కలెక్టర్ చొరవ: గిరిజన రైతు దశాబ్దాల భూ సమస్యకు మోక్షం
చిత్రం న్యూస్, భీంపూర్, (ఆదిలాబాద్): నిరుపేద గిరిజన రైతుల సమస్యల పట్ల జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందిస్తే ఎంతటి ఫలితం ఉంటుందో భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామంలో నిరూపితమైంది. కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో మడవి గంగారాం అనే గిరిజన రైతుకు చెందిన 9 ఎకరాల భూ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది.
సమస్య నేపథ్యం: గొల్లఘాట్ గ్రామానికి చెందిన రైతు మడవి గంగారాంకు సర్వే నంబర్ 74/1/3లో 9.00 ఎకరాల సాగు భూమి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల గతంలో ఈ భూమి ‘నిషేధిత జాబితా’లో (Prohibited List) చేరిపోయింది. దీనివల్ల ఆయన దశాబ్దాలుగా ఆ భూమిపై హక్కులు ఉన్నప్పటికీ, పట్టా పొందలేక ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు.పరిష్కారం ఇలా..ఈ సమస్యపై రైతు గంగారాం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన వెంటనే స్పందించారు. ‘భూభారతి’ ద్వారా ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ బృందం క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, భూమి రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం గంగారాం పేరిట భూమిని నమోదు చేశారు.అనంతరం ఆయనకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. తన దశాబ్దాల సమస్య తీరడంతో సంతోషం వ్యక్తం చేసిన గంగారాం, కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షాను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. “నా భూమి నాకు దక్కింది, ఇప్పుడు నేను ధైర్యంగా సాగు చేసుకోవచ్చు” అని ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు.




