చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి బావ మరిది అఖిల్ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి వెళ్లి అఖిల్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పుష్పాంజలి ఘటించారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోక ప్రవీణ్ రెడ్డితో పాటు సయ్యద్ ఇమ్రాన్, గడ్డం శ్రీకాంత్ రెడ్డి, రాం రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.
బేల నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు
బేల నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు
చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
బేలలో సోయా కొనుగోలు చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన
బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మాజీమంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో సబ్ మార్కెట్ యార్డులో మార్కెట్ అధికారులు సోమవారం సోయా కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోయా పంటను చూపిస్తూ బేల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రైతు సమస్యలు పరిష్కరించాలని రహదారి దిగ్బంధం చేశారు. తక్షణం పంట కొనుగోలు ప్రారంభించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, యువ నాయకుడు సతీష్ పవార్, నాయకులు గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడే, మస్కె తేజరావు, ఆకాశ్ గుండావార్, మిలింద్ నాగ్పురే తదితరులు పాల్గొన్నారు.
సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా
*రోడ్డుపైనే వంట వార్పు
*అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతులు
చిత్రం న్యూస్, సొనాల:కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ సొనాల మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాను నిర్వహించారు. వంట వార్పు చేసి అక్కడే భోజనం తిన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా, మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందన్నారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సొనాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పంటలను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేవారని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని, రైతులకు రావలసిన రైతుబంధు విడుదల చేయాలని, పత్తి పంటను పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని అన్నారు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సీఐ గురుస్వామి, ఏవో అక్కడకు చేరుకొని సముదాయించారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముత్తన్న, జనార్ధన్ ,ఇర్ల అభిలాష్, భీంరావు పాటిల్, యాల్ల సుధీర్ రెడ్డి, హరీష్, లంక లలిత, రామ్ కిషన్, వినోద్, సంజీవరెడ్డి, సుగుణాకర్ తుల, అభిలాష్, రాజన్న, ప్రదీప్, కృష్ణ, ఈశ్వర్, సంతోష్ ఇర్ల శ్రీధర్, నవీన్, శ్రీకాంత్, విట్టల్, మహేష్, ఆసిఫ్ షేక్, శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు
చిత్రం న్యూస్, భీంపూర్: సమృద్ధి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భీంపూర్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహకార కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ఎ.నవీన్ కుమార్ ను నియమించారు. భీంపూర్ లోని సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించగా సొసైటీలో (09) డైరెక్టర్ పోస్టు లకు ( 09) మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా మెస్రం దీపీక, సహ అధ్యక్షులుగా మెస్రం నాగమ్మ, కార్యదర్శిగా ఆత్రం సరస్వతి, కార్య నిర్వాహక సభ్యులుగా కుడుమెత సంగీత, గేడం పుష్పలత, కినక మమత, గేడం రూప, పెందుర్ మనీషా, తొడసం శశికళ బాయిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘ బలోపేతానికి పనిచేయాలని కోరారు. ఎన్నికైన సభ్యుల కాల పరిమితి (05) సంవత్సరాల వరకు ఉంటుంది. ఎన్నికైన సభ్యులకు ఎన్నికల అధికారి ఎ.నవీన్ కుమార్ ధృవీకరణ పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆదర్శ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామెల్లి శివకుమార్ కు సన్మానం
చిత్రం న్యూస్, కలెక్టరేట్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించి బాధ్యతలు చేపట్టిన భీంపూర్ మండలం ఆర్లీ (టి) కు చెందిన రామెల్లి శివ కుమార్ ను ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ యూనియన్ తరపున శనివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్ మాట్లాడుతూ..నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ కు యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. సహకార శాఖ పటిష్టత ను కాపాడుతూ, ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆత్మారామ్, శారద, అరుణ, ఉద్యోగులు విక్రాంత్, దేవేందర్ , దినేష్, సంతోష్, నయీం, సంజయ్, సంతోష్, దిరేష్, లక్ష్మీ, ఆశ జ్యోతి, రజిత , శశికళ, దేవు బాయి తదితరులు పాల్గొన్నారు.
వైభవోపేతంగా భావుబీజ్ వేడుకలు
చిత్రం న్యూస్, బేల: సోదర అనుబంధానికి, అనురాగాలకు ప్రతీగా నిలిచే భావుబీజ్ వేడుకలను శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. దీనిని మహారాష్ట్ర, గోవా, మరియు గుజరాత్‌లలో భావుబీజ్ అని పిలుస్తారు, ఇది “భాయ్ దూజ్” కు మరొక పేరు. మహారాష్ట్రలోని ఈ పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోగా సరిహద్దులోని ఇక్కడి ప్రాంత మరాఠీ ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్, బేల, జైనథ్, భీంపూర్ మండలాల్లో ఈ పండగను వేడుకగా నిర్వహించారు. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటుతూ వేడుకలు నిర్వహించగా సోదరీమణులు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. సోదరులు వారికి కానుకలు అందజేసి తమ ప్రేమను చాటుకున్నారు. భావు బీజ్ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
పత్తి ముజ్జుకు లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పత్తి ముజ్జును కాంగ్రెస్ సీనియర్ నాయకులు, న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి పరామర్శించారు. గత రెండు రోజుల క్రితం పత్తి ముజ్జు సోదరి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం పత్తి ముజ్జు నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పత్తి ముజ్జు సోదరి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. లోక ప్రవీణ్ రెడ్డి వెంట మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
సహృదయ్ యాదవ్ కు ఎంబీబీయస్ సీటు
విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు
చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ కుమారుడు సహృదయ్ యాదవ్ కు యం. ఎంబీబీఎస్ లో సీటు వచ్చిన సందర్బాన్ని పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి స్వీట్స్, పసందైన చికెన్ తో కూడిన విందుభోజనం ఏర్పాటు చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మా పెద బాబు సహృదయ్ యాదవ్ కు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది అని అన్నారు. పాఠశాల విద్యార్థులకు చదువు యొక్క విలువను తెలియజేయడం జరిగింది అని అన్నారు. డాక్టర్ కావడం మా బాబు కల అని, గిరిజనులకు, పేదలకు సేవ చేయాలనే లక్ష్యం ఉందని అని అన్నారు. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందం ఉంది అని అన్నారు. మా బాబులాగా మరింత ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో జామిని గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ, లక్ష్మణ్, దూస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మూనాహిద్,మోహిజే పోచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా
వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా
*ఒకరికి తీవ్రగాయాలు, మరొకరికి విరిగిన కాలు
*తప్పిన పెను ప్రమాదం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రహదారిలో వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి కాలు విరిగింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం బోరేగాం నుంచి వడతల్ వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










