ఆదిలాబాద్లో గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్యాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- చించుఘాట్లో రాయ్ సెంటర్ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చించుఘాట్ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్య అభివృద్ధిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రాయ్ సెంటర్ (RAI Center) / గిరిజన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శాస్త్రోక్తంగా పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గిరిజన తండాల్లోని యువతను స్వయం ఉపాధి బాటలో నడిపించడానికి రాయ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 106 రాయ్ సెంటర్లు మంజూరయ్యాయని, వాటి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా అవసరమైన 46 ప్రాంతాలను గుర్తించి, కొత్త రాయ్ సెంటర్ల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అవి కూడా మంజూరవుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయాకర్, సంతోష్, చించుఘాట్ గ్రామస్తులు, గిరిజన పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

