చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: మహిళలకు ఉన్న ప్రత్యేక రిజర్వేషన్ల కారణంగా అధికారం కోసం, ఇంట్లో ఉన్న తమ ఆడవారితో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు మగవారు. ఆ విధంగా పదవిలో నామమాత్రంగా మహిళలు ఉంటున్నారు. పెత్తనం మాత్రం మగవారు చేస్తున్నారు. వాళ్లు కూడా భర్తకు ఎదురు చెప్పలేని స్థితిలో బాధ్యతలను మగవారికే అప్పగిస్తున్నారు. ఇలా భర్తలే నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు హాజరవ్వడం వంటి సంఘటనలు పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉద్దేశం పక్కదారి పడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రతినిధి ఆమె :వనితలకు పదవులు, రాజకీయాలు కొత్తే కావొచ్చు. ఇప్పటివరకు ఇంటి పనులకో, వ్యవసాయానికో పరిమితమై ఉండొచ్చు. పాలనానుభవం పెద్దగా లేకపోవచ్చు. అయితేనేం! ప్రజా సమస్యలపై వారికీ అనుభవం ఉండే ఉంటుంది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధి ఆమె. అయినా సొంతింటి వారే బయటకు రాకుండా చిన్నబుచ్చుతుంటే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ‘సర్పంచ్ సాబ్’ అని నలుగురు పిలుస్తుంటే పులకరిస్తున్నారే తప్ప, మన ఇంటి ఆడపడుచును ‘పతిచాటు సతి’ అని పదుగురిలో పలుచన చేస్తున్నామని గ్రహించడం లేదు.
ఇటువంటి ధోరణే ఇక్కడ: పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించిన వేళ, మహిళా సర్పంచుల పక్కనే వారి పతులకూ కుర్చీలు వేసి సన్మానాలు చేశారు. అంటే అటు కుటుంబీకులు, ఇటు జనం సైతం ‘అతడిదే పెత్తనం’ అని అంగీకరించినట్లేనా? సమీక్షలు అన్నింటికీ కుటుంబ సభ్యులు, భర్తలే ముందుంటున్నారు. భర్త చాటు భార్యగానే ఆమెకు స్థానం అధికారులే గుర్తుపట్టలేని పరిస్థితి. అధికారిక కార్యక్రమాలకు భర్తలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు.ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన భర్త కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండటం, ఎన్నికలు వచ్చినప్పుడు మహిళలు ప్రచారం కోసం తిరుగుతారని గెలుపొందిన తర్వాత బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మనదేశంలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నత శిఖరాల్లో పదవుల ఆచరించి ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఆచరణకు నోచుకోలేని మహిళలుగానే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళలకు దక్కే విధంగా ఆచరణ చేయాలని ఆశిద్దాం!












