చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల సమీక్ష, దర్యాప్తు వేగవంతం, సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, వారెంట్ల అమలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. దర్యాప్తులో జాప్యంపై ఆరా తీసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి న్యాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సీపీ సూచించారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటిని విస్తరించాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై సత్వర స్పందన ఇవ్వాలని ఆదేశించారు.గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో (ముధోల్ ) :మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ముథోల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి తానూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా, సదరు లారీలో ఎటువంటి రవాణా అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత, పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన తదుపరి విచారణ చర్యల కోసం వాహనాన్ని తహసీల్దార్ కు అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై జుబేర్ మాట్లాడుతూ, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం ఛారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇసుక ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లాలో గాంజా, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టిన గాంజా గస్తీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల యువతకు కీలక సూచనలు చేశారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న గాంజా గస్తీ కార్యక్రమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు ఆరోగ్యంపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఎస్పీ తెలిపారు. యువత గాంజా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండటమే కాకుండా అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాలని ఆమె కోరారు. గాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురికి జైలు శిక్ష
* వివరాలు వెల్లడిస్తున్న బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది.పెగడపల్లి గ్రామానికి చెందిన వై. వెంకట రమణకు రూ. 10 వేల జరిమానాతో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష, పట్టణంలోని రాకసి పేట్ కు చెందిన బాలచందర్ కురూ.10 వేల జరిమానాతో పాటు రెండు రోజుల శిక్ష,అబ్దుల్ గఫార్ కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పు ఇచ్చారని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ..మద్యం తాగి వాహనాలను నడపరాదని పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు.మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికావద్దని, తాగి వాహనాలను నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి
* పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : వ్యక్తుల కోసం కాకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇందూరు అర్బన్ ప్రశిక్షణా తరగతులు మంగళవారం విజయలక్ష్మి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కండువా వేసుకోవాలంటే అదృష్టం ఉండాలని, ఈ అదృష్టం మనందరికీ కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. జాతీయ వాదం హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానంగా ఆత్మనిర్బర్ భారత్ ను ప్రారంభించి” వోకల్ ఫర్ లోకల్ ” అనే నినాదంతో దేశాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా.. సాంకేతికంగా.. ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా మార్చేందుకు తీసుకున్న ముఖ్య కార్యక్రమం అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను పెంచుకోవడం స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేయడం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అన్నారు. ఆత్మనిర్బార్ భారత్ ద్వారా దేశ ఆర్థికంగా బలపడుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ప్రపంచంలో భారత దేశ స్థానం మరింత మెరుగవుతుందని వివరించారు.
2014 ముందు కేవలం 16 ఐఐటీలు ఉంటే ప్రస్తుతం 23 కు పెరిగాయని అలాగే 7 ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉంటే ప్రస్తుతం 25 కు పెరిగాయని గుర్తు చేశారు. 60 ఏళ్లలో చేసిన అభివృద్ధికి రెట్టింపుగా ప్రధాని మోదీ ఈ 12 సంవత్సరాలలో చేశారన్నారు. “మేక్ ఇన్ ఇండియా” దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేసినా ఎప్పటికప్పుడు ప్రశిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. శిక్షణలో వివరించే అనేక అంశాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఉంటాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా అంశాలపై నిష్ణాతులు, రాష్ట్ర స్థాయి శిక్షణ పొందిన వారు విపులంగా తరగతులు చెప్పడం జరుగుతుందన్నారు. కావున ప్రతి కార్యకర్త ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, అర్బన్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
వెంకూరులో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : కుంటాల మండలం, వెంకూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన భవనం గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.భవన ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ సవిత బాజీరావు, ఉప సర్పంచ్ అశోక్ అధ్యక్షత వహించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి.వి. రమణారావు, దిగంబర్ పాటిల్, అప్క గజ్జారాం, జక్కుల గజేందర్, వెంగళరావు, మగ్గిడి దిగంబర్, గంగాధర్, ఎస్. సాయినాథ్, పి. సాయినాథ్ వంటి స్థానిక నాయకులు, అలాగే తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ పాల్గొన్నారు.
మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
చిత్రం న్యూస్, మిర్యాలగూడ: మిర్యాలగూడ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు పలువురు న్యాయవాదులు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది గౌరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పదవికి జంగిలి ఎల్లయ్య, కోశాధికారి పదవికి రెడ్డిపల్లి సైదులు, క్రిడల కార్యదర్శి పదవికి భూక్యా రమేష్, గ్రంధాలయ కార్యదర్శి పదవికి రాయరపు భాస్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. కార్యవర్గ సభ్యుల పదవులకు పెండ్యాల నర్సింహారావు, సకినాల వేలాద్రి, బంటు మహేష్ లు నామినేషన్లు సమర్పించారు.నామినేషన్ల దాఖలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అనంతరం, 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరుగుతాయి. ఈ ప్రక్రియల అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలలో సుమారు 167 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మౌనపోరాటానికి దిగిన యువతి
చిత్రం న్యూస్, మహబూబాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో చోటుచేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రఘురాం పెళ్లికి నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె తెలిపింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రఘురాం ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది.విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్పందనను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది.
భైంసాలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించునున్న జిల్లా ఎస్పీ
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం భైంసా పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. జిల్లా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు, పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు, లేదా ఇతర ఏవైనా పోలీసు సంబంధిత విషయాలను ఈ సమయంలో ఎస్పీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించబడిందన్నారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీకి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.










