చిత్ర న్యూస్, ఫిల్మ్ నగర్: ఆస్కార్ అవార్డ్ మిస్సింగ్ అనే టైటిల్ తో ఆస్కార్ అవార్డ్ చుట్టూ తిరుగుతూ మంచి కామెడీ జోనర్‌లో అందరిని నవ్వించాడనికి ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరంగల్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో షూటింగ్ పూర్తిచేసి, ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని సినిమా విడుదలకు సిద్ధం కాబోతుంది. ఇందులో హీరోగా ఆర్ కే మాస్టర్, హీరోయిన్ గా అయేషా టాకియా, నటులు అలీ ,చలాకీ చంటి, గడ్డం నవీన్, మంగళవరం ఫేమ్ లక్ష్మణ్, పుష్ప ఫేమ్ కేశవ, ఇంకా జబర్దస్త్ టీమ్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వినయ్ నిర్మాత కాగా పీ ఆర్ వో వికాస్. ఆర్ కే మాస్టర్ (రాధా కృష్ణ) నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరిట జోరుగా ఇసుక వ్యాపారం
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుక వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక అనుమతి పత్రంతో పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల తరలిస్తున్నారు. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న వ్యాపారులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బేల మండలంలోని కాంగార్ పూర్ పెన్ గంగా నుంచి ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణ జరగుతోంది. అక్రమ రవాణ చేస్తున్న ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకుంటున్న ఆయా శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు ఒక ట్రాక్టర్ కి కేవలం వారం రోజులు పర్మిషన్ ఇవ్వాలి కానీ తహసీల్దార్ కార్యాలయంలో రాబోయే నెలకు కూడా ముందస్తుగానే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రఘునాథ్ రావ్ ను వివరణ కోరగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పేరుతో వ్యాపారం చేసిన వారిపైన చట్యరిత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి వారి పైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మీదట రాత్రి పూట తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
ఘనంగా శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: శ్రీ సత్యసాయి బాబా యొక్క 100వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,బీజేపి నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు. ముందుగా వారు శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రపంచంలో 140 దేశాల్లో బాబా భక్తులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదన్నారు. బాబా చేసిన బోధనల్లో అన్ని విషయాలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. సత్యసాయి సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
జైనథ్ మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు!
ఎస్టీ(2), ఎస్సీ(3), బీసీలకు(3) కేటాయింపులు, (9) జనరల్ స్థానాలు
చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో సర్పంచ్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా దాదాపుగా ఖరారయ్యాయి. మొత్తం 17 స్థానాలకు కేటాయింపులు జరిగాయి. ఈ రిజర్వేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి:
ఎస్టీ (ST) – 2 స్థానాలు: బెల్గాం: మహిళా జనరల్, మాకోడ: జనరల్
ఎస్సీ (SC) – 3 స్థానాలు: బహదూర్ పూర్: జనరల్, కరంజి కె.: మహిళ కాప్రి: జనరల్
బీసీ (BC) – 3 స్థానాలు: లక్ష్మీపూర్: జనరల్, కంఠ: మహిళ, సాంగ్వి కె.: జనరల్
జనరల్ స్థానాలు (9): అడ: జనరల్ మహిళ, దీపాయిగూడ: జనరల్ మహిళ, జైనథ్: జనరల్ మహిళ, కౌట: జనరల్ మహిళ, ఆకుర్ల: జనరల్, బెల్లూరి: జనరల్, కూర: జనరల్, నిరాల: జనరల్, పిప్పల్ గావ్: జనరల్.
