Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 16

బాసరలో ఘనంగా జగద్గురు నరేంద్ర స్వామి పాదుక రథయాత్ర

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో జగద్గురు నరేంద్ర స్వామి పాదుక రథయాత్రను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామానందచార్య సాంప్రదాయ సేవ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వామీజీ రాకతో ప్రత్యేక పూలదండలతో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.  స్వామి పాదుకలను పురవీధుల గుండా భాజా భజంత్రీల మధ్య భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో  చేపట్టారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి  

0

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛరణలతో సరస్వతి అమ్మవారికి అభిషేకం,అర్చన, మహా హారతి, గణపతి పూజ, సరస్వతి మంత్రపుష్పం, సరస్వతి పారాయణం పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి చెంత భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి గంటల సమయం పట్టింది.

ఆదిలాబాద్ జిల్లాలో “పోలీస్ అక్క” కార్యక్రమం ప్రారంభం

0

*వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో “పోలీస్ అక్క” అనే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ (“పోలీస్ అక్క”) ఉంటారు. వీరు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి బాలికలతో మమేకమై  గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ఈవ్-టీజింగ్ & సైబర్ వేధింపులు,పోక్సో చట్టం, చట్టపరమైన హక్కులు, సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం, స్వయం రక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో 250 మందికి పైగా విద్యార్థినుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షీ టీమ్‌తో కలిసి జిల్లాలోని అన్ని పాఠశాలలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి బాలిక రక్షించబడినట్లు, సమాచారం పొందినట్లు, సాధికారత పొందినట్లు భావిస్తుంది. పోలీసు వ్యవస్థ విద్యార్థులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలోని శ్రీ వీరహనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తిక శుక్ల ద్వాదశి ఆదివారము రోజు పూజ ప్రారంభమై కార్తీక శుక్ల త్రయోదశి  సోమవారము ఉదయం 10:21ని. లకు ఉత్తరబాద్ర నక్షత్రంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం పూజారి చేపట్టారు.  గ్రామ ప్రముఖుడు లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు యజ్ఞ, హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హారతి కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ధ్వజస్తంభం కోసం తమ వంతుగా రూ.12 వేలు అందజేశారు.

మాజీ మంత్రి హరీష్ రావుకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్  పరామర్శ

0

చిత్రం న్యూస్, ముథోల్: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మరణించడంతో హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన బోథ్  సీఐ 

0

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిలహాజన్ ను బోథ్ సీఐ గురుస్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు.  ఎస్పీ  మాట్లాడుతూ..బోథ్ సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో గంజాయి, గుడుంబా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా కృషి చేయాలని, పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో సేవలు అందించిన డి. గురుస్వామి నూతనంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు. అంతకు ముందు స్పెషల్ బ్రాంచ్ వరంగల్ లో విధులు నిర్వర్తించి, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ సీఐగా గురుస్వామి బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో నేర నియంత్రణ, ప్రజా రక్షణ, శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధతతో పని చేస్తానని సీఐ తెలిపారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం భూసేకరణకు అనుమతి

0

చిత్రం న్యూస్,అదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్‌లో విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని సేకరించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (పౌర, వాయుసేన అవసరాల కోసం) అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన సాంకేతిక-ఆర్థిక అధ్యయన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ భూసేకరణకు ఆమోదం తెలిపింది. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌లోనూ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రాబోయే రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఏఏఐ యోచిస్తోంది.

భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏఏఐ సిద్ధంగా ఉంది. ఆదిలాబాద్ కలెక్టర్ దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌లో పౌర విమాన కార్యకలాపాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పథ సంచలనం 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పథ సంచలనం (రూట్ మార్చ్) నిర్వహించారు. స్థానిక డైట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ పథ సంచలనం వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా తిరిగి డైట్ గ్రౌండ్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎంపీ జి.నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ బలవత్రి గణేష్, విభాగ్ సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతుల కళ్యాణ్ రెడ్డి, ఇందూర్ విభాగ్ కార్యవాహ్ దిగంబర్, ఇతర రాష్ట్రీయ స్వయం సేవకులు, పలువురు పాల్గొన్నారు.

నేడు జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి కల్యాణోత్సవం , రథోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం నవంబర్ 10వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుండి 16 వరకు వారం రోజుల పాటు జాతర జరగనుంది. ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం, ఇది జైనుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. సంవత్సరానికి  రెండు సార్లు సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఈ ఆలయ ప్రత్యేకత. పక్క రాష్ట్రం మహరాష్ట్రతో పాటు రాష్ట్రంలోని నలుమూలల  నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.

రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులను సీజ్ చేస్తాం

0

చిత్రం న్యూస్,ముథోల్: రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హెచ్చరించారు. ఆదివారం ముథోల్ మండలం బ్రహ్మణ్‌గావ్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి ధాన్యం అమ్మకాల్లో కోత పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లను ఏ మాత్రం ఉపేక్షించమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే సంబంధిత రైస్ మిల్లులను సీజ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంటే విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన  పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.