Home Blog Page 58

ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి: విద్యుత్ వాహనాలు, సోలార్ పంపుల కోసం దరఖాస్తుల స్వీకరణ

0

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై విద్యుత్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపులు, కంట్రోల్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాకు 253 యూనిట్లు కేటాయించగా, మొత్తం రూ.348.46 కోట్లు మంజూరు చేశారు.ఈ పథకం కింద యువతకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ పరికరాల యూనిట్లు అందించనున్నారు. ద్విచక్ర వాహనాలకు 90% సబ్సిడీ, మూడు చక్రాల వాహనాలకు 70% సబ్సిడీ, సోలార్ యూనిట్లకు 60% సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా వాహనాలకు), రెండెకరాల భూమి, పట్టాదారు పాస్ బుక్ (సోలార్ పంప్ సెట్లకు) వంటి పత్రాలతో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల గడువును ఏప్రిల్ 08 వరకు పొడిగించారు.పథకాలకు దరఖాస్తు చేసుకునేవారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందినవారు, దళితబంధు లబ్ధిదారులు అనర్హులు. మహిళలకు 33%, దివ్యాంగులకు 5% కోటా కేటాయించారు.

ఉమ్మడి జైనథ్ మండల అంగన్‌వాడీ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఉమ్మడి జైనథ్ మండలంలోని వివిధ గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు సోమవారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. నిరాల గ్రామంలోని స్థానిక త్రినేత్ర గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీచర్లందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సమ్మేళనంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు ఒకరికొకరు గాజులు తొడిగి, చేతులకు మెహందీ పెట్టుకుంటూ సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీడీపీఓ (CDPO) సురేఖ హాజరుకాగా, నిరాల గ్రామ సర్పంచ్ చౌదరి సునంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి, టీచర్లందరూ ఇలా కలిసి సమయాన్ని గడపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నరసమ్మ, సునంద, భూమబాయి, భారతీ, సుజాత, రేవతి, నాగుబాయి, పద్మ, జయమల , వసంత, స్వప్న, పొచ్చక్క, మనిమల, ప్రవీణ, దేవత, సింధు, రజిత, మమత తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డికి నేతల విన్నపం

0

చిత్రం న్యూస్,బజార్‌హత్నూర్ : ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని కోరుతూ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు వీరు హాజరయ్యారు. సభ అనంతరం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు, పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను ఆయనకు అందజేశారు. ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలు మార్చడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల అవశ్యకతను ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నేతల విన్నపంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో సుమారు 500కు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం అం దజేయాలని డిమాండ్ చేశారు. రైతన్న ఆరుగాలం పండించిన పంట అకాల వర్షంతో నేలవాలిందని.. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులకు వర్తింపజేయాలని రాష్ట్రప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇప్పటికి కూడా నష్టపోయిన పంటలను పరిశీలించకపోవడం సిగ్గుచేటన్నారు.

ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలను ఆదుకోవాల్సిన వారు హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్పల్లి మండలం రామడుగు, ఇతర గ్రామాల్లో కూడా అధికంగా వరి పంటకు నష్టం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, యానంపల్లి సర్పంచ్ భాస్కర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చౌకి లక్ష్మణ్ రమణ. రవినాయక్, పరుశురాం, సుద్దపల్లి సాంపల్లి, సుద్దపల్లి తండా, సాంపల్లి తండా వాసులు పాల్గొన్నారు.

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే!

0

కార్యకర్తల త్యాగాల పునాదులపైనే బీజేపీ నిర్మాణం 

ఇందూర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి‌

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారిపార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..బీజేపీ కేవలం నాయకుల పార్టీ కాదు, అంకితభావం కలిగిన కార్యకర్తల పార్టీ. సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తల కఠోర శ్రమ వల్లే ఈరోజు బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు.

కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ మనదే. ‘ముందు దేశం, తర్వాత పార్టీ, చివరికి నేను’అన్న నినాదంతో బీజేపీ కార్యకర్తలు జాతి నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు.

డాక్టర్. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వేసిన బలమైన పునాదులపై, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ‘ఏకాత్మ మానవతావాదం’, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలనే ‘అంత్యోదయ’ సిద్ధాంతాల ఆధారంగా పార్టీ నిర్మితమైంది. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ లాంటి అగ్ర నేతల మార్గదర్శనంలో ఎదిగి.. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భరతమాతను ‘విశ్వ గురువు’గా నిలిపే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