ఈ విధంగా మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు దాదాపుగా ఖరారు అయినట్టే. గతంలో (2019 ఎన్నికల్లో) రిజర్వు చేసిన స్థానాలను రొటేషన్ విధానం ప్రకారం మార్చాల్సినందున.. పాత జాబితాను నిశితంగా పరిశీలిస్తూ తాజాగా స్థానాలను కేటాయించారు. రిజర్వేషన్ల నిర్ధారణలో ఈసారి బీసీ కేటగిరీకి సంబంధించిన కోటాలో కీలకమైన మార్పు జరిగింది. గత సెప్టెంబరులో ప్రాథమికంగా ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల జాబితాలో బీసీ కేటగిరీకి 42% స్థానాలు కేటాయించారు. తాజాగా పూర్తి చేసిన కసరత్తులో.. బీసీ కేటగిరీ స్థానాలను 22.3 శాతానికి తగ్గించారు. దీనివల్ల బీసీలకు కేటాయించాల్సిన మిగిలిన 19.7 శాతం సీట్లను జనరల్ కేటగిరీ కిందకి మార్చారు. ఈ కసరత్తులో భాగంగా మహిళా రిజర్వుడు స్థానాలను ఎంపిక చేసి, మొత్తం తుది జాబితాను ఖరారు చేసారు. ఆ తర్వాత వెంటనే, జిల్లాల వారీగా నిర్ధారణ అయిన రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలి కార్యాలయానికి పంపిస్తారు. అయితే..ఈ రిజర్వేషన్ల జాబితా ఇప్పుడే అధికారికంగా విడుదల కాదు. ఈ నెల నవంబర్ 24న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ తర్వాత రోజు.. నవంబర్ 25న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్లపై మరోసారి కసరత్తు చేసి అధికారికంగా తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహులంతా హైకోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం, తుది రిజర్వేషన్ల జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మెుత్తంగా డిసెంబర్ తొలివారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
AYYAPPA SWAMI: అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన షేక్ అలీ
చిత్రం న్యూస్, బోథ్ : మతసామరస్యానికి మన దేశంలో కొదవలేదు. ప్రపంచంలోనే మన దేశం సమైక్యతకు ప్రాతిక ప్రతిరూపంగా నిలుస్తుంది. అన్ని పండుగలను కుల మతాలకతీతంగా సామరస్య పూర్వకంగా కలిసిమెలిసి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామానికి చెందిన షేక్ అలీ గురువారం అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ఎంత పవిత్రంగా కఠోర ఉపవాసాలతో జరుపుకుంటాము అలాగే అయ్యప్ప స్వాములు నెల రోజులపాటు కఠిన నియమాలతో అంతే గొప్పగా స్వామి పై తన భక్తిని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఎటువంటి భేదభావ్యం లేకుండా అన్ని పండుగలను కుల మతాలకతీతంగా ఐక్యమత్యంతో కలిసి జరుపుకోవాలని తెలిపారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఆ స్వామి ఆశీస్సులతో సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి బద్దం రమణారెడ్డి, అరుణ్ రెడ్డి, సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, జైపాల్ రెడ్డి,అమరేందర్ రెడ్డి, సంతోష్, రమేష్, భోజన్న, స్నేహిత్ రెడ్డి పురుషోత్తం, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని బేలలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు ఏబీవీపీ నేతల వినతి
చిత్రం న్యూస్, బేల : బేలలోని డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని బేలలో కాకుండా అదిలాబాద్ కు మార్చడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు ఏబీవీపీ నేతలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించారు.సానుకూలంగా స్పందించిన ఆయన కేయూ అధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాన్ని యధావిధిగా బేలలోనే ఏర్పాటు చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తరుణ్, శ్రీకాంత్, కుర్మా పవన్ రెడ్డి, యోగేష్, బాలాజ, వద్యార్థులు తదితరులు పాల్గొన్న
కలెక్టర్ రాజర్షి షాకు TGO, TNGO సంఘాల అభినందనల వెల్లువ
చిత్రం న్యూస్: ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు టీఎన్జీవో యూనియన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అభినందనలు వెల్లువెత్తాయి. జల సంరక్షణ, నీటి వనరుల సద్వినియోగం’ అంశంలో ఆదిలాబాద్ జిల్లాను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాను గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. మెమొంటో, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..కింది స్థాయి ఉద్యోగుల కృషి వల్లే మన జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.
జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కే.శివకుమార్, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ ఎ.నవీన్ కుమార్ మాట్లాడుతూ.. కలెక్టర్ కు జిల్లా స్థాయిలో లభించిన గుర్తింపుతో జిల్లా ఉద్యోగులందరూ మరింత స్ఫూర్తితో జిల్లా ప్రజలకి సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో TGO యూనియన్ జిల్లా సెక్రటరీ రామారావు రాథోడ్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు సంద అశోక్ , టీఎన్జీవో నాయకులు తిరుమల్ రెడ్డి ,గోపి, చంద్ర మోహన్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, రవి , అసురీ ప్రవీణ్, కె.అరుణ్ కుమార్, సోహైల్, సంజయ్ ,TGO భాద్యులు రాజేష్ , శ్రీనివాస్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, భగత్ రమేష్, రమణ చారి , వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు నర్సింలు , ఓం ప్రసాద్, సుజాత, రాధ , ప్రభుత్వ డ్రైవర్స్ సంఘం అధ్యక్షులు సఫ్దర్ అలీ , వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
కేటీఆర్ ది డ్యామేజ్ కవర్ చేసుకునే పర్యటన -ఆడె గజేందర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ కు చేసిన డ్యామేజీని కవర్ చేసేందుకే ఆదిలాబాద్ లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన జరిగిందని బోథ్ అసెంబ్లీ ఇంఛార్జి ఆడె గజేందర్ అన్నారు. బుధవారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను వస్తున్నానని తెలిసి మార్కెట్ బంద్ పెట్టారని కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర జిన్నింగ్ యజమానుల పిలుపు మేరకు మార్కెట్ బంద్ అయ్యింది కాని కేటీఆర్ ఇక్కడికొచ్చి ఏదో ఉద్ధరిస్తారని మార్కెట్ బంద్ కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల శ్రేయస్సు గాలికొదిలేసిన మీరు ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మాట్లాడటం, వారిపై లేని ప్రేమను ఒలక బోయడం విడ్డూరంగా ఉందన్నారు. మీ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులు బోథ్ లో తెల్ల జొన్నల రైతులను ఇబ్బందులకు గురి చేయలేదా అని ప్రశ్నించారు. ఇదిగో రుణమాఫీ అంటూ ఆశ చూపారే కాని ఇచ్చింది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రూ.రెండు లక్షల రుణ మాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 12వేల రూపాయల రైతు భరోసా ఇస్తుందని, మీ హయాంలో బడా భూస్వాములకు మేలు చేసేలా గుట్టలకు, పుట్టలకు ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన చూసి ఓర్చుకోలేక ఇక్కడికొచ్చి రైతులను రెచ్చగొట్టి పోదామనే ఆలోచన తప్ప మరోటి కాదన్నారు.మీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు లేవని, ఉన్నవి కాస్తా ఎత్తేసారని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం అనేక సబ్సిడీలు ఇస్తోందన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5లక్షలు ఇస్తుందన్నారు. రైతులను మోసం చేసిన చరిత్ర మీదైతే రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం తమదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కేటీఆర్ పలికిన ప్రగల్భాలకు అక్కడి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు.త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఇక బీజేపీ ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెందిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లకు రైతు గోస పట్టదన్నారు. సీసీఐ తేమ నిబంధనలపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి పరిష్కరించడంలేదని ప్రశ్నించారు. విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకుంటున్న కేంద్రం స్థానిక రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. మన పత్తి విదేశాలకు ఎగుమతి అయ్యేలా స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలే కాని వారికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో గెలుస్తామని విర్రవీగిన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిందని అన్నారు. ప్రతిపక్షాలకు నిజంగా ప్రజలు, రైతులపై ప్రేముంటే అభివృద్ధికి సహకరించాలే కానీ అనవసరంగా విమర్శలు గుప్పించవద్దని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి , గిమ్మ సంతోష్ రావు , లోక ప్రవీణ్ రెడ్డి , రంగినేని శాంతన్ రావు,బండారి సతీష్, రఫీఖ్, జాఫర్ అహ్మద్,డేరా కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Former prime Minister indira gandhi: ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ తన హయాంలో ఎన్నో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని ప్రగతి పథాన పయనింపచేసేలా చేసిందని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. భారత రత్న, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించారని కొనియాడారు. భారత్ లో అలీనోద్యమ దేశాల సమావేశంతో పాటు కామన్‌వెల్త్ దేశాల సమావేశాన్ని కూడా నిర్వహించి తద్వారా భారత దేశ కీర్తిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచిన మహనీయురాలని కీర్తించారు. ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలాల్లో ఆమె చూపిన ధైర్యం, సంకల్పం, నిర్ణయ సామర్థ్యం ఈ తరం మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తాయని, సమానత్వం, స్వయం సమృద్ధి, శక్తివంతమైన భారత్ కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని శాంతన్ రావు, ఎంఏ షకీల్, కందుల సుఖేందర్, రఫీక్, సురేందర్, గౌతమ్ రెడ్డి, అతీఖ్, తౌసీఖ్, బెదోడ్కర్ మోతీరం, తుమ్మ ప్రకాష్, ఖలీల్ ,రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
దుప్పట్లు పంపిణీ చేసి..ఉదారత చాటుకుని
చిత్రం న్యూస్, బేల: చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు చలి దుప్పట్లు పంపిణీ చేసే ఉదారత చాటుకున్నారు బేల మండలం అవాల్పూర్ గ్రామానికి చెందిన జై హనుమాన్ ఫర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది వృద్ధులకు, పేదలకు వీటిని పంపిణీ చేశారు. చలితో ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేయాలని తన తండ్రి సలహాతో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు సుశాంత్ రెడ్డి. దుప్పట్లను పంపిణీ చేయడంతో వృద్ధులు, పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.









