చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం పూట చికెన్ భోజనము ఏర్పాటు చేశారు. అనంతరం స్వీట్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రెటరీ శ్రీ దుర్గే భగవాన్ దాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ప్రేమ్ రాజు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి స్వామి, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
బేల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్ ఓ ప్లాంటును ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం, న్యూస్ బేల: బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంటుని జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణకుమార్ ఆరోగ్య పాఠశాల, పాఠశాల యొక్క ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ కు వివరించారు. పాఠశాలలో దాతలు అందించిన రూ.3 లక్షలతో విద్యార్థుల కోసం మంచి నీటి పథకంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పారు.మండలానికి చెందిన పలువురు దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాలను ముందుగా జిల్లాలో 130 పాఠశాలలతో ప్రారంభించి ఇప్పుడు 250 పాఠశాలలో ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య అలవాట్లు మార్చడం కోసమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలో బేల మండల ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, మండల తహసీల్డార్ రఘునాథ్ రావు, ఎంపీడీవో అంజనేయులు, మండల విద్యాధికారి మహాలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గృహజ్యోతి పథకం: జీరో బిల్లు రాని వారికి ప్రభుత్వం కొత్త ఆప్షన్
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో భాగంగా అర్హులైనప్పటికీ జీరో (0) బిల్లు రాని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద జీరో (0) కరెంట్ బిల్లు రాని వారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. జీరో బిల్లు రాని అర్హులైన వినియోగదారులు తమ మండలంలోని MPDO కార్యాలయం వద్దకు లేదా మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ నివాసితులై ఉండి, తెల్ల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) కలిగి, వారి ఆధార్ నంబర్ విద్యుత్ కనెక్షన్ కస్టమర్ IDతో లింక్ అయి ఉండాలి. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉన్న గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కావలసిన పత్రాలు:కరెంట్ బిల్లు, చివరిగా చెల్లించిన బిల్లు రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అన్ని అర్హతలు ఉండి కూడా బిల్లు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సవరించిన బిల్లు (జీరో బిల్లు) జారీ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అర్హులైన వినియోగదారులు జీరో బిల్లును పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ ప్రద్యుమ్న
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ ఎస్సీ హాస్టల్ ను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు ఉన్నాయా..విద్యార్థులు ఎంత మంది ఉన్నారంటూ ఆరా తీశారు. మీరు చక్కగా చదువుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని పరిష్కరిస్తానన్నారు. ఆయన వెంట గ్రామస్తులు అనిల్, సంజీవ్, శ్రీకాంత్, సంతోష్, దమ్మన్న తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ హితమైన కాటన్ మాంజాను ఉపయోగించాలి
* చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కేంద్రం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేటర్.డా అమృత్ కుమార్, చేయూత ఫౌండేషన్ ఛైర్మన్ డా.యన్.టి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డా.యన్.టి. రమణ మాట్లాడుతూ..పండగల సమయంలో గాలి పటాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న చైనా మాంజా దారం ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని, చైనా మాంజా దారంలో గ్లాస్ పౌడర్, నైలాన్ దారం వంటివి ఉపయోగించడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. పక్షులు, జంతువులు మృతి చెందుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, యువత, ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లుతున్నారని, ప్రత్యేకంగా రోడ్లపై వేగంగా ప్రయాణించే వాహనదారుల మెడ, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు కలుగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చైనా మాంజా తయారీ, విక్రయాలు, వినియోగం నిషేధించాలన్నారు. స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డా.అమృత్ కుమార్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు పిల్లలను చైనా మాంజాకు దూరంగా ఉంచాలన్నారు. పర్యావరణ హితమైన కాటన్ మాంజా మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ సంస్థలు & చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల నేరడిగొండ ప్రధానోపాధ్యాయురాలు, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు మీనా, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
కడెం మండల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలి
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్, చిన్న బెల్లలు సర్పంచ్ బొంతల భూమన్న, పెద్ద బెల్లల్ సర్పంచ్ తిరుపతి తదితరులు కలిసి డిపో మేనేజర్ సరస్వతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. మెట్ పల్లి డిపో నుండి మెట్పల్లి, కోరుట్ల, పైడిమడుగు, రాయికల్ మీదుగా బోర్నపల్లి కడెంకు బస్సు సర్వీస్ నడపాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆమె వెంటనే బస్ సౌకర్యం కల్పించేలాచర్యలు తీసుకుంటానని చెప్పారు.
ముందుస్తు జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు..
చిత్రం న్యూస్, జైనథ్: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ముందుస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలుపుతూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తోందన్నారు. లైట్ మోటార్ వెహికల్ నడిపే వాహనదారులు డ్రైవింగ్ సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడవద్దని పిల్లలు తమ తల్లి తండ్రులకు చెప్పాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలె,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సర్పంచుల సంఘం సాత్నాల మండల అధ్యక్షుడిగా కుంచాల మహేందర్
చిత్రం న్యూస్, సాత్నాల: సర్పంచుల సంఘం సాత్నాల మండల కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని కాన్ప మేడిగూడ(ఆర్) గ్రామంలోని రైతువేదికలో 10 మంది సర్పంచులతో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా కుంచాల మహేందర్, ఉపాధ్యక్షులుగా మెస్రం శ్యాంరావు, కామ్రే కిషోర్, కోశాధికారిగా ఆత్రం శ్యాంసుందర్ లను ఎన్నుకున్నారు. ఎన్నికైన మండల కమిటీ సభ్యులను సర్పంచులు ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం_ఎంపీడీవో వెంకట్ రాజు
చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని సాత్నాల ఎంపీడీవో వెంకట్ రాజు, తహసీల్దార్ జాదవ్ రామారావు అన్నారు. మండలంలోని కాన్ప మేడిగూడ (ఆర్) గ్రామంలోని రైతువేదికలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆ దిశగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో రాథోడ్ కైలాష్, ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.
కూరలో వెలగని వీధి విద్యుత్తు దీపాలు
చిత్రం న్యూస్, జైనథ్: రాత్రి పూట వీధి దీపాలు వెలగడం లేదని జైనథ్ మండలం కూర గ్రామంలోని కొత్త కాలనీవాసులు వాపోయారు. చీకట్లో బయటకు వెళ్లాలంటే జంకుతున్నామని, తమ సమస్యలు చెప్పినప్పటికీ పంచాయతీలో నిధులు లేవని సాకు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి లైట్లు వెలిగేలా ఏర్పాటు చేయాలని కొత్త కాలనీవాసులు కోరుతున్నారు.