ఇందూర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రాణత్యాగం చేసిన అమరులను, నక్సలైట్ల అమానుష దాడుల్లో బలైన వీర కార్యకర్తలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. వారి త్యాగాలు పార్టీకి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం, అధికారంలోకి రావడం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్రవంతి రెడ్డి, పొతన్ కార్ లక్ష్మీనారాయణ, గద్దె భూమన్న, నగ్గోల్ల లక్ష్మి నారాయణ. న్యాలం రాజు. బద్దం కిషన్. పుట్ట వీరేందర్. జ్యోతి, కార్పోరేటర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మామ, బావమరిది హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: కూలీ డబ్బుల పంపకంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటనలో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్పో పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ జంట హత్యల కేసులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి ఈ తీర్పును వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం..2021 ఆగస్టు 14న డిచ్పల్లి మండల కేంద్రంలో ఒక పని నిమిత్తం మామ, అల్లుడు, బావమరిది కలిసి వెళ్లారు. సాయంత్రం పని ముగిశాక అడ్డమీద కూలీ డబ్బులు పంచుకునే క్రమంలో వారి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు అక్కడే ఉన్న కత్తికి పదును పెట్టే ఆకురాయి, చాకుతో మామ, బావమరిదిపై విచక్షణారహితంగా దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నాడు.అప్పట్లో సీఐ రఘునాథ్ ఈ కేసు విచారణను ప్రారంభించగా.. ప్రస్తుత సీఐ వినోద్ రెడ్డి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. పక్కా ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసి, విచారణను వేగవంతం చేశారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారనీ అన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారన్నారు. నేరస్తులకు శిక్ష పడటం ద్వారా సమాజంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఈ కేసులో ప్రతిభకనబరిచిన అధికారులను  సీ పీ సాయి చైతన్య అన్నారు. కేసులో కీలకపాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్, డిచ్పల్లి సీఐ వినోద్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ (ఎస్సై) గోవింద్, హెడ్ కానిస్టేబుల్ కిషన్ లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు, 40మందికి జరిమానా 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మందిలో ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 40 మందికి కోర్టులో న్యాయమూర్తి  భారీగా జరిమానా విధించినట్లు  ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సోమవారం తెలిపారు.  అంతకుముందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్  నిర్వహించారు.

అనుమతి లేకుండా మొరం తరలిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠిL

0

మూడు టిప్పర్లు, రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్ సీజ్ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు, రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారని గుర్తించి, స్థానిక తహసీల్దార్ సంతోష్ రెడ్డికి సమాచారం అందించగా, ఆర్.ఐ దివ్య అక్కడికి చేరుకుని పంచనామ నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసి నందిపేట్ ఎస్ హెచ్ ఓ శ్యాంరాజ్ కు అప్పగించడం జరిగిందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

ఆరోగ్య వారంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆరోగ్య వారాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ దిలీప్ అధ్యక్షతన వారి చాంబర్లో నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్: బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారంలో అన్ని ఆరోగ్య దినోత్సవాలను జిల్లా అధికారుల సమన్వయoతో విజయవంతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా డా.రాజశ్రీ మాట్లాడుతూ. ఏప్రిల్  6న  సోమవారం మొదటి రోజు ఫుడ్ సేఫ్టీ డే నీ నిర్వహించడం జరిగిందన్నారు. ఆహార భద్రతపై అవగాహన, ర్యాలీ  చేపట్టామన్నారు. ఉద్యోగులకు జీవన శైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ రోజు 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద అవగాహన ర్యాలీ, అవగాహన సదస్సు,.  8న సేఫ్ మదర్రో రోజును నిర్వహించడం జరుగుతుందని ఆరోజు జిల్లా స్థాయి లో గర్భిణీ స్త్రీలు బాలింతలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు మాతా శిశు మరణాలను తగ్గించడంపై అవగాహన కలిగించడం జరుగుతుంది అన్నారు. న 9న హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ,  నిర్ధారణ పరీక్షలను కేంద్రకారాగారంలోని ఖైదీలకు, ట్రాన్స్ జెండర్ లకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 10న హోమియోపతి, ఆయుర్వేద దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆరోజు కోటగల్లి పద్మశాలి సంఘంలో యోగ పై అవగాహన, హోమియోపతి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెన్తెనింగ్ రోజుగా నిర్వహించడం జరుగుతుందని డ్రగ్స్ క్వాలిటీ ,అవైలబిలిటీ, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఆఫ్ మెడిసిన్స్ పై అవగాహన ఉంటుందని అన్నారు.

ఆదిలాబాద్‌లో ఇంటింటికి సీపీఐ 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డులో సోమవారం ‘ఇంటింటికి సీపీఐ ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరిస్తూనే, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, “ప్రజల కోసం మీరు చేసే పోరాటాలకు ఎన్ని విరాళాలు ఇచ్చినా తక్కువే” అంటూ మద్దతు తెలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్.అరుణ్ కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామదాస్, గిరిజన సంఘం నాయకులు కొడప సురేష్, శాంతన్ కుమార్, సోను బాయ్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.