చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బృందం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ముందుగా ఆలయ ఈవో విజయ రామారావు, ఆలయ అర్చకులు దేవదాయ శాఖ బృందానికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలను సందర్శించారు. వచ్చేనెల 6న సీఎం రేవంత్ రెడ్డి బాసరకి పర్యటన వస్తున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు అమ్మవారిని దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. పునర్నిర్మాణ పురోగతిని అధికారులు తహసిల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, తదితరులతో కలిసి పరిశీలించారు. బాసర సిఐ కిరణ్ ఉన్నారు.
ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలో ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఇచ్చోడ మండల పరిధిలోని బృందావన్ కాలనీ ప్రాంతంలో ఎంప్లాయిస్ కాలనీ కి చెందిన గొలుసుల విజయ్ అను వ్యక్తి ఇచ్చోడలోని తన స్నేహితులు దండుగుల మురళి, జాదవ్ రాము, కాంబ్లే ఆకాష్, సిడాం రవి, కాంబ్లే రాజ్‌కుమార్, కాంబ్లే అరుణ్, దాసన్న దేవాల, కాంబ్లే శశి కుమార్, సీపెల్లి శ్రీనివాస్ అను వ్యక్తులు చిట్టీల రూపంలో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, ఇచ్చోడ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్న విజయ్ అతనితో పాటు బెట్టింగ్ లో పాల్గొంటున్న వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించామన్నారు.3 మోటార్ సైకిళ్లు, 9 మొబైల్ ఫోన్లు, రూ.4470 నగదు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి వ్యక్తులను రిమాండ్ కు తరలించామని ఆయన పేర్కొన్నారు. దేశంలో IPL(cricket) నడుస్తుందటంతో అమాయకపు ప్రజలను మోసం చేసి ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చిట్టీల రూపంలో గాని, ఆన్లైన్ లో గాని, బెట్టింగ్ యాప్స్ రూపంలో గానీ మరి ఏవైనా ఇతర విధంగా బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజు హెచ్చరించారు.

ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో చెట్ల ఫలసాయపు హక్కుల కోసం వేలం నిర్వహణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయ పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో మంగళ వారం ఉదయం 11:00 గంటలకు మామిడి (208 చెట్లు), నిమ్మ (30 చెట్లు) ఫలసాయపు హక్కుల కోసం కౌలు వేలం (ఓపెన్ ఆక్షన్) నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె. ప్రభావతి తెలిపారు. వేలంలో అత్యధిక ధర పలికిన వారికి మాత్రమే ఫలసాయపు హక్కులు షరతులకు లోబడి ఇవ్వనున్నామన్నారు. ఔత్సాహికులు వేలంలో (ఓపెన్ ఆక్షన్) పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
రేణుకాపూర్ దక్షిణాముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళం అందజేత
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని రేణుకపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన బాపూజీ జ్ఞానిపటేల్ తనయుడు పుట్టినరోజు సందర్భంగా రూ.లక్ష చెక్కును గురుస్వామి శ్రీనివాస్ కు అందజేశారు. ముందుగా హనుమాన్ స్వామి సన్నిధిలో జ్ఞాని పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. వీరికి గురుస్వామి ఆంజనేయస్వామి హారతి అందజేసి ఆయనకు శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఇలాంటి మన పురాతన హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జ్ఞాని పటేల్ ను ఆంజనేయ స్వాములు అభినందించారు. ఇటీవలే రేణుకాపూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం భక్తులు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రారంభం
చిత్రం న్యూస్, జైనథ్: విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యలను పెంపొందించుకోవలని జైనథ్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాము సూచించారు. కళాశాలలో వృత్తి విద్య సమ్మర్ ఇంటర్నషిప్ -2026 ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ..పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని వృత్తి విద్య అధ్యాపకుడు సయ్యద్ సబ్దార్ అజీజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీయన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ యజమాని మహేష్, ఫ్యాకల్టీ వినోద్ పారిక్, పాల్గొన్నారు.
గంగబీ-దస్తగిరి దంపతులకు సారె అందజేసిన డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్ రావు
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో లబ్ధిదారురాలు గంగబీ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో ఆదివారం డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్ రావు, రాష్ట్ర యూత్ కార్యదర్శి రంగినేని శాంతన్ రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారు గంగబీ-దస్తగిరి దంపతులకు సారె అందజేశారు. వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం భోరజ్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాయకులు మామిడి మల్లారెడ్డి, భూమారెడ్డి, నిమ్మల ప్రభాకర్, భూతం ఆశారెడ్డి, పొట్ట అశోక్, ప్రకాష్ రెడ్డి, అమర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి జీవనోపాధి కోసం రూ.50వేల ఆర్ధిక సాయం
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా పిప్పర్వాడ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం రైతు ఆత్మహత్య చేసుకున్న నలగంటి దేవన్న కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ద్వారా రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జీవనోపాధి కోసం అందజేసిన నగదు తో కొనుగోలు చేసిన అయిదు మేకలను నలగంటి సుజాతకు అందజేశారు. ఈ నగదు అందడానికి రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు సంగెపు బొర్రన్న, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ ఆవుల రాకేష్, గ్రామ సర్పంచ్ నోముల సంతోష్ రెడ్డిలు కృషి చేయడంతో ఈ సందర్భంగా బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.
