చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం భైంసా పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. జిల్లా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు, పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు, లేదా ఇతర ఏవైనా పోలీసు సంబంధిత విషయాలను ఈ సమయంలో ఎస్పీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించబడిందన్నారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీకి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
నష్ట పోయిన రైతులకు తక్షణమే పరిహారం అందజేయాలి,: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి డిమాండ్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల లో ఇటీవల కురిసిన అధిక వడగళ్ల వాన కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే అప్పుల బారిన పడిన రైతులు ఈ అనుకోని ప్రకృతి విపత్తు తో మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో, నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ మంగళవారం నిజామాబాద్ లో జిల్లా కలెక్టర్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి(ఎంపిఆర్)మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, పంట నష్టం జరిగిన రైతులకు సరైన పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, సరిన్, ఇంద్రకరణ్,జిల్లా ఉపా అధ్యక్షులు కందగట్ల రాంచందర్, సీనియర్నా నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు బీజేపీ ఎడపల్లి మండల శాఖ అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు గ్రామానికి చెందిన సంఘం సాయమ్మ, సంఘం లాస్య లు గత కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని కలిసి దరఖాస్తు చేసుకున్నారని అయన తెలిపారు. ఈమేరకు ఎంపీ అరవింద్ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని అన్నారు. మంగళవారం ధర్మారం గ్రామంలో బాధితులు సంఘం సాయమ్మకు రూ.49,500,సంఘం లాస్యకు రూ.15 వేలు చెక్కులను పార్టీ మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, ధర్మారం గ్రామ బీజేపీ నాయకులు కోటేష్ ల చేతుల మీదుగా పంపిణి చేశారు. సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఎంపీ అరవింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లకు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామంలోని సాక్రేడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ కు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని, అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
థియేటర్‌లో “దూరంధర్ – 2” వీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు
చిత్రం న్యూస్, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సినీ కేంద్రమైన ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్లో ‘దూరంధర్ – 2’ చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి వీక్షించారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ గారితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.దేశభక్తిని ఎంతో దృఢ విశ్వాసంతో ప్రదర్శించరాని, సినిమా అంతటా ఎన్నో ప్రశంసనీయమైన సన్నివేశాలు, నిజంగా ఎంతో ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయిన్నారు. ప్రస్తుత పరిణామాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీత రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్, రాష్ట్ర కోశాధికారి వాసుదేవ రావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, BJYM రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు తాడూరి శ్రీనివాస్, రాహుల్, శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..పోలీస్ సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డాక్టర్ ల సూచనలు పాటించాలాన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యనికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని, జీర్ణం కాని ఆహారము తీసుకొని బాధపడకూడదని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని, డాక్టర్ల సూచనలు, సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేకం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి రమేష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురంధాల, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డా. వి.అశోక్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ. రవీందర్ రెడ్డి, ఐఎమ్ఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ , మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్.నరసింహ కట్ట,( నరాలు, బ్రెయిన్ స్పెషలిస్ట్) తదితరులు పాల్గొన్నారు.
డీసీఓ నర్సయ్య కుటుంబానికి అధికారుల ఆర్థిక సాయం
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ (డీసీఓ) అధికారి నర్సయ్య కుటుంబానికి మంగళవారం జిల్లా అధికారులు ఆర్థిక సహాయం అందించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా చెక్కులు, నగదు అందజేశారు. జిల్లా అధికారుల సంఘం తరపున అందించిన ఆర్థిక సహాయాన్ని నర్సయ్య కుటుంబ సభ్యులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీపీవో జీవరత్నం, డీఆర్డీవో జయలక్ష్మి, ఎస్టీఓ సరోజ, డీపీఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పలు సంక్షేమ శాఖల అధికారులు, డీసీఎస్ఓ రాజేందర్, డీఎం ఇండస్ట్రీస్ నరసింహా రెడ్డి తదితరులు ఆర్థిక సహాయం అందించడంలో పాలుపంచుకున్నారు.
రాజురా వీడీసీ నూతన కమిటీ ఎన్నిక
- చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సుందరగిరి ముత్తా గౌడ్, ఉపాధ్యక్షుడిగా నర్సింగ్ రావు ఎన్నికయ్యారు. కోశాధికారిగా జిలకర సాయి ప్రసాద్, జాయింట్ కోశాధికారిగా తమ్మరాశి గంగాధర్, రైటర్‌గా టీకే శ్రీనివాస్ ఎంపికయ్యారు. వీరు కమిటీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించనున్నారు. నల్లల రాజు చైర్మన్‌గా వైస్ చైర్మన్‌గా ముజాహిద్ ఎన్నికయ్యారు.గ్రామస్తులు, ప్రముఖులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
సాయిరాం మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : కుటుంబ సభ్యుల ధర్నా
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో (మామడ): మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిరాం చనిపోలేదని వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా చేశారు ఈ ఘటన స్థలాన్ని సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ పోలీసు సిబ్బందితో చేరుకొని బాధితులతో మాట్లాడి అతని మృతికి కారకులైన వారిని పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు
సురెల్లి గ్రామంలో మొక్క జొన్న పంట దగ్ధం
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం సురేల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం పండించిన రైతు పంట నేల పాలయింది. సురెల్లి గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తన పంట దగ్ధం కావడంతో కంటతడి పెట్టారు. మొక్క జొన్న పంట షార్ట్ సర్క్యూట్ కారణమా. లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టరా అని కోణంలో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఒక ఎకరం పంట విలువ రూ.80 వేల నష్టం కలిగిందని రైతు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.










