్: అశ్వాపురం: మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల ఏర్పాటుతో సమీప గ్రామాల ప్రజలు వాయుకాలుష్యంతో నరకం చూస్తున్నారని, యదేచ్చగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై అధికారులు తక్షణ మే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ, సామాజిక సేవకులు కర్నె బాబురావు సోమవారం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో కు వేరువేరుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ, వాస్తవానికి ఇటుక బట్టి నిర్వహణకు భూగర్భగనులు, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయితీరాజ్,, అటవీ కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ, నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని, ముందుగా మైనింగ్ నుండి బ్రిక్లిన్ సర్టిఫికెట్, తీసుకొని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకుని నాలా వచ్చిన తర్వాత బట్టిలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటుకబట్టీల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా కొనసాగుతూ కలుషిత వాతావరణానికి కారణమవుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవటంలో అధికారులు తాత్సారమెందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని, బాబురావు ప్రశ్నించారు.ఇటుక బట్టీల నిర్వహణతో మొండికుంట, తుమ్మల చెరువు, సర్వాయిపాడు బంజర, గొల్లగూడెం, సీతారాంపురం గ్రామాల ప్రజలు వాతావరణ కాలుష్యం తో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా కనీస పట్టింపు లేదని వాపోయారు. ఇటుక బట్టీల యజమానుల నిర్వాకంతో వ్యవసాయ పంటలు కూడా ద్వంసమవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అటవీ భూముల్లో అక్రమంగా బట్టీలు నిర్వహిస్తున్నా,రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా బట్టీలు నడుపుతుండగా, ఈదురు గాలులకు బూడిద ఇళ్ళలోని నీటిపై పడుతుండగా, అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. దీనిపై అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశామని, స్పందన కరువు వవ్వటంతో ప్రజావాణిలో ఐటీడీఏ పీవో, కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.గ్రామాలలో రోజు రోజుకు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనల ప్రకారం పలుశాఖల నుండి తీసుకున్న అనుమతుల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అటు వైపు కన్నెత్తి చూసే తీరిక అధికారులకు లేకపోవడంతో బట్టీలయజమానులు ఆడిందే ఆటగా తయారైందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడికి పాల్పడినా,చిన్న పిల్లల చేత పని చేయిస్తూ బాల కార్మిక చట్టాలను తుంగలో తొక్కినా ఎవరూ పట్టించుకోకుండా, ఇక్కడ పనిచేసే కార్మి కులకు కనీస సౌకర్యాలు కలిపించకుం డా వలస కార్మికులతో పెట్టి చాకిరీ చేయిం చుకోవడంతో కార్మికులు దుర్భర జీవి తాలు గడుపుతున్నారన్నారు. పని చేసిన కడుపునిండా తిండి నింప కుండా పిల్లల్ని సైతం బాల కార్మికులుగా మారుస్తున్నారన్నారు. వారి బాల్యాన్ని ఇటుక బట్టీల్లో బందీ చేస్తూ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారని ద్వజ మెత్తారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్ష ణ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరె త్తినట్లుగా వ్యవహరిస్తూ ఇటుక బట్టీల వ్యాపారు లకు అండదండగా అంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే రహదారి పక్కనే ఇటుక బట్టీలు ఉండడంతో వాటికి వినియోగించే బూడిద,బొగ్గు,ఊక పదార్థాలను వినియో గించడంతో పూర్తిగా వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా ఇటుక బట్టీల కాల్చడం కోసం కలప అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతుందన్నారు. టన్నుల కొద్దీ కలపను ఇటుక బట్టీలకు తరలతున్న కనీసం ఫారెస్ట్ అధికారులకు పట్టింపేలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇటుక బట్టీల దందాపై కొరడా జూలిపించి అనధికార బట్టీలపై చర్యలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
రైతు భరోసా నిధుల విడుదల: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కంది శ్రీనివాస రెడ్డి క్షీరాభిషేకం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ఫ్లెక్సీలకు ఘనంగా క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో నగదు జమ అయిందని, దీనివల్ల రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం రైతు ఉత్సవాలకు దారితీసిందని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆత్మ చైర్మన్ సంతోష్ రావ్, లోక ప్రవీణ్ రెడ్డి, సాయిచంద్ గౌడ్, నరేష్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసి..మానవత్వం చాటుతూ
చిత్రం న్యూస్, బైంసా : ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరమైనప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిర్మల్ జిల్లా చాక్పెల్లి కి చెందిన ఎస్. కె. అస్లం. భైంసా జి డి ఆర్ హాస్పిటల్ లో భూమాబాయి అనే పేషెంట్ కు ఏ ప్లస్ రక్తం కావాలని అనగానే వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. రక్తదానం చేసిన ఆయనకు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అటవీశాఖ అధికారిని కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పలు ప్రజాసంబంధిత అంశాలపై చర్చించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అటవీ శాఖ పరిధిలోని వాగుల నుంచి తీసుకుపోవడానికి కొంత సడలింపు కల్పించాలని కోరారు. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అటవీ శాఖ సహకారం అవసరమని పేర్కొన్నారు.అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల సేకరణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గూడాలకు రహదారి సదుపాయాలు కల్పించేందుకు అటవీ శాఖ సహకారం అందించాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిర బాయి, సుజాయిత్ ఖాన్, కొట్నాక్ గణపతి, రాంచందర్, జగన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అప్పులబాధతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య
చిత్రం న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధుడు ఆత్మహత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆర్థిక కష్టాలు ఒక మనిషిని ఎంతటి దారుణ నిర్ణయానికైనా పురికొల్పుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఎర్రుపాలెం మండలంలో జరిగిన ఈ విషాద ఘటన చూసి స్థానికులు ఒళ్లు గగుర్పొడిచేలా భయాందోళనకు లోనయ్యారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన యన్నం వెంకట్రామిరెడ్డి (70) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడంతో మనస్తాపానికి గురైన ఆయన, తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సమీపంలోని ఒక బ్రిడ్జి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఉరివేసుకున్న సమయంలో తాడు బిగుసుకుపోయి, మృతదేహం బరువుకు తల మొండెం నుండి వేరైపోయింది.తల బ్రిడ్జికి వేలాడుతూ ఉండగా, మొండెం కింద పడిపోవడంతో అక్కడ అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ఉదయాన్నే అటుగా వెళ్లిన స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఎర్రుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహ భాగాలను సేకరించి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రాథమిక విచారణలో అప్పుల బాధే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని తేలింది.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వృద్ధాప్యంలో తోడుండాల్సిన సమయంలో ఆర్థిక కష్టాల వల్ల ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాంగ్రెస్‌లో సర్పంచుల చేరిక: కండువా కప్పి ఆహ్వానించిన కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో బూర్నూర్, లోహార, లింగుగూడ గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం గంగారాం, వసంత్ రావు, మానిక్ రావులకు కంది శ్రీనివాస రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ పంచాయతీల ప్రగతి కోసం సర్పంచులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. సర్పంచులందరూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా పల్లెలను అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం: ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్‌లో సోమవారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేదికలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ కూడా పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ:
ప్రజలు సమర్పించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. దీని ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సేవా దృక్పథంపై ప్రశంసలు:
మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష సతీష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, కంది శ్రీనివాస రెడ్డి గారు నిరంతరం ప్రజల పక్షాన నిలబడటం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి, సామాన్యుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.