14 ఏళ్ల రికార్డుకు బ్రేక్: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
చిత్రం న్యూస్, ముంబై: ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. గత 14 ఏళ్లుగా (2012 నుండి) తమ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్నాన్న రికార్డును (Jinx) చెరిపివేస్తూ, కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజింక్య రహానే (67), అంగ్క్రిష్ రఘువంశీ (51) అర్ధసెంచరీలతో రాణించారు. 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ర్యాన్ రికెల్టన్ (81), రోహిత్ శర్మ (78) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మూడు కీలక వికెట్లు పడగొట్టిన శార్దుల్ ఠాకూర్ ఈ అవార్డును దక్కించుకున్నారు.
వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై బ్యాటర్లు ఆరంభం నుండే ఎదురుదాడి చేయడంతో కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశారు. చివరి ఓవర్లో నమన్ ధీర్ ఫోర్ కొట్టి ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఐపీఎల్ 2026: నేడు రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్..గుహవాటి హై-వోల్టేజ్ పోరు!
చిత్రం న్యూస్, గుహవాటి: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందనుంది. రాత్రి 7:30 గంటలకు గుహవాటి వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లో మాజీ ఛాంఫియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. మెగా ఆక్షన్, భారీ ట్రేడ్ డీల్స్ తర్వాత ఇరు జట్లు సరికొత్తగా మైదానంలోకి దిగుతున్నాయి.
సంజూ శాంసన్ వర్సెస్ రాయల్స్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా సంజూ శాంసన్ ఈసారి CSK తరఫున బరిలోకి దిగుతున్నాడు. తన పాత జట్టు రాజస్థాన్‌పై సంజూ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
RR గూటికి జడేజా: సంజూ శాంసన్ కోసం చెన్నై జట్టు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చింది. దీంతో జడేజా ఇప్పుడు రాయల్స్ జెర్సీలో కనిపించనున్నాడు.
CSKకు గాయాల బెడద: స్టార్ ప్లేయర్ డెవాల్డ్ బ్రీవిస్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించారు. అలాగే, ఎంఎస్ ధోనీ గాయం కారణంగా నేటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం.
యువ సంచలనం సవాల్: రాజస్థాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈసారి చెన్నైని మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేయడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.
జట్ల అంచనా (Probable XI):
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రచిన్ రవీంద్ర, ఇతర కీలక ఆటగాళ్లు.
రాజస్థాన్ రాయల్స్: రవీంద్ర జడేజా, సామ్ కరన్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ఇతర ప్రధాన ఆటగాళ్లు.
గత సీజన్‌లో పట్టికలో వెనుకబడిన ఈ రెండు జట్లు, ఈసారి గెలుపుతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాయి.
లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు
చిత్రం న్యూస్, లక్షెట్టిపేట: క్రైస్తవుల పవిత్ర పండుగలలో ముఖ్యమైన మట్టల ఆదివారం (Palm Sunday) వేడుకలు లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతాలలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాంతంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించగా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మట్టల ఆదివారం సందర్భంగా యేసు క్రీస్తు యెరూషలేములో విజయప్రవేశం చేసిన దినాన్ని స్మరించుకుంటూ విశ్వాసులు చేతుల్లో ఈత కొమ్మలు (మట్టలు) పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు. చర్చిల వద్ద ప్రార్థనలు అనంతరం భక్తులు “హొసన్నా” అంటూ కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేశారు.
చర్చిలలో ప్రత్యేక బైబిల్ సందేశాలు అందించబడగా, పాస్టర్లు విశ్వాసులకు పవిత్ర వారానికి (Holy Week) సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. మట్టల ఆదివారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర వారం యేసు క్రీస్తు శిలువ వేయబడిన శుక్రవారం, పునరుత్థానం జరిగిన ఈస్టర్ పండుగకు దారితీస్తుందని తెలిపారు.
ఈ వేడుకల్లో యువత, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. చర్చిలను తాటి ఆకులతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్థానిక క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి, ప్రేమ, సేవా భావాలను పాటించాలని పిలుపునిస్తూ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.










