Home Blog Page 73

రైతు భరోసా నిధుల విడుదల: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

0

చిత్రం న్యూస్, నిర్మల్ :.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులను విడుదల చేశారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి దశరథ రాజేశ్వర్ అన్నారు. ఈ నిధుల విడుదలను పురస్కరించుకొని బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నిధులు విడుదల చేయడం జరిగిందని, ఈ మొత్తాన్ని విడతల వారీగా రైతు భరోసా పథకం ద్వారా అందజేస్తామని నాయకులు వెల్లడించారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులను వారు ప్రోత్సహించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రైతులకు మరింత మేలు చేకూరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు విలాసరావు, మార్కెట్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, నాయకులు సురేందర్, సత్యం, ఓలా త్రీ నారాయణరెడ్డి, నవీన్ రెడ్డి, వంగ భూమారెడ్డి, దాసరి రమేష్, మైలి రాజేశ్వర్, జాదవ్ ప్రకాష్, రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అగ్నివీర్ పథకంపై భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

0

చిత్రం న్యూస్, భైంసా: 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కళాశాలలో విద్యార్థుల్లో దేశ సేవ పట్ల చైతన్యం పెంపొందించుటకు సాయుధ దళాలలో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించుటకు అగ్నివీర్ పథకంపై భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ బుచ్చయ్య మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే దేశ సేవ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, అగ్నివీర్ వంటి పథకాలు యువతకు మంచి అవకాశాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమానికి హాజరైన IQAC కోఆర్డినేటర్ డా. రవి కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించవలసిన అవసరాన్ని వివరించారు. అగ్నివీర్ పథకం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

డా.ఎం.శంకర్ అగ్నివీర్ పథకంపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అర్హతలు, ఎంపిక విధానం, శారీరక, వైద్య ప్రమాణాలు, వ్రాత పరీక్ష సిలబస్ వంటి అంశాలను స్పష్టంగా వివరించి విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే ఈ పథకం ద్వారా లభించే శిక్షణ, ఆర్థిక ప్రయోజనాలు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై విద్యార్థులను ప్రేరేపించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.రఘునాథ్,  సీనియర్ అధ్యాపకులు డా. భీమా రావు , రాజు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శక సూచనలు అందించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన సందేహ నివృత్తి సమావేశంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ మరియు బాధ్యతాభావాన్ని పెంపొందించుటలో ఫలప్రదంగా నిలిచింది.

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్..రిఫండ్‌లో పెద్ద మార్పులు!

0

చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్:భారత రైల్వే ప్రయాణికులకు కీలక మార్పులు తీసుకొచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ విధానంలో సవరించిన కొత్త నిబంధనలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.,కొత్త విధానం ప్రకారం, ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే నిర్ణీత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 72 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే సుమారు 25 శాతం కోత విధించి మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు. 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే ఇది లేట్ క్యాన్సిలేషన్‌గా పరిగణించి 50 శాతం కోత విధిస్తారు. ట్రైన్ బయల్దేరే ముందు 8 గంటల లోపు లేదా బయల్దేరిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని అదనపు సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవకాశం కల్పించారు. అలాగే కౌంటర్ టికెట్లను ఇకపై ఏ రైల్వే స్టేషన్‌లోనైనా క్యాన్సిల్ చేసుకునే వీలుంది.

ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులకు TDR ప్రక్రియను కూడా సులభతరం చేశారు. ఇకపై మాన్యువల్‌గా TDR ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా, నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్ ప్రాసెస్ అవుతుంది. అదనంగా, కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ ట్రావెల్ క్లాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.240 + GST, ఏసీ 2 టైర్‌కు రూ.200 + GST, ఏసీ 3 టైర్ లేదా ఛైర్ కార్‌కు రూ.180 + GST, స్లీపర్‌కు రూ.120, సెకండ్ క్లాస్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు.మొత్తంగా ఈ కొత్త మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా రూపొందించబడ్డాయి. నిబంధనలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు తాజా సమాచారం పరిశీలించాలని రైల్వే శాఖ పేర్కొంటుంది.

బాసర RGUKT నూతన డీఎస్పీగా  పి.సాయి కిరణ్

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో డీఎస్పీగా పి.సాయి కిరణ్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించడం, అలాగే యూనివర్సిటీతో సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు,  సిబ్బంది పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

నిజాయతీ చాటిన బాసర ఆలయ సిబ్బంది 

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్ ను బాసర ఆలయ సిబ్బంది  అప్పజెప్పి తమ నిజాయతీ చాటారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంభీరావుపేటకు చెందిన వనజ అనే భక్తురాలు ఆలయ ప్రాంగణంలో ఫోన్ ను మర్చిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్లు శ్రీనివాస్, శోభారాణి గమనించి ఆలయ ఇన్స్పెక్టర్ సాయిలు కు అప్పజెప్పారు. వివరాల ఆధారంగా భక్తురాలిని పిలిపించి ఫోన్ ను అప్పజెప్పి  ఆలయ సిబ్బంది తమ నిజాయతీని  చాటారు. ఈ సందర్భంగా హోంగార్డులను పలువురు అభినందించారు.

తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు: పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత

0

చిత్రం న్యూస్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (TPDA) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.

అసలు ఏం జరిగింది..?గత కొద్ది రోజులుగా ఇంధన కొరత ఏర్పడనుందనే తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఈ ‘పానిక్ బయింగ్’ (ఆందోళనతో కొనుగోలు చేయడం) వల్ల సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు ఎక్కువగా అమ్మకాలు పెరిగాయి. దీని ఫలితంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయి బోర్డులు వెలిశాయి తప్ప, సరఫరాలో ఎలాంటి లోపం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి తెలిపారు.

కీలక అంశాలు:స్టాక్ అందుబాటులో ఉంది: HPCL, IOCL, BPCL వంటి ప్రధాన చమురు కంపెనీల వద్ద తగినంత స్టాక్ ఉంది.

సరఫరా సాధారణం: సరఫరా గొలుసు (Supply Chain) ఎక్కడా ఆగలేదు, ఇంధనం సక్రమంగా అందుతోంది.భద్రతా హెచ్చరిక: డబ్బాలు లేదా ఇతర అనధికారిక కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం ప్రమాదకరం. ఇది PESO (Petroleum and Explosives Safety Organization) నిబంధనలకు విరుద్ధం, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది.

ప్రజలకు సూచనలు: తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు.అవసరానికి మించి ఇంధనాన్ని నింపి ఆందోళన సృష్టించవద్దు. అనధికారిక డబ్బాలలో ఇంధనాన్ని నిల్వ చేయవద్దు.ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సంయమనం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 

0

చిత్రం న్యూస్, బేల:ఎన్‌జీసీ (NGC) కార్యక్రమంలో భాగంగా బుధవారం సిర్సన్న ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు రకాల పోషకాహార వంటకాలను ఇందులో ప్రదర్శించారు.మిల్లెట్స్, పప్పులు, కూరగాయలతో తయారుచేసిన ఆహార పదార్థాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా పేపర్లు,వస్త్రాలతో తయారుచేసిన బ్యాగ్ లను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్, మండల విద్యాధికారి మహాలక్ష్మి హాజరై మాట్లాడారు..విద్యార్థులకు సమతుల ఆహారం ప్రాముఖ్యత గురించి వివరించారు.పోషకాహారం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎలా లభిస్తాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో మంచి ఆహార అలవాట్లు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్యాతం పొచ్చక్కసురేష్ రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులు మమత,అన్విత, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు

అవాల్‌పూర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

0

చిత్రం న్యూస్, బేల: గ్రామస్తుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, బుదవారం అవాల్‌పూర్‌ గ్రామంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈరగోళ్ల అనిల్, ఉప సర్పంచ్ దినేష్ పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఇంటింటికీ రక్షిత మంచినీరు అందుతుందని సర్పంచ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మిస్తుండటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అర్లి రైతు గణపతి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి గ్రామ రైతు గణపతి కుటుంబాన్ని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పరామర్శించారు. బాధిత రైతు నివాసానికి వెళ్లిన ఆమె, కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా అండగా నిలవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశారెడ్డి, మాజీ ఎంపీటీసీ పోచన్న, వార్డు సభ్యులు విట్టల్, శివయ్య, సతీష్ రెడ్డి, శివకిరణ్ స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

0

చిత్రం న్యూస్,న్యూ దిల్లీ: దేశంలో రిజర్వేషన్ల అమలుపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను వీడి ఇతర మతాల్లోకి (ప్రధానంగా క్రైస్తవ, ఇస్లాం) మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల (SC) హోదా వర్తించదని, తద్వారా వారు రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తీర్పులోని ప్రధానాంశాలు:

రాజ్యాంగ ఉత్తర్వు 1950: రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది.

తక్షణమే రద్దు: ఒక వ్యక్తి మతం మారిన క్షణం నుండే వారి ఎస్సీ హోదా రద్దవుతుంది. పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ, మతం మారిన తర్వాత ఆ కుల ధ్రువీకరణ పత్రంతో రిజర్వేషన్లు పొందడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్: మతం మారిన వారు (ఉదాహరణకు పాస్టర్లుగా మారిన వారు) తమపై దాడులు జరిగినప్పుడు ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందలేరని కోర్టు తేల్చి చెప్పింది.

రాజ్యాంగాన్ని మోసగించడమే: కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం మతం మారడం లేదా మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్లు అనుభవించడం “రాజ్యాంగాన్ని మోసగించడమే” (Fraud on the Constitution) అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేసు నేపథ్యం: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పాస్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. సదరు వ్యక్తి దశాబ్ద కాలంగా క్రైస్తవ మత ప్రచారకుడిగా (పాస్టర్) ఉన్నప్పటికీ, తనపై జరిగిన దాడి విషయంలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ కోరారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేనందున మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా కొనసాగదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

సామాజిక ప్రభావం:ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడిలు చేసుకున్న లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మతం మారినప్పటికీ ఎస్సీ సర్టిఫికేట్లతో ప్రయోజనాలు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిజమైన అర్హులైన దళితులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.